ప్రజా సమస్యలు ‘గోవిందా’ – Visalaandhra


లడ్డూ పైనే గొడవలు
. భక్తికి, రాజకీయానికి మధ్య నలుగుతున్న సామాన్యుడు
. ఏపీలో ముదురుతున్న దైవ రాజకీయం

విశాలాంధ్రసచివాలయం : ఆంధ్ర ప్రదేశ్ రాజకీయ యవనికపై ప్రస్తుతం ఒక వింత పరిస్థితి నెలకొంది. సామాన్యుడి ఆకలి కేకలు, పెరిగిన ధరలు, నిరుద్యోగం వంటి ‘నిజమైన’ సమస్యలు పక్కకు వెళ్లిపోయాయి. ఇప్ప్పుడు రాష్ట్రమంతా ‘నెయ్యికొవ్వు`క్షమాపణలు’ అనే మూడింటి చుట్టూనే తిరుగుతోంది. భక్తిని అడ్డం పెట్టుకుని ఈ ‘ప్రాయశ్చిత్త’ రాజకీయాలు సాగుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో గత మూడు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా ‘దైవం’ అంశం ప్రధాన చర్చనీయాంశమైంది. అభివృద్ధి, అమరావతి, విశాఖ ఉక్కు వంటి కీలక అంశాలను పక్కన పెట్టి… ‘లడ్డూ’ చుట్టూ సాగుతున్న ఈ యుద్ధం రాష్ట్ర రాజకీయ గమనాన్ని మార్చేలా ఉంది. అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య ఈ అంశంపై విమర్శలు తారస్థాయికి చేరాయి. భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ అంశంపై ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్ప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఈ లడ్డూ వివాదాన్ని కేవలం ఒక అవినీతి అంశంగా చూడటం లేదు. దీనిని ఒక బలమైన ‘హిందూ సెంటిమెంట’ గా మార్చడంలో సఫలీకృతమయ్యారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేపట్టిన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష ఈ వివాదానికి జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చింది. సనాతన ధర్మ రక్షణ బోర్డు ఏర్పాటు చేయాలనే డిమాండ్ ద్వారా ఆయన తన రాజకీయ పంథాను మార్చుకున్నారు. గత ఐదేళ్లలో టీటీడీలో జరిగిన అక్రమాలను, అన్యమత ప్రచారాలను ఎండగట్టడం ద్వారా వైసీపీని ‘హిందూ వ్యతిరేకి’గా చిత్రించే ప్రయత్నం చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు ఈ వివాదానికి పునాది వేశాయి. అప్పటి నుంచి నేటి వరకు ఈ అంశంపై మాటల యుద్ధం సాగుతూనే ఉంది. ఈ వివాదం ఇప్ప్పుడు వ్యక్తిగత విమర్శల స్థాయికి వెళ్లింది. జగన్ హయాంలో శ్రీవారి పవిత్రత దెబ్బతిందని, ఇందుకు వైసీపీ నేతలు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని కూటమి నేతలు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా శాసన మండలిలో వైసీపీ సభ్యులు శ్రీవారి చిత్ర పటాలు పట్టుకుని పాదరక్షలతో నిరసన తెలపడం ‘ఘోర అపచారం’ అని నారా లోకేశ్ వంటి నేతలు విమర్శిస్తున్నారు. వైసీపీ ఈ విషయంలో ఆదిలో కొంత ఆత్మరక్షణలో పడినా ఇప్ప్పుడు గట్టిగానే బదులిస్తోంది. గుజరాత్ ఎన్డీడీబీ ఇచ్చిన నివేదికలో లోపాలు ఉన్నాయని, జులైలో వచ్చిన నెయ్యిని వాడలేదని జగన్ ఆధారాలతో సహా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెరుగుతున్న ధరల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే చంద్రబాబు ఈ ‘లడ్డూ డ్రామా’ ఆడుతున్నారని వైసీపీ నేతలు బలంగా వాదిస్తున్నారు. అసలు అపచారం జరగకపోయినా రాజకీయ లబ్ధి కోసం భక్తులను భయభ్రాంతులకు గురిచేసిన చంద్రబాబే దేవుడికి క్షమాపణ చెప్పాలని జగన్, ఇతర నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. ‘మీరు చేసిన తప్ప్పును మాపై నెట్టడం ధర్మమా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేశ్ కుమార్ నేతత్వంలో వన్ మాన్ కమిషన్ ఏర్పాటు చేసింది. టీటీడీలో టెండర్ల ప్రక్రియ, పరిపాలనా లోపాలు, గతంలో జరిగిన అక్రమాలను 45 రోజుల్లోగా తేల్చడం, కేవలం సిట్ నివేదికతో సరిపెట్టకుండా అసలు సూత్రధారులను బయటకు తీసుకురావాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. ఇది కేవలం రాజకీయ కక్ష సాధింపు కోసం వేసిన కమిషన్ అని, తమపై బురద జల్లడమే దీని ప్రధాన ఉద్దేశమని వైసీపీ కొట్టిపారేస్తోంది. సాధారణ ప్రజల్లో… ముఖ్యంగా తటస్థుల్లో ఒక రకమైన అసహనం వ్యక్తమవుతోంది. మండల కార్యాలయాల్లో సామాన్యుల పనులు కావడం లేదు. వర్షాల వల్ల దెబ్బతిన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలు, ఉపాధి హామీ పథకం వంటి అంశాల కంటే నాయకులు టీవీ డిబేట్లలో లడ్డూ గురించి గంటల తరబడి వాదించుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. సామాన్య భక్తులు మాత్రం ‘దేవుడిని రాజకీయాల్లోకి లాగడం వల్ల అపచారం జరుగుతుందేమో’ అని ఆందోళన చెందుతున్నారు. హిందూ ఓటు బ్యాంకును ఆకట్టుకోవడంతో పాటు గత ప్రభుత్వ వైఫల్యాలను నిరంతరం గుర్తు చేయడం చేస్తున్నారు. ‘హిందూ వ్యతిరేకి’ అనే ముద్ర పడకుండా తమ పవిత్రతను నిరూపించుకోవాల్సిన పరిస్థితి వైసీపీకి వచ్చింది. శ్రీవారి లడ్డూ ప్రసాదం పవిత్రతను కాపాడటం ఏ ప్రభుత్వం బాధ్యత అయినప్పటికీ… దానిని రాజకీయ లబ్ధికి వాడుకోవడం మాత్రం ప్రజాస్వామ్యానికి మేలు చేయదు. వన్ మాన్ కమిషన్ ఇచ్చే నివేదికతో అయినా ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం దొరుకుతుందో లేదో వేచి చూడాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *