వెన్నెముకలేని మోదీ


దేశ ప్రయోజనాల పరిరక్షణలో విఫలం

  • భారత నావికులపై అమెరికా దాడి దారుణం
  • నీట్ లీకులు, సీబీఎస్‌ఈ నిర్వహణ లోపాలతో విద్యావ్యవస్థ నిర్వీర్యం
  • అభిజిత్ దీప్కేపై దాడులు అప్రజాస్వామికం
  • రైతాంగ సమస్యలపై 30న ‘చలో విజయవాడ’ కు సంపూర’ మద్దతు
  • ఎస్ఐఆర్‌పై ఓటర్లు అప్రమత్తం కావాలి
  • పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగస్టు 6`15 వరకు పాదయాత్రలు
  • సెప్టెంబరు 1న చలో దిల్లీ: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశ ప్రయోజనాల పరిరక్షించడంలో విఫలమవుతోందని, వెన్నెముకలేని ప్రధానిగా మోదీ కొనసాగుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. హోర్మూజ్ జలసంధి వద్ద భారత నావికులు పనిచేస్తున్న వాణిజ్య నౌకలపై అమెరికా నౌకాదళం దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనపై ప్రధాని నోరు మెదపకపోవడం దారుణమని, ఇది భారత నావికులపై మూడో దాడి అని ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ దాసరిభవన్‌లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ... అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం జరిగిన తర్వాత కూడా ప్రపంచ రాజకీయ పరిణామాలపై అనేక దేశాల నుంచి స్పందనలు వస్తున్నప్పటికీ భారత నౌకాదళానికి సంబంధించిన భద్రతా అంశాలు, దాడుల వంటి ఘటనలపై కేంద్ర ప్రభుత్వం తగిన స్థాయిలో స్పందించడం లేదని ధ్వజమెత్తారు. దేశ భద్రత, సార్వభౌమత్వం విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరముందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆధిపత్య రాజకీయాలను ప్రదర్శించే చర్యల్ని, ముఖ్యంగా అమెరికా చేపడుతున్న దూకుడు విధానాలను సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. జైపూర్ పర్యటనకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేపై భౌతిక దాడులు చేయడం అప్రజాస్వామికమని తీవ్రంగా ఖండించారు. దేశ వ్యాప్తంగా మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యారంగ, ప్రజా వ్యతిరేక విధానాలపై యువతలో పెద్ద ఎత్తున అసంతృప్తి రగులుతోందన్నారు. నీట్ పరీక్షను నీట్‌గా నిర్వహించకుండా లీక్లకు పాల్పడటం, సీబీఎస్‌ఈ పరీక్షా పత్రాల మూల్యాంకనంలో అవకతవకలు వెరసి విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందని... దీనికి మోదీ అనుసరిస్తున్న విధానాలే కారణమని విమర్శించారు. దేశ వ్యాప్తంగా 23 లక్షల మంది నీట్ రాయగా... ఆ తర్వాత లీక్లతో వాయిదా పడటం వల్ల విద్యార్థులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయారని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. మొదటి నుంచి తాము నీట్ లీక్‌లో బీజేపీ కార్యకర్తల పాత్ర ఉందని చెప్పామని... ఆ తర్వాత అరెస్టుల్లో అది స్పష్టమైందని చెప్పారు. నీట్ లీక్లు, సీబీఎస్‌ఈ పరీక్షల్లో గందరగోళాన్ని నిరసిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ పెద్దఎత్తున సీపీఐతోపాటు ఇతర పార్టీలు, విద్యార్థి, యువజన సంఘాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. నీట్ లీక్లతో విద్యా వ్యవస్థ పూర్తిగా దిగజారినప్పటికీ మోదీ ఇంతవరకు స్పందించకపోవడం దారుణమన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 30వ తేదీన ఆంధ్రప్రదేశ్ రైతు, కౌలు రైతుల సంఘాలు నిర్వహించనున్న చలో విజయవాడకు సీపీఐ సంపూర’ మద్దతు ప్రకటిస్తోందని ఈశ్వరయ్య తెలిపారు. ఆక్వా, మామిడి, పొగాకు, మొక్కజొన్న సహా వివిధ పంటలు సాగు చేసే రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం నిరసనలు చేపడుతున్నప్పటికీ కూటమి ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదన్నారు. ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయన్నారు. రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ హామీ అమలుకు నోచుకోలేదని, ప్రకృతి వైపరీత్యాల కారణంగా లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నప్పటికీ నష్టపరిహారం పూర్తిగా అందలేదని... పంటల బీమా అమలు సరిగ్‌గా జరగడం లేదని వివరించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేలు అందజేస్తామని కూటమి నేతలు చేసిన హామీలో భాగంగా మొదటి ఏడాది (202426) రూ.10,716 కోట్లు చెల్లించకుండా ఎగనామం పెట్టారని మండిపడ్డారు. భూమిలేని కౌలు రైతులు 8 లక్షల మంది ఉండగా… రెండేళ్ల నుంచి అన్నదాత సుఖీభవ పథకం కింద వారికి రూ.3,200 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టబోయిన రైతులకు బీమా పరిహార బకాయిలు 202324 నుంచి 202526 వరకు దాదాపు రూ.4,400 కోట్లు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. వర్షాభావం వల్ల నష్టబోయిన రైతులకు రెండేళ్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు రూ.1200 కోట్లు ఉన్నాయని చెప్పారు. మొంథా తుపాన్ వల్ల దాదాపు రూ.4.19 లక్షల ఎకరాల పంటలు దెబ్బతినగా..వాటికి చెందిన దాదాపు రూ.411 కోట్లు బకాయిలు పేరుకుపోయాయని చెప్పారు. ఓటర్ల జాబితాల సవరణ (ఎస్ఐఆర్) ద్వారా 16 కోట్ల మంది ఓటర్ల తొలగింపే లక్ష్యంగా బీజేపీ కుట్రలకు పాల్పడుతోందన్నారు. చనిపోయిన వారి ఓట్ల తొలగింపును సాకుగా చూపుతూ వ్యతిరేక ఓట్ల తొలగింపునకు శ్రీకారం చుట్టారని విమర్శించారు. ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాళ్, కేరళ, అసోం, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలలో ఎస్ఐఆర్ ద్వారా పెద్దఎత్తున ఓట్లు తొలగించిన సంఘటనలు వెలుగు చూడటమేనని అందుకు నిదర్శనమని స్పష్టం చేశారు.తమ పార్టీ వ్యతిరేక వర్గాలను కుల, మతాల ప్రాతిపదికగా విభజించి… వారి ఓట్లు తొలగింపే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోందన్నారు. ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నిబంధనలను కచ్చితంగా పాటించకుండా, క్షేత్ర స్థాయిలో పారదర్శకత లేకుండా సర్వేలు నిర్వహిస్తే ప్రజాస్వామ్య ప్రక్రియకు భంగం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఓటర్లంతా అప్రమత్తంగా ఉండాలని, తమ పేర్లు ఓటరు జాబితాలో ఉన్నాయో లేదో ధృవీకరించుకోవాలని, ఏవైనా అవకతవకలు గమనించినట్లయితే సంబంధిత అధికారులను నిలదీయాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగ్రంచిప్రోలులో జరిగిన సీపీఐ రాష్ట్ర సమితి సమావేశంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్ పోరాట కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించామని వివరించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఆగస్టు 6 నుంచి 15 వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, నిరసనలు, ఆందోళనలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు, పెట్రోల్-డీజిల్ ధరల పెరుగుదల, సహజ వనరుల ప్రైవేటీకరణ, అటవీ ప్రాంత ప్రజల సమస్యలు, మైనార్టీల హక్కులు, ప్రజాస్వామ్య సంస్థల స్వయం ప్రతిపత్తికి సంబంధించిన అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించనున్నట్లు వెల్లడించారు. కడప స్టీల్ ప్లాంట్, మూతపడిన పరిశ్రమల పునరుద్ధరణ, ఉద్యోగాలు, ఉపాధి, పెండింగ్ నీటిపారుదల ప్రాజెక్టులు, విద్య, వైద్య రంగ సమస్యలు ప్రజా అంశాల్ని అజెండాగా తీసుకుని విస్తృత ప్రచారం చేపట్టనున్నట్లు తెలిపారు. వాటికి కొనసాగింపుగా సెప్టెంబర్ 1న చలో దిల్లీ నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. రాబోయే నెల రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ ఉద్యమ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించి ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని పార్టీ పిలుపునిచ్చిందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథ్రెడ్డి, దోనేపూడి శంకర్ పాల్గొన్నారు.

The post వెన్నెముకలేని మోదీ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *