ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. ప్రమోషన్లు, బదిలీల ఫ్రీజింగ్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం


ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.
ఉద్యోగుల పదోన్నతులు, పోస్టుల అప్‌గ్రేడ్‌లు, బదిలీలపై అమలు చేయాలని నిర్ణయించిన ఫ్రీజింగ్‌ను తాత్కాలికంగా వాయిదా వేసింది.జూన్ 25 నుంచి అమల్లోకి రావాల్సిన ఈ నిబంధనను జులై 5 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం సవరణ ఉత్తర్వులు జారీ చేసింది.ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

ఉద్యోగ సంఘాల అభ్యర్థనకు ప్రభుత్వం సానుకూల స్పందన..
రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమలు ప్రక్రియలో భాగంగా సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ) ముందుగా జూన్ 25 నుంచి ఉద్యోగుల ప్రమోషన్లు, పోస్టుల అప్‌గ్రేడ్‌లు, బదిలీలపై ఫ్రీజింగ్ అమలు చేస్తామని ప్రకటించింది.అయితే ఈ నిర్ణయం వల్ల పదోన్నతులు నిలిచిపోతాయని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.దీంతో అమరావతి సచివాలయంలో 16 ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో అధికారులు సమావేశమయ్యారు. ముఖ్యంగా పదవీ విరమణ కారణంగా ఖాళీ అయ్యే పోస్టులను ప్రమోషన్ల ద్వారా భర్తీ చేసే అవకాశం కల్పించేందుకు ఫ్రీజింగ్ అమలును కొంతకాలం వాయిదా వేయాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని కోరాయి.

జులై 5లోపు ప్రమోషన్ల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు..
ఉద్యోగ సంఘాల వినతులను పరిశీలించిన ప్రభుత్వం ఫ్రీజింగ్ అమలు తేదీని జులై 5కు మార్చింది.
ఈ మేరకు జీఏడీ సవరించిన మెమోను విడుదల చేసింది. జులై 5లోపు అన్ని శాఖలు పదోన్నతులు, పోస్టుల అప్‌గ్రేడ్ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అలాగే జూన్ 30 నాటికి పదవీ విరమణల కారణంగా ఏర్పడే ఖాళీలను కూడా ప్రమోషన్ల ద్వారా భర్తీ చేయాలని సూచించింది. ఇందుకోసం డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) సమావేశాలను వెంటనే నిర్వహించి, అర్హత కలిగిన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని ఆదేశించింది.అవసరమైన చోట డిప్యుటేషన్లు, బదిలీలు చేపట్టేందుకు కూడా అనుమతి ఇచ్చింది.

వేలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం..
ఫ్రీజింగ్ అమలు గడువును ప్రభుత్వం జులై 5 వరకు పొడిగించడంతో పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు లాభం చేకూరనుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఉద్యోగ సంఘాలు స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *