Last Updated:
Maha Mrityunjaya Homam: ఆయుర్దాయాన్ని పెంపొందించేందుకు, అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు, అకస్మాత్తు ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు హిందూ ధర్మంలో మహా మృత్యుంజయ హోమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది.
Maha Mrityunjaya Homam: ఆయుర్దాయాన్ని పెంపొందించేందుకు, అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు, అకస్మాత్తు ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు హిందూ ధర్మంలో మహా మృత్యుంజయ హోమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా జాతకంలో మారక దశలు, అరిష్ట యోగాలు ఉన్నవారు ఈ హోమాన్ని చేయించడం ద్వారా శుభ ఫలితాలు పొందవచ్చని సుందరాడకు చెందిన ప్రముఖ వేద పండితులు పులఖండం సుబ్రహ్మణ్య శర్మ చెబుతున్నారు.అయితే ఏ సందర్బంలో ఈ హోమం చేయవచ్చు..? దీనికి సంబంధించిన సందేహాలు, పూర్తి వివరాలను లోకల్18తో పంచుకున్నారు ప్రముఖ వేదాంతవేత్త సుబ్రహ్మణ్య శర్మ.
ప్రతీ వ్యక్తి జీవితకాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురవుతాయి. అంతే కాదు ఆనందంతో పాటు అనారోగ్య సమస్యలు కూడా అప్పుడప్పుడు మనిషికి పరీక్షలు పెడుతూ ఉంటాయి. అయితే వ్యక్తి జీవితానికి సంబంధించి జాతకంలో ఆయుర్దాయం తగ్గే సూచనలు కనిపించినప్పుడు లేదా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వేధిస్తున్నప్పుడు మహా మృత్యుంజయ మంత్ర జపంతో పాటు దశాంశ హోమం చేయడం ఎంతో శ్రేయస్కరమని వేదపండితులు పులఖండం సుబ్రహ్మణ్య శర్మ చెబుతున్నారు. సాధారణంగా ఈ మంత్రాన్ని లక్షసార్లు జపించిన తర్వాత, దాని పదో వంతు సంఖ్యతో హోమం చేయడం దశాంశ హోమంగా పరిగణించబడుతుంది. ఈ మహా మృత్యుంజయ మంత్రం జపించడంతో పాటు హోమం నిర్వహించడానికి శుభ ముహూర్తం నిర్ణయించడం ముఖ్యమైనది.
సాధారణంగా సోమవారం, ప్రదోష కాలం, మహాశివరాత్రి వంటి శివారాధనకు అనుకూలమైన రోజుల్లో ఈ హోమం నిర్వహించడం ఉత్తమంగా భావిస్తారు. అయితే వ్యక్తిగత జాతకానికి అనుగుణంగా వేద పండితుల సలహా తీసుకుని ముహూర్తం నిర్ణయించుకోవడం మరింత మంచిదంటున్నారు వేదపండితులు.
హోమంలో ఉపయోగించే ద్రవ్యాలకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. లాజరు (లాజాలు), ఎండిన కొబ్బరి, సమిధలు, నెయ్యి వంటి పవిత్ర పదార్థాలతో హోమం నిర్వహించాలి. ప్రతి ఆహుతి సమయంలో మహా మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ హవనం చేయడం వల్ల ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుందని విశ్వాసం.
“ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్” ఈ మంత్రాన్ని సంపుటితో (బీజాక్షరాలతో) జపిస్తూ హోమం నిర్వహిస్తే మరింత వేగంగా ఫలితాలు లభిస్తాయని సుబ్రహ్మణ్య శర్మ సూచిస్తున్నారు. సంపుటి మంత్ర జపం ద్వారా మంత్రశక్తి మరింత పెరుగుతుందని భావిస్తారు. ఈ హోమాన్ని వ్యక్తిగతంగా చేయడం కంటే అనుభవజ్ఞులైన వేద పండితుల ద్వారా చేయించడం శ్రేయస్కరం. శాస్త్రోక్త విధానంలో హోమం నిర్వహించబడితేనే పూర్తి ఫలితాలు లభిస్తాయని వారు చెబుతున్నారు.
హోమం అనంతరం రుద్రాభిషేకం, దానాలు చేయడం కూడా మంచిదిగా పరిగణించబడుతుంది. మహా మృత్యుంజయ హోమం కేవలం ఆచార పరమైన కార్యక్రమం మాత్రమే కాదు, మనసుకు ధైర్యం, ఆరోగ్యానికి రక్షణ, జీవితానికి శుభప్రభావాన్ని అందించే ఆధ్యాత్మిక సాధనగా భావించబడుతోంది. సరైన విధానంలో శ్రద్ధతో నిర్వహించిన ఈ హోమం జీవనంలో సానుకూల మార్పులను తీసుకురాగలదని విశ్వాసాన్ని వేదపండితులు వెల్లడిస్తున్నారు.
పంచాంగం, రాశులు, దినఫలాలు, వారఫలాలు, న్యూమరాలజీ, వాస్తు టిప్స్, ఆలయాలు, ఆచారాలు, సంప్రదాయాలు, ధార్మిక సంబంధమైన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆస్ట్రాలజీ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Vizianagaram,Andhra Pradesh


