కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాల్లో కౌలుట్లయ్య లేని లోటు.. భక్తుల చర్చ..


విశాలాంధ్ర–నార్పల: మండల పరిధిలోని గూగుడు గ్రామంలో 13 రోజులుగా వైభవంగా నిర్వహించిన శ్రీ కుళ్లాయి స్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం స్వామివారి చివరి దర్శనంతో ముగిశాయి. ఈ సందర్భంగా గత ఏడాది బ్రహ్మోత్సవాల నిర్వహణను గుర్తు చేసుకుంటూ పలువురు భక్తులు మాజీ శింగనమల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కౌలుట్లయ్య సేవలను స్మరించుకున్నారు. గత ఏడాది శింగనమల సీఐగా విధులు నిర్వహించిన కౌలుట్లయ్య బ్రహ్మోత్సవాల సందర్భంగా పోలీసు బందోబస్తును సమర్థవంతంగా నిర్వహించారని భక్తులు పేర్కొన్నారు. ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ఉత్సవాలకు తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, అధికారులు, వేలాది మంది భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శించుకునేలా చర్యలు తీసుకున్నారని గుర్తుచేశారు. ఎక్కడైనా చిన్నపాటి సమస్య తలెత్తితే వెంటనే స్పందించి అక్కడికక్కడే పరిష్కరించడంతో ఉత్సవాలు ప్రశాంతంగా జరిగాయని వారు తెలిపారు.
అయితే ఈ ఏడాది బ్రహ్మోత్సవాలకు కొద్ది రోజుల ముందే కౌలుట్లయ్య బదిలీ కావడంతో ఆయన లేని లోటు కనిపించిందని పలువురు భక్తులు అభిప్రాయపడ్డారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం బదిలీ చేసి ఉంటే మరింత అనుకూలంగా ఉండేదని వారు చర్చించుకున్నారు. గత ఏడాది ఆయన చూపిన సమన్వయం, విధి నిర్వహణ ఈసారి కూడా ఉంటే ఉత్సవాల నిర్వహణ మరింత సులభంగా ఉండేదని పలువురు భక్తులు అభిప్రాయం వ్యక్తం చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *