గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని వామపక్ష పార్టీల ధర్నా…


విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా ):- మండల కేంద్రంలోని గాంధీ సర్కిల్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి సాకే గంగాధర్, సీపీఎం నాయకుడు ప్రభాకర్, ఏఐఎస్‌ఎఫ్ కార్యదర్శి నవీన్ మాట్లాడుతూ పెట్రోలియం ఉత్పత్తుల ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో లభించే గ్యాస్ వనరులను సమర్థంగా వినియోగించకుండా ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరడం లేదన్నారు. దేశంలో లభించే గ్యాస్ ఉత్పత్తిని పెంచితే దిగుమతులపై ఆధారపడే పరిస్థితి తగ్గుతుందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే ముడి చమురు ధరలు భారీగా పెరగకపోయినా పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉండటానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నులే ప్రధాన కారణమని ఆరోపించారు. పెట్రోలియం ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం వసూలు చేస్తున్న పన్నులు గణనీయంగా పెరిగాయని, రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనపు పన్నులు విధించడం వల్ల వినియోగదారులపై భారం మరింత పెరిగిందన్నారు. కార్పొరేట్ సంస్థలకు భారీ స్థాయిలో రాయితీలు కల్పిస్తూ, మరోవైపు సాధారణ ప్రజల నుంచి పన్నుల రూపంలో అధిక మొత్తాలను వసూలు చేయడం అన్యాయమని విమర్శించారు. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలను తక్షణమే తగ్గించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులను తగ్గించాలని, ప్రపంచ మార్కెట్‌లో చౌకగా లభించే ప్రాంతాల నుంచి ముడి చమురును కొనుగోలు చేసే విధానాన్ని అవలంబించాలని, దేశీయ ఆయిల్, గ్యాస్ అన్వేషణను పెంచి స్వదేశీ ఉత్పత్తికి ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే కేజీ బేసిన్‌లో లభిస్తున్న గ్యాస్‌లో రాష్ట్రానికి తగిన వాటా కేటాయించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సీపీఐ మండల సహాయ కార్యదర్శి చాపల రామాంజి, రైతు సంఘం మండల కార్యదర్శి లలితమ్మ, సీపీఎం నాయకులు ఎర్ర నాగప్ప రామాంజనేయులు, నాగన్న, సీపీఐ సీనియర్ నాయకుడు నాగరాజు, వెంకటేష్, నారాయణప్ప, పెద్దక్క, సుందరమ్మ, సంజీవరాయుడు, ఆల్టాప్ తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *