ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికల జారీ


దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ఈరోజు ఉదయం సముద్ర గర్భంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.8గా నమోదైంది. ఈ భారీ భూకంపం కారణంగా ఫిలిప్పీన్స్‌తో పాటు పొరుగున ఉన్న ఇండోనేషియాలోని కొన్ని తీర ప్రాంతాలకు కూడా అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో తీరప్రాంత ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఫిలిప్పీన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ అండ్ సీస్మాలజీ వెల్లడించిన వివరాల ప్రకారం ఉదయం 7:37 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ఈ భూకంపం సంభవించింది. దేశంలోని రెండో అతిపెద్ద ద్వీపమైన మిండనావోలోని సారంగాని ప్రావిన్స్‌కు చెందిన మాసిమ్ పట్టణానికి నైరుతి దిశగా 32 కిలోమీటర్ల దూరంలో, సముద్రంలో 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. భూకంపం తర్వాత అధికారులు తక్షణమే అప్రమత్తమయ్యారు. ఫిలిప్పీన్స్‌లోని 9 తీరప్రాంత ప్రావిన్సులకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఆయా ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే సురక్షితమైన, ఎత్తైన ప్రదేశాలకు తరలివెళ్లాలని ప్రభుత్వం సూచించింది. ఇవాళ‌ ఉదయమే మొదటి సునామీ అలలు తీరాన్ని తాకవచ్చని, అవి కొన్ని గంటల పాటు కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. భూకంపం ధాటికి కొన్ని భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయని, పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని స్థానిక మీడియా తెలిపింది. సమీప ప్రావిన్సులలో కూడా భూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. అయితే, భూకంప కేంద్రానికి సమీపంలో బలమైన ప్రకంపనలు వచ్చినప్పటికీ, ఫిలిప్పీన్స్ లేదా ఇండోనేషియాలో ఎక్కడా ప్రాణనష్టం లేదా పెద్ద ఎత్తున ఆస్తినష్టం జరిగినట్లు ప్రాథమిక నివేదికలు లేవని అధికారులు స్పష్టం చేశారు.

ఇదిలా ఉంటే… ఫిలిప్పీన్స్‌లో భూకంపం నేపథ్యంలో ఇండోనేషియా వాతావరణ, క్లైమాటాలజీ, జియోఫిజిక్స్ ఏజెన్సీ కూడా తమ ఈశాన్య తీర ప్రాంతాలకు సునామీ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్లు జిన్హువా వార్తా సంస్థ తన కథనంలో పేర్కొంది. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అని పిలిచే ప్రధాన టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దుల్లో ఫిలిప్పీన్స్ ఉండటం వల్ల ఇక్కడ తరచుగా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *