సమూహంలో ఒంటరి – Visalaandhra


టప్… టప్… టప్… చినుకుల శబ్ధం. చూరు నుంచి కిందకు జారుతున్న భయం. ఆకుల గలగలలు లేవు. సాయం సంధ్యలో బెరుకుబెరుగ్‌గా కదులుతున్న చంద్రుడు. అక్కడ అతనొక్కడే. మోకాళ్ల మీద మోచేతులు ఆన్చి దానిపై తలవాల్చి కూర్చున్నాడు. ఇంటి అరుగు మీద ఒక్కో చోట కొంతసేపు కూర్చుంటున్నాడు. చుట్టూ లక్షలాది మంది నడుస్తున్నారు. నవ్వుతున్నారు. కేరింతలు కొడుతున్నారు. హాహాకారాలు చేస్తున్నారు. ఆనందిస్తున్నారు. అతనికి అవేవీ పట్టడం లేదు. చేయి చాస్తే ఏ ఒక్క హస్తమూ అతని దగ్గరకు రావడం లేదు. బిగ్గరగా ఏడుస్తున్నాడు. ఎవరికి వినిపించడం లేదు. తనలో తానే నవ్వుకుంటున్నాడు. ఒక్కోసారి ఆకాశం దద్దరిల్లేలా అరుస్తున్నాడు. చాలామందికి అతని గొంతు వినిపించడం లేదు. వినిపించిన వారంతా వెక్కిరింతగా చూస్తున్నారు. ఆ చెట్టుకవి ఇస్మాయిల్ అన్నట్లు ఈ ప్రపంచం ముల్లుని పీకి పారేసి చకచకా నడుచుకుంటూ వెళ్లిపోవాలనుకుంటున్నాడు. అతని కాళ్లని ఓ బంధం గట్టిగా పట్టుకుని వేల్లాడుతోంది. ఒకప్పటి ముగ్గురి ప్రపంచం ఇద్దరి ప్రపంచంగా మారిపోయింది. ఆ ముగ్గురున్నప్పుడు లోకం అతడి నవ్వులని కాంక్షించింది. ఆ ముగ్గురు ఉన్నప్పుడు లోకం అతని స్నేహం వాంఛించింది. ఇద్దరుగా మిగిలాక ఆ లోకం నెమ్మది నెమ్మదిగా దూరం అయ్యింది. “మేమున్నాం కదా” అంటారని అతగాడి ఆశ. “మేం లేమా” అని భుజాన చేయి వేస్తారని ఓ శ్వాస. అతనికి అన్నీ ఉన్నాయి. మిలమిల మెరిసే ఉంగరాలు, మెడలో తాచుపాములాంటి గొలుసులు. ఉబ్బిన పొట్టలా మనీపర్సు. పేటీఎం, ఏటీఎం అన్నీ అతని చుట్టూనే ఉన్నాయి. మనుషులే ఎక్కడా కానరావడం లేదు. వెతుకులాట అతని నిత్యకృత్యం. ఐదారేళ్లుగా వెతికి వెతికి కళ్లు వేసారిపోయాయి. రోగ్గరస్త జీవితం కాదు… ఒంటరిగ్రస్త బతుకు అతగాడిది. గతించిన కాలమున అతని వెంట అమ్మ ఉన్నది. తోబుట్టువులు, స్నేహితులు, ప్రియులు, ప్రియురాండ్రు, బంధువులు, సృజనకారులు, మనుషుల కోసం తృణప్రాయంగా బతుకులను అర్పించిన వారు, శతాధిక శత్రువులు అతని వెంట ఉండేవారు. తాను మాట్లాడితే పరవశించే వారు కోకొల్లలు. ఏరీ వారంతా… ఏమైపోయారని అతని వెతుకులాట. అందరూ తన చుట్టూనే ఉన్నా ఒంటరి కోయిల పాటలా జీవితం. వెనక్కి తిరిగిన పాదాలే అతనికి నిత్యం కంటపడుతున్నాయి. “ఎచటికి పోతావు ఈ రాత్రికి” అని అడిగే వారు కానరారు. “ఆవలి గట్టుకు” అంటూ అరచి చెప్పినా వినే వారు లేరు. వెన్నెలని చూసి జడుసుకునే వసంతం అతను. అమావాస్యని ముక్కలు ముక్కలుగా తుంచి అన్ని జేబుల్లోనూ నింపుకున్న ఏకాంతం. బతుకు పాటలా సాగాలన్న అతని కోరిక ఉరికొయ్యకు వేల్లాడుతోంది. జలపాతం రా రమ్మంటుంది. తనలోకి… తనతో తీసుకుపోతానని మారాం చేస్తోంది. వెళ్లాలని… దూకాలని… లీనం కావాలని… మమైకమవ్వాలని ప్రగాఢంగా ఉంది. మరణాన్ని కూడా కవిత్వం చేసుకోవాలని పిచ్చి. భుజాన వేల్లాడుతున్న బంధపు సంచీ వెనక్కి లాగుతోంది. ఎప్పటికైనా వెళ్లాల్సిందే కదా..! ఇప్పుడే వెళ్తే..! మనుషులు లేరు సరే… ఏనాటికైనా ఒంటరితనం లేకుండా పోతుందా అని ఓ ఆశ. తెలిసి తెలిసి రాలేదు కదా ఈ ప్రపంచంలోకి. కనీసం తెలియకుండా వెళ్లిపోవడమెందుకు…! ఉందాం. ఒంటరిగానే.. ఒక్కడిగానే…
సీనియర్ జర్నలిస్ట్, 99120 19929



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *