పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు
న్యూయార్క్: పాకిస్థాన్‌లో ప్రజాపాలన కంటే సైనిక పాలనే ఎక్కువగా ఉంటుందనేది కాదనలేని సత్యం. తాజాగా ఇది మరోసారి రుజువైంది. పాక్ నిఘా సంస్థ ఐఎసఐ గుప్పిట్లో పాక్ చట్టసభ పనిచేసిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ జాతీయ అసెంబ్లీ వేదికగా అంగీకరించారు. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు. పాక్ జాతీయ అసెంబ్లీ సమావేశాల్లో ఖవాజా మాట్లాడుతూ.. “ఇమ్రాన్ ఖాన్ హయాంలో ఐఎసఐకి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నాడు నిఘా సంస్థ చీఫ్ జనరల్ ఫైజ్ హమీద్ తరచూ అధికారిక సమావేశాల్లో పాల్గొన్నారు. నాటి స్పీకర్ నివాసంలో జరిగిన సమావేశాలకు హాజరై.. చట్టసభ కార్యకలాపాలు, నిర్ణయాలను ప్రభావితం చేశారు. ఐఎసఐ ఒత్తిడి కారణంగా అప్పట్లో కొన్ని కీలక చట్టసవరణలు చేయాల్సి వచ్చింది. యాంటీ మనీలాండరింగ్ చట్ట సవరణ అలా జరిగిందే. అంతేగాక, నిఘా సంస్థకు అనుకూలంగా కొన్ని చట్టాలను అమల్లోకి తెచ్చారు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, తమ ప్రభుత్వం మాత్రం సైన్యంతో కలిసి పనిచేస్తోందని ఖవాజా ఈ సందర్భంగా తెలిపారు. తమ ప్రభుత్వం పౌర-సైనిక హైబ్రిడ్ పాలనా విధానాన్ని అనుసరిస్తోందని, దీనివల్ల మంచి ఫలితాలు వస్తున్నట్లు తెలిపారు.


