కేంద్ర మంత్రి పెమ్మసానితో కలిసి ప్రారంభించిన మంత్రి నారా లోకేశ్
రూ.3.3 కోట్ల సెల్ కాన్ సీఎస్ఆర్ నిధులతో పార్క్ నిర్మాణం
మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అందించే లక్ష్యంతో మరో కీలక ముందడుగు పడింది. నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు చిరునామాగా నిలుస్తున్న రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్, తన ఆలోచనలకు అనుగుణంగా మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళగిరి మండలం కాజ గ్రామంలో రూ.3.3 కోట్ల వ్యయంతో ఆధునిక హంగులతో నిర్మించిన ఃకాజ ఈస్ట్ లేక్ పార్క్ఃను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం స్థానికులలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
కాజ గ్రామంలోని ఉప్పలపాడు-నంబూరు రోడ్డు మార్గంలో ఏర్పాటు చేసిన ఈ పార్క్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రులు నారా లోకేశ్, పెమ్మసాని చంద్రశేఖర్‌లకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్థులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు రిబ్బన్ కట్ చేసి పార్క్‌ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ, పార్క్ ప్రాంగణంలో మొక్కను నాటారు. ఆ తర్వాత పార్క్ అంతా కలియతిరుగుతూ, కల్పించిన సౌకర్యాలను, వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. పార్క్ అందాలకు ముగ్ధులైన మంత్రులు, అక్కడ సెల్ఫీ దిగి తమ ఆనందాన్ని పంచుకున్నారు.
పార్క్‌లో ప్రత్యేక ఆకర్షణలు.. ఆధునిక సౌకర్యాలు
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ సెల్ కాన్, తన సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద అందించిన రూ.3.3 కోట్ల నిధులతో ఈ పార్క్‌ను అభివృద్ధి చేశారు. 17.18 ఎకరాల విశాలమైన చెరువు చుట్టూ ఈ పార్క్‌ను సుందరంగా తీర్చిదిద్దారు. చెరువు కట్టను 1.7 కిలోమీటర్ల మేర బలోపేతం చేసి, దానిపై 3 మీటర్ల వెడల్పుతో వాకింగ్ ట్రాక్‌ను నిర్మించారు. వాకర్ల భద్రత కోసం ట్రాక్‌కు ఇరువైపులా జీఐ చైన్-లింక్ మెష్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో, పార్క్‌లో 42 విభిన్న జాతులకు చెందిన సుమారు 12,800 మొక్కలను నాటారు.
ఈ పార్క్‌లో కేవలం వాకింగ్ ట్రాక్‌కే పరిమితం కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఓపెన్ జిమ్, చిన్నారులు ఆడుకోవడానికి ప్రత్యేక ప్లే ఏరియాను కూడా ఏర్పాటు చేశారు. ట్రాక్ వెంట ఆధునిక విద్యుత్ దీపాలను అమర్చి రాత్రివేళల్లో సైతం వాకింగ్‌కు అనుకూలంగా మార్చారు. మొత్తం మీద ఈ పార్క్, మంగళగిరి వాసులకు ఒక గొప్ప విరామ కేంద్రంగా, ఆరోగ్య ప్రదాయినిగా నిలవనుంది.
ఈ కార్యక్రమంలో పద్మశాలీ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ నందం అబద్దయ్య, టీడీపీ గుంటూరు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షుడు పడవల మహేశ్, మండల పార్టీ అధ్యక్షుడు పల్లబోతుల శ్రీనివాసరావు, ఏఎంసీ ఛైర్మన్ జవ్వాది కిరణ్ చందు, ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ డైరెక్టర్ తోట పార్థసారథి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకుల జయసత్య సహా కూటమికి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ముగిశాక మంత్రులు అందరితో కలిసి ఫొటోలు దిగారు.


