మన దేశంలో “అంతరాత్మ ప్రబోధం”తో పార్టీలు మారుతున్న వారికన్నా వేగంగా బ్రిటన్‌లో ప్రధానమంత్రులు మారిపోతున్నారు. గత పదేళ్ల కాలంలో బ్రిటన్‌లో ఆరుగురు ప్రధానులు మారిపోయారు. కీర్ స్టార్మర్ సోమవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామా అనూహ్యమైంది కాకపోయినా అనివార్యం అనుకున్నది జరగనే జరిగింది. ఎన్నికల్లో ఘన విజయాలు, పార్లమెంటులో అపూర్వమైన ఆధిపత్యాలు ప్రధానమంత్రి పదవిలో ఉన్న వారికి ఎదురు లేదని అనుకోవడానికి వీలు లేదు. పరిపాలన సవ్యంగా లేకపోతే మందబలం ఎందుకూ కొరగాదు అని అనేక చోట్ల పదేపదే రుజువైంది. కీర్ స్టార్మర్ 2014 ఎన్నికల్లో లేబర్ పార్టీకి అఖండమైన విజయం సాధించి పెట్టారు. కానీ ఆయన పాలనా విధానాలు వచ్చే ఎన్నికలలో లేబర్ పార్టీని గెలిపిస్తుందన్న నమ్మకం పార్టీలోనే లేకపోవడంతో స్టార్మర్ తప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది. 1984 మన లోకసభ ఎన్నికలలో రాజీవ్గాంధీ కాంగ్రెస్ పార్టీకి కనీవినీ మెజార్టీ సాధించగలిగారు. కానీ అయిదేళ్ల తరవాత ఆయన ఘోరంగా విఫలమయ్యారు. అధికారమే కోల్పోవాల్సి వచ్చింది. స్టార్మర్కూ అదే పరిస్థితి ఎదురైంది. స్టార్మర్‌కు ముందు గత పదేళ్ల కాలంలో డేవిడ్ కెమరాన్, థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రుషి సునక్ ప్రధాన మంత్రులుగా తెరమీదకు వచ్చినంత తొందరగా తెరమరుగైపోయారు. స్టార్మర్ సైతం ఒక తుపానులా అధికారంలోకి వచ్చారు. కానీ అంతే వేగంగా నిష్రక్కమించారు. మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థ దాదాపు ఒకటే. దీనినే వెస్ట్ మినిస్టర్ నమూనా అంటారు.
అయితే మన దేశంలో ఉన్న పరిస్థితికి, బ్రిటన్‌లోని పరిస్థితికి చాలా తేడా ఉంది. మన దేశంలో ఒక్కసారి ఎవరైనా అగ్రనాయకుడి స్థానంలోకి వస్తే ఆయనను సొంత పార్టీ వారూ ప్రశ్నించలేరు. మళ్లీ ఓటు వేసే అవకాశం వచ్చేదాకా ప్రజలూ చేయగలిగిందేమీ ఉండదు. బ్రిటన్‌లో పరిస్థితి భిన్నమైంది. ఎంతటి శక్తిమంతుడు అనుకున్న ప్రధానిని అయినా ఒక సాధారణ పార్లమెంటు సభ్యుడు సవాలు చేయగలడు. ఇక చాలు లెమ్మని అనగలడు. అక్కడ రాజకీయ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఇది మన ఏ రాజకీయ పార్టీలోనూ సవ్యంగా లేదు. ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసిన స్టార్మర్ పార్టీ పదవుల నుంచి కూడా తప్పుకున్నారు. స్టార్మర్ హయాంలో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడిందని, జాతీయ ఆరోగ్య వ్యవస్థ బాగు పడిందని, విదేశీ విధానం మీద గౌరవం పెంపొందిందని కొంతకాలం అనుకున్నారు. కానీ త్వరలోనే స్టార్మర్ పై ఉన్న భ్రమలన్నీ తొలగిపోయాయి. పేదరికం, ఆర్థిక అసమానతలు తొలగించడానికి అవకాశం ఉన్నప్పటికీ స్టార్మర్ చేసింది ఏమీ లేదంటున్నారు. అలాగే మానవ హక్కుల పరిరక్షణలో విఫలమయ్యారన్న విమర్శా తీవ్రంగానే ఉంది. అదీగాక ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో స్టార్మర్ నాయకత్వంలోని లేబర్ పార్టీకి తీవ్ర విఘాతం కలిగింది. రిఫార్మ్ యు.కె.పార్టీ అద్భుతమైన విజయాలు సాధించింది. అప్పటి నుంచే స్టార్మర్ నాయకత్వంపై విశ్వాసం సడలిపోయింది. టోనీ బ్లేయిర్ తరవాత స్టార్మర్ అఖండ విజయం సాధించారని మూటగట్టుకున్న కీర్తి కొన్ని నెలల కాలంలోనే ఆవిరైపోయింది. రిఫార్మ్ యు.కె. పార్టీ బలంగా అస్తిత్వాన్ని నిరూపించుకుంటూ ఉండడం కేవలం స్టార్మర్కే కాక లేబర్ పార్టీకే సవాలుగా తయారైంది. బ్రిటన్‌లో లేబర్ పార్టీ, కన్జర్వేటివ్ పార్టీల ప్రభావమే ఎక్కువ. ఇతర పార్టీలు లేవని కాదు కానీ అవి నిగమ శర్మ అక్క లాగే మిగిలిపోతాయి. రిఫార్మ్ యు.కె. పార్టీ రెండు పార్టీల ప్రాబల్య వ్యవస్థను కూల్చేస్తుందేమోన్న అనుమానం కలుగుతోంది. స్టార్మర్ నిష్రక్కమణకు ఆరు ప్రధాన కారణాలు ఉన్నాయంటున్నారు. 2024 ఎన్నికల్లో స్టార్మర్ నాయకత్వంలో సాధించిన విజయం కేవలం ఆయన పలుకుబడి వల్లే కాదని అంతకుముందు 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ ప్రభుత్వాలపై ఉన్న అసంతృప్తి లేబర్ పార్టీ ఘన విజయానికి కారణమైంది. బోరిస్ జాన్సన్ హయాంలో ఉన్న కుంభకోణాలు, లిజ్ ట్రస్ హయాంలోని ఆర్థిక ఎగుడుదిగుళ్లు, విదేశీ విధానంలో ఉన్న లోపాలు, రిఫార్మ్ యు.కె.పార్టీ కన్జర్వేటివ్ పార్టీ ఓట్లను చీల్చడం లాంటివి స్టార్మర్‌కు ఉపకరించాయి. ఎవరు అధికారంలోకి వచ్చినా మొదటి వంద రోజుల పాలనను చూసీ చూడనట్టు ఉంటారు. ఈ సమయంలోనే కొత్తగా అధికారంలోకి వచ్చిన వారు సత్తా చాటుకోవాలి. ఈ విషయంలో స్టార్మర్ ఘోరంగా విఫలమయ్యారు. దానికి తోడు స్టార్మర్ మంచి వక్తా కాడు. జనాన్ని ఒప్పించే శక్తీ లేదు. గత ఆరు నెలల కాలంలో ఆర్థిక సంకట స్థితి మరింత పెరిగింది. జీవన వ్యయం పెరిగిపోతూ ఉంటే మన దేశంలో అయితే కిమ్మనకుండా అదనపు భారం మోసేస్తారు. కానీ బ్రిటన్‌లో ఇవే పెద్ద సమస్యలుగా మారతాయి. వీటిని బ్రిటన్ ప్రజలు యథాలాపంగా పరిగణించరు. ఇద్దరు పిల్లలు ఉన్న వారికి ప్రభుత్వం చేయూత అన్న కన్జర్వేటివ్ పార్టీ విధానాన్ని ప్రతిపక్షంలో ఉన్న లేబర్ పార్టీ గట్టిగా వ్యతిరేకించింది. కానీ అధికారంలోకి వచ్చిన తరవాత ఈ అంశాన్ని చల్లగా విస్మరించారు. యమూరప్ సమాజ కూటమి నుంచి బ్రిటన్ నిష్రక్కమించింది. దీన్ని బ్రెగ్జిట్ అంటారు.
యమూరప్ సమాజ కూటమిలో లేకపోతే బ్రిటన్ సొంతంగా విధానాలు రూపొందించ వచ్చుననుకున్నారు. కానీ యమూరప్ సమాజ కూటమిలో మళ్లీ చేరడానికి స్టార్మర్ ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు. యమూరప్ సమాజ దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవాలని మాత్రమే అనుకున్నారు. గెలవడం కన్నా పరిపాలనా దక్షత ప్రదర్శించకపోతే అధికారం నిలవదన్న వాస్తవాన్ని స్టార్మర్ గ్రహించినట్టు లేదు. ఇంకో వైపు నుంచి శీతోష్ణ స్థితిలో మార్పులు, ఆర్థిక అసమానతలు లాంటి అంశాలపై వామపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయడం పెరిగింది. విదేశాంగ విధాన రూపకల్పనలో స్టార్మర్ ఎంతో కొంత మెరుగే అనుకున్నారు. కానీ ఇంట్లో ఈగల మోత ఎక్కువైనప్పుడు బయట పల్లకీల మోత వల్ల ఒరిగేది ఏమీ ఉండదు. స్టార్మర్‌కు మీడియాను ఆకర్షించే శక్తి కూడా లేదు. పరిపాలన సరిగా లేకపోతే మన దేశంలో పాలకులను చేసేదీ ఏమీ ఉండదు. మరో ఎన్నికలలో తప్ప అధికారంలో ఉన్న వారిని తొలగించలేం. కానీ బ్రిటన్‌లో ప్రధానమంత్రిని ఎవరైనా నిలదీయవచ్చు. సొంత పార్టీలోనే విమర్శలు వెల్లువెత్తవచ్చు. స్టార్మర్ స్థానంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఎన్.డి. బర్నహెంకు ఎక్కువ అధికారాలు ఉన్నాయంటున్నారు. వాగ్దానాల అమలు అనే గీటు రాయి మీద ప్రభుత్వ పసను నిగ్గు తేల్చే చోట కేవలం మెజారిటీ ఏ ప్రధానినీ కాపాడలేదని పదేళ్లలో ఆరు సార్లు రుజువైంది.
The post పదేళ్లలో ఆరుగురు ప్రధానులు appeared first on Visalaandhra.


