విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఏపీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా మరో అరెస్ట్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ (ఏపీబీసీఎల్) మాజీ ఎండీ వాసుదేవరెడ్డిని సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను విజయవాడ ఏసీబీ కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టారు. న్యాయస్థానం ఆయనకు ఈ నెల 27వ తేదీ వరకు రిమాండ్ విధించింది. దీంతో అతడిని పోలీసులు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. గతంలో వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్‌ను ఏసీబీ కోర్టు డిస్మిస్ చేసింది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి విజయవాడలోని ఏపీబీసీఎల్ కార్యాలయం నుంచి ఫైళ్లు, కంప్యూటర్ పరికరాలు, కీలక పత్రాలు చోరీ చేశారంటూ ఆయనపై ఫిర్యాదు అందింది. దీంతో ఆధారాల ధ్వంసం, చోరీ, నేరపూరిత కుట్ర అభియోగాలతో 2024 జూన్‌లో ఆయనపై కేసు నమోదైంది.
ఈ కేసులో ఆయన ఏ2గా ఉన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో సీఐడీ సోదాలకు వెళ్లిన సమయంలో వాసుదేవరెడ్డి పరారయ్యారు. అప్పటి నుంచి అజ్ఞాతంలో ఉండగా… తాజాగా సీఐడీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్‌గా మారతానంటూ ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టులో విచారణ దశలో ఉంది. ఈ తరుణంలో వాసుదేవరెడ్డి అరెస్టు తీవ్ర సంచలనం అయింది.
The post లిక్కర్ స్కామ్ కేసువాసుదేవరెడ్డి అరెస్టు appeared first on Visalaandhra.


