నేడు భారీ వర్షాలు


మొదటివారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ?

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం నుండి మధ్య మహారాష్ట్ర వరకు తెలంగాణ, దాని పరిసర ప్రాంతాలపైన్ను ఉపరితల ఆవర్తనం మీదుగా ద్రోణి విస్తరించి ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దీని ప్రభావంతో ఈనెల 27, 28 తేదీల్లో కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. శనివారం ఉత్తరాంధ్ర, కాకినాడ, కోనసీమ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం
జులై మొదటి వారంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. దీని ప్రభావం ఏపీ, తెలంగాణ, ఒడిశాపై అధికంగా ఉంటుందని తెలిపింది. ఒడిశా తీరానికి సమీపంలో బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో జులై 2వ తేదీ నాటికి ఉపరితల ఆవర్తనం బలపడనుంది. ఆ తర్వాత 3, 4 తేదీల నాటికి మరింత బలపడి బంగాళాఖాతంలో ఉత్తర ప్రాంతం వైపు కదులుతుంది. క్రమంగా అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. దీని ప్రభావంతో తీరప్రాంత రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఏపీ, తమిళనాడుతో పాటు తెలంగాణపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మరింత తీవ్రరూపం దాల్చే అవకాశం ఉన్నట్లు ఐఎండీతో పాటు గ్లోబల్ ఫోర్ కాస్ట్ సిస్టమ్, యూరోపియన్ సెంటర్ ఫర్ మిడ్ రేంజ్ ఫోర్ కాస్ట్ వెల్లడించాయి. 5వ తేదీ నాటికి అల్పపీడనం మరింత బలపడి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారుతుందని పేర్కొన్నాయి. ఈ అల్పపీడనం నిర్ధిష్టంగా ఏ ప్రాంతం మీదుగా పయనిస్తుంది, దీని తీవ్రత ఏ మేరకు ఉంటుంది, ఎక్కడ తీరం దాటుతుందనే విషయంపై త్వరలో స్పష్టత వస్తుందని ఐఎండీ పేర్కొంది.

The post నేడు భారీ వర్షాలు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *