Marriage Tragedy: నిశ్చితార్థం అయ్యాక పెళ్లికి నో చెప్పిన యువకుడు.. యువతి చేసిన పనికి అందరూ షాక్.. | కడప వార్తలు (Kadapa News)


Last Updated:

కడపలో గోల్డ్ మెడలిస్ట్ ఎమ్మెస్సీ యువతి రెహానా, ప్రొద్దుటూరు యువకుడు షాజహాన్ నిశ్చితార్థం తర్వాత అతని మానసిక వేధింపులతో ఆత్మహత్య, పోలీసు కేసు నమోదు

News18
News18

పెళ్లంటే నూరేళ్లు పంట అంటారు పెద్దలు.. కానీ పెళ్లికి ముందే ఆ పంట బూడిదై పోయింది.. పెళ్లి చేసుకుంటానని చెప్పి నిశ్చితార్థం చేసుకుని ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ యువతిని నట్టేట ముంచేశాడు ఆ యువకుడు.. నేటి ఆధునిక కాలంలో చదువు, ఉద్యోగం ఉంటే చాలని భావిస్తాం, కానీ మానసిక ధైర్యం, సరైన తోడు లేకపోతే జీవితం ఎంతటి ప్రమాదంలో పడుతుందో ఈ ఘటన అద్దం పడుతోంది. కడప నగరంలోని పటేల్ రోడ్డుకు చెందిన రెహానా (26) అనే యువతి ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టించింది.

రెహానా చదువులో ఎంతో ప్రతిభావంతురాలు. ఆమె ఎమ్మెస్సీ (M.Sc) పూర్తి చేసింది. ఆమె ప్రతిభకు గుర్తింపుగా ఇటీవలే గవర్నర్ చేతుల మీదుగా పట్టా, గోల్డ్ మెడల్ అందుకుంది. ఒకవైపు కెరీర్ పరంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న ఆమెకు, కుటుంబ సభ్యులు పెళ్లి సంబంధం నిశ్చయించారు. ప్రొద్దుటూరుకు చెందిన షాజహాన్ అనే యువకుడితో ఆమెకు ఫిబ్రవరి 15న వైభవంగా నిశ్చితార్థం జరిగింది. షాజహాన్ బెంగళూరులో ఐటీ (IT) ఉద్యోగం చేస్తున్నాడు.

నిశ్చితార్థం జరిగిన నాటి నుంచి రెహానా, షాజహాన్ ఫోన్లలో మాట్లాడుకునేవారు, ఛాటింగ్ చేసేవారు. అయితే, కొద్దిరోజుల తర్వాత షాజహాన్ ప్రవర్తనలో మార్పు వచ్చింది. అతను రెహానాతో ఫోన్లో మాట్లాడుతూ.. “నువ్వంటే నాకు ఇష్టం లేదు, నిన్ను చూస్తుంటే నాకు ఎలాంటి ఫీలింగ్స్ రావడం లేదు” అని ముక్కుసూటిగా చెప్పడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా, తనకు గతంలోనే నలుగురు గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నారని, ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని పదేపదే అనేవాడు.

మొదట్లో రెహానా ఈ మాటలను ఏదో సరదాగా అంటున్నాడని భావించి పెద్దగా పట్టించుకోలేదు. కానీ రోజురోజుకూ షాజహాన్ వేధింపులు ఎక్కువయ్యాయి. నిశ్చితార్థం జరిగిన అమ్మాయితో ఇలాంటి మాటలు అనడం ఆమెను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసింది.

షాజహాన్ మాటల వల్ల తీవ్ర మనస్తాపానికి గురైన రెహానా, ఇక తన జీవితానికి అర్థం లేదని భావించింది. సోమవారం నాడు తన గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు విడిచింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారించగా, ఆమె రాసిన 12 పేజీల సుదీర్ఘ సూసైడ్ నోట్ లభ్యమైంది. అందులో తను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణ, షాజహాన్ అన్న మాటలు, తన ఆవేదనను కూలంకషంగా వివరించినట్లు తెలుస్తోంది.

మంగళవారం రెహానా తండ్రి చిన్నచౌకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిశ్చితార్థం చేసుకుని, పెళ్లి పీటల వరకు వెళ్లాల్సిన సమయంలో తన కూతురిని మానసిక వేధింపులకు గురిచేసి ఆత్మహత్యకు ప్రేరేపించిన షాజహాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ఎస్సై ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు, సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఒక గోల్డ్ మెడలిస్ట్, ఎంతో మందికి స్ఫూర్తిగా నిలవాల్సిన యువతి ఇలాంటి అనాలోచిత నిర్ణయం తీసుకోవడం విచారకరం. నిశ్చితార్థం వంటి పవిత్ర బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం ఎంతటి వినాశనానికి దారితీస్తుందో ఈ ఘటన నిరూపిస్తోంది. ఆడపిల్లలకు చదువుతో పాటు, మానసిక ఒత్తిడిని తట్టుకునే ధైర్యాన్ని అందించాల్సిన అవసరం నేటి సమాజంలో ఎంతైనా ఉంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *