రాజ్యసభ సీట్లపైకసరత్తు కొలిక్కి – Visalaandhra


రెండేళ్ల పాలన, ఎసఐఆర్‌పై ఎన్డీయే చర్చ
రాష్ట్రాభివృద్ధి, సంక్షేమంపై విస్తృత ప్రచారానికి నిర్ణయం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: రాజ్యసభకు అభ్యర్థుల ఎంపికపై కూటమి కసరత్తు కొలిక్కి వచ్చింది. నామినేషన్ల ప్రక్రియ ఈనెల 8వ తేదీతో ముగియనుంది. మÖడు రోజులే మిగిలివుండటంతో ఆశావాహుల్లో ఉత్కంఠత ఎక్కువైంది. ఇదే క్రమంలో కూటమి నాయకులు గురువారం భేటీ అయ్యారు. రాజ్యసభ సీట్లు, రాష్ట్రంలో ప్రారంభమైన ఎసఐఆర్ నిర్వహణ, ఓటర్ల నమోదులో తీసుకోవల్సిన జాగ్రత్తలు, రెండేళ్ల పాలన పూర్తిపై ప్రజల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. అభ్యర్థుల విషయంలో ఇప్పటికే ఒక అవగాహనకు వచ్చినట్లు నామినేషన్ల ప్రక్రియ ముగియక ముందే ప్రకటించే అవకాశం ఉందని ఆయా పార్టీల నేతలు భావిస్తున్నారు. ఏపీతో పాటు దేశంలోని 24 స్థానాలకు ఈనెల 18న పోలింగ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నుంచి నాలుగు స్థానాలు ఖాళీ అవుతున్నాయి. వైసీపీ సభ్యులు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పరిమళ్ నత్వానీతో పాటు సానా సతీశ్ పదవీ కాలం ముగియనుంది. ఈ నాలుగు సీట్లలో జనసేనకు ఒకటి ఖాయం కాగా టీడీపీలో ఆశావాహులు ఎక్కువగా ఉన్నందున, బీజేపీకి సీటు ఇవ్వలేమని చంద్రబాబు ఇప్పటికే చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. రాజ్యసభలో బలం పెంచుకోవాలనే ధ్యేయంతో ఉన్న బీజేపీ అధిష్టానం ఏ చిన్నపాటి అవకాశాన్ని వదులుకునే పరిస్థితి లేదు. ఆఖరి నిముషంలో అయినా ఒక సీటును కచ్చితంగా అడిగే అవకాశముందని భావిస్తున్నారు. అదే జరిగితే జనసేన, టీడీపీ చెరో సీటు బీజేపీకి కేటాయించాల్సి రావచ్చు. మిగిలిన రెండు సీట్లలో ఒకటి టీడీపీ సిట్టింగ్ ఎంపీ సానా సతీశ్‌ను కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చివరిగా ఉండే ఒక సీటు… బీసీ, ఎస్సీ వర్గాల్లో ఒకరికి దక్కొచ్చని భావిస్తున్నారు. బీజేపీ వెనక్కి తగ్గితే టీడీపీలో మరొకరి అవకాశం ఉంటుంది. గతంలో బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలైకు కేటాయించాల్సి వస్తుందన్న ప్రచారం జరిగింది. ఆయన పార్టీకీ రాజీనామా చేయడంతో బీజేపీ సీటు కోసం పట్టుపట్టకపోవచ్చన్న ప్రచారం కూడా ఉంది. అప్ప్పు ఓసీ వర్గాలను అవకాశం వరిస్తుంది. కాగా, టీడీపీ ఆశావహుల్లో ఓసీ వర్గాల నుంచి భాష్యం రామకృష్ణ, దేవినేని ఉమామహేశ్వరరావు, కంభంపాటి రాంమోహన్‌రావు, తొండెపు దశరథ జనార్థన్, కిలారు రాజేశ్, రెడ్డెప్పగారి శ్రీనివాస రెడ్డి తదితరులు ఉన్నారు. మంత్రి నారా లోకేశ్‌కు కిలారు రాజేశ్ అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయనకు అభ్యర్థిత్వం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఎస్సీ వర్గ నాయకుడు వర్ల రామయ్య, మైనారిటీ వర్గం నుంచి ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎంఏ. షరీఫ్ కూడా స్థానాలు ఆశిస్తున్నారు. బీసీ వర్గానికి అవకాశం వస్తే సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు సీటు ఖాయమని విస్తృత ప్రచారం జరుగుతోంది. ఇదిలావుంటే జనసేన నుంచి వ్యాపారవేత్త లింగమనేని రమేశ్‌కు సీటు ఖాయమైనట్లే పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సమావేశంలో నాయకులు చంద్రబాబు, పల్లా శ్రీనివాసరావు, పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, మాధవ్ పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *