నార్పల యువ క్రికెటర్ జగన్మోహన్ రెడ్డికి భారీ గుర్తింపు..
విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా) :- ఏటీబీపీఎల్ వేలంలో రూ.80 వేల ధర పలికిన కాకినాడ రాయల్ ఛాలెంజర్స్ నార్పల మండలానికి చెందిన యువ క్రికెటర్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్ర టెన్నిస్ బాల్ ప్రీమియర్ లీగ్ (ఏటీబీపీఎల్) ఆటగాళ్ల వేలంలో విశేష గుర్తింపు పొందారు. తాజాగా నిర్వహించిన వేలంలో కాకినాడ రాయల్ ఛాలెంజర్స్ ఆయనను రూ.80 వేల ధరకు తమ జట్టులోకి ఎంపిక చేసింది.
చిన్నప్పటి నుంచే క్రికెట్‌పై ఆసక్తి పెంచుకున్న జగన్మోహన్ రెడ్డి, 14 ఏళ్ల వయసులోనే లెదర్ బాల్ క్రికెట్లో అడుగుపెట్టారు. అనంతరం 14 ఏళ్లలోపు, 16 ఏళ్లలోపు, 19 ఏళ్లలోపు, 23 ఏళ్లలోపు విభాగాల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో తన ప్రతిభను చాటుకున్నారు. అయితే ఆశించిన స్థాయిలో అవకాశాలు రాకపోయినా నిరుత్సాహానికి లోనుకాకుండా తన ఆటను కొనసాగించారు.తర్వాత టెన్నిస్ బాల్ క్రికెట్‌పై దృష్టి సారించిన ఆయన, పలు పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచి ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్‌గా పేరుగాంచిన ఏటీబీపీఎల్ ఆటగాళ్ల వేలంలో రూ.80 వేల ధర పలికి కాకినాడ రాయల్ ఛాలెంజర్స్ జట్టులో చోటు దక్కించుకున్నారు.
జగన్మోహన్ రెడ్డి సాధించిన ఈ విజయంతో నార్పల మండల ప్రజలు, క్రీడాభిమానులు, యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు. కృషి, పట్టుదల ఉంటే విజయాలు తప్పక సాధ్యమని ఆయన మరోసారి నిరూపించారని స్థానికులు అభినందిస్తున్నారు.


