శింగనమల వైసీపీలో ముదురుతున్న వర్గపోరు..? – Visalaandhra


2029 టికెట్ కోసం ఇప్పటినుంచే బలప్రదర్శన..!

విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) : శింగనమల నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిరంగ చర్చకు దారితీస్తున్నాయా అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు” నిరసన కార్యక్రమం నేపథ్యంలో వెలుగులోకి వచ్చిన పోస్టర్ల రాజకీయాలు ఇప్పుడు నియోజకవర్గంలో ఆధిపత్య పోరుపై కొత్త అనుమానాలకు తెరలేపుతున్నాయి.
పార్టీ అధికారిక కార్యక్రమానికి సంబంధించిన ప్రచార పోస్టర్లు, సోషల్ మీడియా ప్రచారంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ సాకే శైలజానాథ్, జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ఫోటోలు కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. అదే సమయంలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివరెడ్డి ఫోటోతో మాత్రమే ప్రచారం జరగడం వెనుక రాజకీయ సంకేతాలేమిటన్న దానిపై పార్టీ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.
అధికారిక పార్టీ కార్యక్రమంలో బాధ్యతలు నిర్వహిస్తున్న నాయకులకు ప్రచారంలో ప్రాధాన్యం లేకపోవడం యాదృచ్ఛికమా..? లేక నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణాలకు సంకేతమా..? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శింగనమలలో నిర్వహించిన భారీ ర్యాలీ, నిరసన కార్యక్రమం నేపథ్యంలో సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టర్లు రెండు వర్గాల మధ్య విభేదాలను మరింత స్పష్టంగా చూపిస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదిలా ఉండగా, 2029 ఎన్నికల టికెట్ తమ వర్గానికేనంటూ సాంబశివరెడ్డి అనుచరులు ప్రచారం చేస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు పార్టీ అధిష్టానం ఇప్పటికే సాకే శైలజానాథ్‌కు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీంతో శింగనమలలో అసలు నాయకత్వం ఎవరిది..? భవిష్యత్తులో పార్టీ అభ్యర్థిత్వం ఎవరికి దక్కనుంది..? అనే చర్చ గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు విస్తరించింది.
ఒకవైపు శైలజానాథ్ వర్గం, మరోవైపు సాంబశివరెడ్డి వర్గం తమ బలాన్ని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇటీవల రెండు వర్గాలు విడివిడిగా కార్యక్రమాలు నిర్వహించడం, తమ అనుచర వర్గాలను మరింత బలోపేతం చేసుకునేందుకు కసరత్తు చేయడం కూడా వర్గపోరు చర్చకు మరింత ఊతమిచ్చింది.
సాధారణ కార్యకర్త మాత్రం ఈ పరిణామాల మధ్య అయోమయంలో ఉన్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ కార్యక్రమాల ప్రచారంలోనే వర్గాల మధ్య ప్రాధాన్య పోరు బయటపడుతుండటంతో, రాబోయే రోజుల్లో టికెట్ కేటాయింపు సమయంలో పరిస్థితి మరింత వేడెక్కే అవకాశాలున్నాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
“టికెట్ కోసం పోరు ఇప్పటినుంచే మొదలైందా..? లేక పార్టీ అధిష్టానం దృష్టిని ఆకర్షించేందుకు శక్తి ప్రదర్శన జరుగుతోందా..?” అనే ప్రశ్నలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చగా మారాయి. ప్రస్తుతం పోస్టర్ల రాజకీయమే శింగనమల నియోజకవర్గంలో హాట్ టాపిక్‌గా మారినప్పటికీ, దాని వెనుక భవిష్యత్ రాజకీయ వ్యూహాలు దాగి ఉన్నాయా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
2029లో శింగనమల వైసీపీ అభ్యర్థి ఎవరు..? అధిష్టానం సాకే శైలజానాథ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..? లేక ఆలూరు సాంబశివరెడ్డి వర్గానికే అవకాశం దక్కుతుందా..? అన్న అంశంపై ఇప్పటినుంచే చర్చ మొదలైంది. ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలు చూస్తుంటే శింగనమల వైసీపీలో వర్గపోరు తెరవెనుక మాత్రమే కాకుండా బహిరంగ చర్చకు దారితీస్తోందనే అభిప్రాయాలు బలపడుతున్నాయి.
శింగనమల రాజకీయాల్లో ఈ పరిణామాలు ఎటువైపు మలుపు తిరుగుతాయో, పార్టీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
“ప్రస్తుతం పోస్టర్ల రాజకీయాలు మాత్రమే కనిపిస్తున్నప్పటికీ, తెరవెనుక టికెట్ రాజకీయాలు నడుస్తున్నాయా..?” అనే ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *