విశాలాంధ్ర -నార్పల (అనంతపురం జిల్లా) : మండల పరిధిలోని గూగూడు గ్రామంలో జరుగుతున్న శ్రీ కుళ్లాయ స్వామి ఉత్సవాల్లో ఐదవ రోజు నిర్వహించిన సరిగెత్తు కార్యక్రమంలో గూగూడు ఉన్నత పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, పీడీ శ్రీదేవి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణం ముందు కోలాటం ప్రదర్శించి భక్తులను అలరించారు.విద్యార్థులు సంప్రదాయ వేషధారణలో కోలాటం ప్రదర్శించగా భక్తులు ఆసక్తిగా తిలకించి చప్పట్లతో అభినందించారు. ఆలయ ఉత్సవాల్లో విద్యార్థుల భాగస్వామ్యం సాంస్కృతిక సంప్రదాయాల పరిరక్షణకు దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.ఉత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శోభారాణి, ఆలయ కమిటీ చైర్మన్ నాగార్జున, ఆలయ కమిటీ సభ్యురాలు పొన్నతోట వనజాక్షి, గ్రామ రెవెన్యూ అధికారి పి. శివరామ్, జాఫర్ వలి, కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


