Last Updated:
పలమనేరులో ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు, మాక్ డ్రిల్స్, ప్రదర్శనలతో అగ్ని భద్రతపై అవగాహన, అమరవీరులకు నివాళులు, సురక్షిత పాఠశాలలు ఆసుపత్రులపై దృష్టి
వేసవి ప్రారంభం అవుతుందంటేనే అగ్ని ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతుందనే భయం ప్రజల్లో ఉంటుంది. అలాంటి సమయాల్లో అగ్నిమాపక సిబ్బంది సేవలు ఎంత కీలకమో ప్రతి ఒక్కరికీ గుర్తుకొస్తాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు పలమనేరులో అగ్నిమాపక శాఖ అధికారులు అగ్నిమాపక వారోత్సవాలకు శ్రీకారం చుట్టారు.
పలమనేరులోని అగ్నిమాపక కేంద్రం ఆధ్వర్యంలో ఏప్రిల్ 14 నుంచి 20 వరకు ఈ వారోత్సవాలు నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టుతూ గోడపత్రికను ఆవిష్కరించారు. అగ్ని ప్రమాదాల సమయంలో ఎలా స్పందించాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించడమే ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశంగా అధికారులు తెలిపారు.
ఇప్పటికే పలమనేరులో అగ్నిమాపక సిబ్బంది పలు కళాశాలలు, బహిరంగ ప్రదేశాల్లో మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ ప్రజలకు ప్రత్యక్షంగా అవగాహన కల్పిస్తున్నారు. విపత్తు ఎక్కడైనా, ఎప్పుడైనా సంభవించవచ్చు కాబట్టి ముందస్తు జాగ్రత్తలే ప్రాణాలను కాపాడగలవని నిపుణులు చెబుతున్నారు. జిల్లా అగ్నిమాపక అధికారి సి. పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ వారోత్సవాలు, ఈ ఏడాది సురక్షిత పాఠశాలలు, సురక్షిత ఆసుపత్రులు అగ్నిమాపక భద్రతపై అవగాహనతో మంటలను నివారిద్దాం అనే నినాదంతో కొనసాగుతున్నాయి. సమాజంలోని ప్రతి వర్గం కలిసి పనిచేస్తేనే అగ్ని ప్రమాదాలను తగ్గించవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
వారోత్సవాల మొదటి రోజు అమరవీరుల స్మారక దినోత్సవంగా నిర్వహించారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అగ్నిమాపక సిబ్బందికి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేరళకు చెందిన సోనీ ఎస్ కుమార్, ఉత్తరాఖండ్‌కు చెందిన దుంగర్ సింగ్ వంటి అమరవీరులను స్మరించుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పలమనేరులో సర్కిల్ ఇన్స్పెక్టర్ కె. మోహన్ రెడ్డి హాజరై గౌరవ వందనం స్వీకరించారు.
1944 ఏప్రిల్ 14న ముంబై ఓడరేవులో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 66 మంది అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయిన ఘటనను స్మరించుకుంటూ ప్రతి ఏడాది ఈ వారోత్సవాలు నిర్వహిస్తారు. వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ, ప్రజల్లో భద్రతపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమాల లక్ష్యంగా కొనసాగుతోంది. ఈ వారోత్సవాల్లో భాగంగా పాఠశాలలు, ఆసుపత్రులు, వాణిజ్య సముదాయాల్లో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రదర్శనలు నిర్వహించనున్నారు. ఇంట్లో, కార్యాలయాల్లో గ్యాస్ సిలిండర్లు, విద్యుత్ పరికరాలు సురక్షితంగా ఎలా వాడాలో ప్రజలకు తెలియజేస్తారు. అగ్ని నివారణ కాపాడుదాం దేశ సంపదను కాపాడుదాం అనే నినాదంతో ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే ముందుగానే జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని గుర్తుచేస్తూ, ఈ వారోత్సవాలు ప్రజల్లో భద్రతపై కొత్త చైతన్యాన్ని తీసుకురావాలని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Chittoor,Chittoor,Andhra Pradesh


