ప్రజాస్వామ్య ప్రక్రియకు బీజేపీ తూట్లు – Visalaandhra


మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ మండిపాటు
న్యూదిల్లీ:
బీజేపీ ప్రజాస్వామ్య ప్రక్రియకు తూట్లు పొడుస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను మధ్యప్రదేశ్ ఎన్నికల అధికారి తిరస్కరించడంపై ఆ పార్టీ స్పందించింది. వేణుగోపాల్ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందిస్తూ మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడం ప్రజాస్వామ్య ప్రక్రియను దెబ్బతీయడానికి బీజేపీ చేసిన బహిరంగ ప్రయత్నమని ఆయన అభివర్ణించారు. ఆమె నామినేషన్‌లో ఏదైనా తప్ప్పు లేదా వివరాలను వెల్లడించలేదనే ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి, అవాస్తవమైనవని పేర్కొన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీకి దక్కాల్సిన స్థానాన్ని లాక్కోవడానికి చేసిన నిరాశాజనకమైన ప్రయత్నం మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమ వైపు తిప్ప్పుకునే బీజేపీ కుట్రలు విఫలమవుతున్నాయని గ్రహించిన తర్వాత, వారు ఇంత దిగజారిపోయి మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించారని వివరించారు. ఇది రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై బీజేపీకి ఉన్న నిబద్ధత ఎంత బూటకమో మరోసారి నిరూపిస్తోందని తెలిపారు. ప్రతి దశలోనూ బీజేపీ ఏదో ఒక రూపంలో ఓట్ల చోరీ చేయడానికే ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు దోచుకునే ఈ చర్యను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని కరాకండిగా చెప్పారు. దీనిపై న్యాయపరంగా, రాజకీయంగా, ప్రజల మధ్యన గట్టిగా పోరాడుతామని వేణుగోపాల్ అన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *