ప్రపంచ వాణిజ్యంపై ట్రంప్ పగ – Visalaandhra


మళ్లీ టారిఫ్‌లు విధించేందుకు రెండు ఆయుధాలు సిద్ధం
వాషింగ్టన్:
ప్రపంచ వాణిజ్యంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పగబట్టారు. ఇప్పటికే ఆయన విధించిన టారిఫ్‌లు చెల్లుబాటు కావని ఆ దేశ సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. ప్రపంచ దేశాల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ ఆయన ధోరణిలో ఎటువంటి మార్పులు రాలేదు. ప్రపంచ దేశాలపై పన్నులు విధించేందుకు మరో రెండు సరికొత్త ఆయుధాలను ట్రంప్ సిద్ధం చేశారు. వీటిల్లో ఒకటి వెట్టిచాకిరీ చేయించే దేశాల జాబితా కాగా, మరొకటి అదనపు పారిశ్రామిక సామర్థ్యం. చౌకగా అందుబాటులో ఉండే కార్మికులను, పరిశ్రమలను వాడుకుని భారీగా ఉత్పత్తి చేయగలిగే దేశాలపై ఈ నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపించనుంది. అమెరికా అధ్యక్షుడికి చట్టపరమైన అధికారం ఉన్న ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 301ని అగ్రరాజ్యం ఆయుధంగా చేసుకోనుంది. ఇప్పటికే ట్రంప్ విధించిన 10 శాతం పన్నుల గడువు జులై 10వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత కొన్ని దేశాలపై టారిఫ్‌లు ఎక్కువగా, మరికొన్నింటిపై తక్కువగా ఉంటాయి. అమెరికాతో వాణిజ్యానికి సంబంధించి ఇప్పటికే భారత్ తాత్కాలిక ఒప్పందంపై సంతకాలు చేయగా…బ్రిటన్, ఐరోపా సమాఖ్య, దక్షిణ కొరియా, యూకే వంటి దేశాలు వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నాయి. ఆటోమొబైల్స్‌పై పన్నులు తగ్గించేందుకు వీటిల్లో చాలా దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ క్రమంలో ట్రంప్ తీసుకురాబోయే కొత్త పన్నుల ప్రభావం ఎలా ఉంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. మరోవైపు భారత్‌తో పూర్తిస్థాయి వాణిజ్య చర్చలు చివరి దశకు చేరుకోవడంతో అమెరికా ప్రతినిధి జెమీసన్ గ్రీర్ సోమవారం న్యూదిల్లీకి చేరుకొన్నారు. ఈ సందర్భంగా సుంకాలపై రెండు దేశాల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *