సోషలిస్టు వాస్తవికతావాది ఉరూబ్ – Visalaandhra


రచయిత కాదలుచుకున్న వారికి మానవతావాదం ఉండాలి. జీవితానుభవం లేని వారు రచయితలు కాలేరు. కేవల అనుభవం జీవితానుభవం కాదు. జీవితాన్ని అంటే తమ జీవితాన్ని మాత్రమే ఆధారం చేసుకోకుండా సమాజ జీవితాన్ని రంగరించిన వారికే జీవితానుభవం ఉంటుంది. జీవితానుభవం సంపాదించడానికి లోకాన్ని నిశితంగా పరిశీలించే తత్వం ఉండాలి.
సాహిత్యం కల్పనే కావొచ్చు. కాని ఆ కల్పనకు ఆధారం వాస్తవికతే. కవి కాని వాడు కథకుడు కావాలనుకోకూడదు అంటారు ప్రసిద్ధ మలయాళ రచయిత ఉరూబ్ (8 జూన్ 1915-11 జులై 1979). ఉరూబ్ అసలు పేరు పి.సి.కుట్టికృష్ణన్. కాని ఆకాశవాణిలో తన సహచరుడు, సంగీత దర్శకుడు కె.రాఘవన్ మాస్టర్ గురించి రాయవలసి వచ్చినప్పుడు కుట్టికృష్ణన్ ‘ఉరూబ్’ కలం పేరు వినియోగించారు. తర్వాత ఆ కలంపేరుతోనే రచనలు కొనసాగించారు. ఉరూబ్ అన్న మాటకు నిత్యయవ్వనం, ఉషస్సు వంటి అర్థాలు ఉన్నాయి.
రచనలు చేయడానికి కావాల్సిన తర్ఫీదు కోసం ఉరూబ్ ఉన్నత పాఠశాల విద్య పూర్తి అయిన తర్వాత ఆరేళ్ల పాటు అనేక ప్రాంతాలలో సంచరించారు. జీవితానుభవం సంపాదించారు. ఆయన సమకాలికులైన గొప్ప రచయితలతో విపరీతంగా చర్చలలో మునిగిపోయారు.
తన రచనలకు వస్తువు సమకూర్చుకోవడం కోసం ఉరూబ్ ఆసుపత్రులు, దుకాణాలు, వీధులు మొదలైన వాటిలో సంచరించే వారు. ఆయన నవల ‘ఉమ్మచ్చు’ ఇతివృత్తం కోర్టు వ్యవహారానికి సంబంధించింది. అందుకని కోర్టుకు హాజరై విచారణా ప్రక్రియను నిశితంగా పరిశీలించారు.
చిన్ననాట ఉరూబ్కు తాను జోతిష్యుడిని కావాలనే కోరిక ఉండేది. పోస్ట్మాన్ కావాలనే కోరికా ఉండేది. సుందరికలుం సుందరన్ మరుం నవలలో సోదె చెప్పే పాత్ర ఉంటుంది. జీవనాధారం సంపాదించడం కోసం ఉరూబ్ అనేకచోట్ల తిరిగి రకరకాల ఉద్యోగాలు, వృత్తులు చేపట్టవలసి వచ్చింది. లెక్కలు రాసే అకౌంటెంటుగా, అనువాదకుడిగా, ఉపాధ్యాయుడిగా, గుమాస్తాగా అనేక ఉద్యోగాలు చేశారు. తమ కొడుక్‌కు తిండి పెట్టడం కోసం ఉరూబ్, ఆయన భార్య దేవకి అమ్మ పస్తులు కూడా ఉండాల్సి వచ్చింది.
1930ల మధ్య కాలంలో వైకోం మహమ్మద్ బషీర్, తఖజి శివశంకర పిళ్లే, కేశవ దేవ్, పొట్టెక్కట్ వంటి ప్రసిద్ధ రచయితలతో కలిసి ఉరూబ్ కేరళలో అభ్యుదయ రచయితల సంఘం నెలకొల్పారు. ఉరూబ్ రాసిన సుందరికలుం సుందరన్ మరుం నవల మలయాళంలో అద్భుతమైన అభ్యుదయ రచనగా పేరు సంపాదించింది. ఆ నవలకే ఆయనకు సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఈ నవలలో ఎనిమిది మలబార్ కుటుంబాల మూడు తరాల కథ, 32 పాత్రలు ఉంటాయి. ఈ నవల నేపథ్యం రెండవ ప్రపంచ యుద్ధం.
1956లో మలయాళం మాట్లాడే మలబార్, కొచ్చిన్, ట్రావంకోర్ ప్రాంతాలను కలిపి కేరళ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. ఇది మలయాళం మాట్లాడే వారు రాజకీయంగా, భాషాపరంగా సమైక్యం కావడానికి తోడ్పడింది. 1957లో కేరళలో ఎ.ఎం.ఎస్.నంబూద్రిపాద్ నాయకత్వంలో ప్రపంచంలోనే మొట్ట మొదటి పార్లమెంటరీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పడింది. అప్పటి ముఖ్యమంత్రి నంబూద్రిపాద్ విస్తారంగా రాసిన రచయిత. సాహిత్య విమర్శకుడు, నవలా రచయిత జోసెఫ్ ముంటస్సెరీ విద్యాశాఖ మంత్రిగా ఉండేవారు. ఈ వాతావరణం మలయాళ రచయితలను సోషలిస్టు వాస్తవికత గురించి ఆలోచించేట్టు చేసింది. ఈ రాజకీయ, సామాజిక వాతావరణ ప్రభావం ఉరూబ్ మీద బాగా ఉండేది. మార్క్సిస్టు సిద్ధాంతం ఉన్నత వర్గాల వారినీ, అట్టడుగు వర్గాల వారిని కూడా అమితంగా ఆకర్షించింది. ఇది రచయితల మీద కూడా చాలా ప్రభావం చూపింది. ఉరూబ్ ఆ నేపథ్యంలోనే రచనలు చేశారు.
ఉరూబ్ జన్మ స్థలమైన పొన్నానిలో సాహిత్య విమర్శకుడు కుట్టికృష్ణ మరార్, ఎడస్సెరి గోవిందన్ నాయర్, అక్కితం, కడవానంద్ కుట్టికష్ణన్, మూతేదత్ నారాయణన్ వైద్యార్ వంటి కవులు ఉండేవారు. వీరితో కలిసి ఉరూబ్ సాహిత్య కృషి కొనసాగించారు.
ఉరూబ్ ఆకాశవాణిలో 1950 నుంచి 1975 వరకు పాతికేళ్లపాటు కోజికోడ్‌లో పని చేశారు. ఆ సమయంలోనే ఆయన రచనా వ్యాసంగం బాగా కొనసాగింది. ఆయన నవలలే కాకుండా కథలు, నాటకాలు, కొన్ని సినిమాలకు స్క్రీన్ ప్లే కూడా రాశారు. ఆరేడు వ్యాస సంకలనాలు కూడా వెలువరించారు.
ఉరూబ్ మీద దర్శకుడు రాజశేఖరన్ డాక్యుమెంటరీ సినిమా కూడా తీశారు. ఈ సినిమాలో ఉరూబ్ కుమారుడు సుధాకరన్ నటించారు. ఆయన అచ్చం తండ్రిలాగే ఉండేవారు.
-ఆర్వీ రామారావ్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *