ఆదాయం పెంచి ఆనందం పంచుతాం


. పేదలకు సంక్షేమంలో దేశంలో ఏపీయే టాప్
. మార్చి నెలాఖరుకు అన్ని పంచాయతీల్లో 100 శాతం చెత్త సేకరణ
. కల్తీ అక్రమాల నుంచి తప్పించుకోవడానికే హెరిటేజ్‌పై నిందలు
. వినుకొండ స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర`వినుకొండ : పేద ప్రజల ఆదాయాన్ని పెంచి, ప్రతి ఒక్కరికి ఆనందం పంచేలా కృషి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజలకు ఆదాయం పెంచే మార్గాన్ని నేర్పించి వారిని అభివృద్ధి చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో శనివారం నిర్వహించిన స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర సాధ్యమని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పౌరుషాల గడ్డ పల్నాడులో అడుగుపెడితే వచ్చే వైబ్రేషనే వేరుగా ఉంటుందన్నారు. ఇటీవల కోటప్పకొండలో శివరాత్రి ఉత్సాహంగా జరిగింది. శివరాత్రి ప్రభలు అంటే కోటప్పకొండ ప్రభలే గుర్తుకు వస్తాయన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారాయణ అధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా బాగా జరుగుతున్నాయని ప్రశంసించారు. స్వచ్ఛత మన జీవిన విధానంలో భాగం కావాలని సీఎం పిలుపునిచ్చారు. ‘రాష్ట్రంలోని ప్రతి మండలానికో స్వచ్ఛ రథం ఏర్పాటు చేస్తున్నాం. వారానికోసారి రథాలు గ్రామానికి వస్తాయి. ఇళ్లలో పనికి రాని వస్తువులు ఇస్తే, వాటికి బదులుగా నిత్యావసర వస్తువులు ఇస్తారు. అన్నింటికంటే మనకు ముఖ్యమైనది ఆరోగ్యం. ఆరోగ్యం బాగుండాలంటే మంచి పరిసరాలు, శుభ్రమైన కార్యాలయాలు, గ్రామాలు ఉండాలి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే నాటికి రాష్ట్రంలో 108 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. వర్షాలకు ఆ చెత్త భూమిలో ఇంకి తద్వారా భూగర్భ జలాలు కలుషితమయ్యే పరిస్థితి వచ్చింది. నూటికి 97 శాతం మున్సిపాలిటీల్లో ఇంటింటికి వెళ్లి చెత్త సేకరిస్తున్నారు. వచ్చే నెల కల్లా రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో 100 శాతం ఇంటింటికీ చెత్త సేకరిస్తాం. రాష్ట్రంలో 4,14,004 కుటుంబాలు హోం కంపోస్టింగ్ చేస్తున్నారు. 4,19,288 టెర్రస్ గార్డెన్లు ఉన్నాయి. రాజమండ్రి, కర్నూలు, కడప, నెల్లూరులో రూ.1,254 కోట్లతో పీపీపీ విధానంలో ‘వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల’ను మార్చి 15 కల్లా వినియోగంలోకి తీసుకువస్తాం’ అని సీఎం చెప్పారు.
ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఏపీ
రాష్ట్రంలో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ‘ప్లాస్టిక్ వల్ల ప్రజలు, పశువుల ఆరోగ్యం దెబ్బతింటోంది. ఘన వ్యర్ధాలను ప్రాసెస్ చేసి చెత్త నుంచి సంపద సృష్టించటం, విద్యుత్ ఉత్పత్తి లాంటివి చేస్తున్నాం. చెత్త సేకరణ కోసం ట్రై సైకిళ్లు, ఈ-ఆటోలు, వివిధ యంత్రాలను వినియోగిస్తున్నాం. విశాఖ, గుంటూరులలో చెత్త నుంచి విద్యుత్ తయారు చేసే ప్లాంట్లు ఉన్నాయి. రాజమండ్రి సహా మరో 5 ప్లాంట్లు త్వరలోనే ఏర్పాటు చేసి చెత్త నుంచి విద్యుత్ తయారు చేసేందుకు చర్యలు చేపడతాం. చెత్త, వ్యర్ధాల నిర్వహణలో మన ఆలోచనా తీరు మారాలి. మలేరియా, డెంగ్యూ, డయేరియా లాంటి సంక్రమిత వ్యాధులు తడి వ్యర్ధాల కారణంగానే వస్తున్నాయి. జపాన్ లో రోడ్లపై చిన్న కాగితం ముక్క కూడా కనిపించదు. అక్కడి పౌరుల తరహాలో మనమూ కొన్ని అలవాట్లను మార్చుకోవాలి’ అని ఆయన సూచించారు.
పీ4తో పేదలకు ఆర్థిక చేయూత
‘సమాజంలో అట్టడుగున ఉన్నవారిని ఆర్థికంగా ఆదుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ఇప్పటికే పీ4 కింద లక్షల మంది మార్గదర్శులు… 10 లక్షల మంది పేద కుటుంబాలను దత్తత తీసుకున్నారు. అట్టడుగున ఉండే 20 శాతం బంగారు కుటుంబాలు, పైన ఉండే 10 శాతం మార్గదర్శులు కలిసి పనిచేస్తే రేపటి రోజున ఈ బంగారు కుటుంబాలే మార్గదర్శులు అవుతారు. పీ4 ద్వారా 100 కుటుంబాలను దత్తత తీసుకున్న ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులుని అభినందిస్తున్నాను. ఈ పథకం ద్వారా మరింతమంది పేదలకు ఆర్థిక చేయూత అందించేందుకు మరికొందరు ముందుకు రావాలి’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు. వినుకొండ నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రిని 1000 పడకల ఆస్పత్రిగా మార్చుతాం. ట్రామా కేర్ సెంటర్, డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేస్తాం. వినుకొండలో వ్యవసాయ, పశు వైద్య కళాశాలను ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తాం. బస్టాండ్‌ను ఆధునీకరిస్తామని సీఎం వరాలు కురిపించారు.
కల్తీ అక్రమాల నుంచి తప్పించుకోవడానికే హెరిటేజ్‌పై నిందలు
వైసీపీ ప్రభుత్వంలో తిరుమల లడ్డూ ప్రసాదంలో జరిగిన నెయ్యి కల్తీ వ్యవహారంపై చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. కల్తీ అక్రమాల నుంచి తప్పించుకోడానికే హెరిటేజ్ సంస్థపై వైసీపీ నిందలు వేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో నిందితులను నడి రోడ్డుపై నిలబెడతామని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు. నెయ్యి నమూనాలను నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డుకు పంపిస్తే కల్తీ జరిగినట్లు నివేదిక అందించిందని… అది అసలు నెయ్యి కాదని తేలిందని స్పష్టం చేశారు. రసాయనాలతో నెయ్యి తయారు చేసి ప్రసాదంలో వినియోగించినట్టు సిట్ తన నివేదికలో కూడా పేర్కొందని స్పష్టం చేశారు. ఆ తప్ప్పును బయటపెడుతుంటే దానిని ఇతరులపై నెట్టి వేయడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారని అన్నారు. వివేకా హత్య ఘటనలో నాటకాల రాయుడు రోజుకో వేషం వేశాడని, చిన్నాన్న కుమార్తె కూడా మోసపోయేలా నాటకాలు రక్తి కట్టించారని విమర్శించారు. కాగా వ్యర్ధాల సేకరణ కోసం వినియోగించే స్వచ్ఛ రథాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ప్రజా వేదిక వద్ద వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లతో పాటు మెప్మా, డ్వాక్రా మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను అభినందిస్తూ సన్మానించారు.
దాచేపల్లికి చెందిన స్వచ్ఛ రథం డ్రైవర్ దుర్గారావు, హోం కంపోస్టింగ్ విభాగంలో లక్ష్మీ గోవిందమ్మను ముఖ్యమంత్రి సత్కరించి అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, గొట్టిపాటి రవికుమార్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, అనేక మంది నాయకులు పాల్గొన్నారు.

The post ఆదాయం పెంచి ఆనందం పంచుతాం appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *