నెతన్యాహుపై ట్రంప్ మండిపాటు


నేను లేకపోతే జైల్లో ఉండేవాడివని ఆగ్రహం
వాషింగ్టన్:
ఇజ్రాయిల్‌ను వెనకేసుకొస్తూ ఇరాన్‌పై యుద్ధానికి దగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్ప్పుడు ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. నెతన్యాహుపై ట్రంప్ మండిపడినట్లు తెలుస్తోంది. తాను లేకపోతే ఇప్పటికే జైల్లో ఉండే వాడివంటూ నెతన్యాహుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. లెబనాన్‌లోని హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ సైనిక చర్యల విషయంపై నెతన్యాహును ట్రంప్ మందలించినట్లు అమెరికా అధికారిక వర్గాలను ఉటంకిస్తూ అక్కడి మీడియాలో కథనాలు వస్తున్నాయి. బీరుట్ దక్షిణ శివారు ప్రాంతాలను ఖాళీ చేయాలని అక్కడి ప్రజలను ఇజ్రాయిల్ సైన్యం హెచ్చరించింది. అయితే, లెబనాన్‌పై దాడులు చేస్తే అమెరికాతో చర్చల నుంచి వైదొలుగుతామని ఇరాన్ బెదిరించింది. ఈ క్రమంలో నెతన్యాహు తో ట్రంప్ ఫోన్‌లో మాట్లాడారు. తెలఅవీవ్ చర్యలు…ఇరాన్‌తో దౌత్య ప్రయత్నాలను దెబ్బతీస్తున్నాయని, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను పెంచుతున్నాయని ట్రంప్ ఆందోళన వ్యక్తంచేశారనేది ఆ మీడియా కథనాల సారాంశం. ‘నువ్వు పిచ్చివాడివి. నేను లేకుంటే నువ్వు జైలులో ఉండేవాడివి. నేను నిన్ను కాపాడుతున్నా. ప్రస్తుతం అందరూ నిన్ను ద్వేషిస్తున్నారు. నీ చర్యల వల్ల ఇజ్రాయిల్‌ను కూడా ఇష్టపడటం లేదు’ అని నెతన్యాహుపై ట్రంప్ మండిపడినట్లు అవి పేర్కొన్నాయి. అదే సమయంలో ‘అసలు నువ్వు ఏం చేస్తున్నావు..?’ అంటూ ఇజ్రాయిల్ ప్రధానిపై ట్రంప్ గట్టిగా అరిచినట్లు వెల్లడించాయి.
నెతన్యాహు నిర్ణయాలను కూడా ఈ సందర్భంగా ప్రశ్నించారని పేర్కొన్నాయి. ఒక హిజ్బుల్లా కమాండర్‌ను హతమార్చేందుకు తెలఅవీవ్ చేస్తున్న సైనిక చర్యల్లో అనేకమంది లెబనీస్ పౌరులు ప్రాణాలు కోల్పోవడంపై ఆందోళన వ్యక్తంచేసినట్లు కూడా వెల్లడించాయి. ఇక నెతన్యాహుతో సానుకూలమైన సంభాషణ జరిగిందని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో ఓ పోస్టు ద్వారా వెల్లడించారు. బీరుట్ వైపు ఇజ్రాయిల్ దళాలు వెళ్లవని హామీ ఇచ్చారు. ఈమేరకు హిజ్బుల్లా నాయకులతోను మాట్లాడినట్లు ట్రంప్ తెలిపారు. ఇజ్రాయిల్‌పై సైనిక కాల్పులను ఆపేందుకు వారు అంగీకరించినట్లు పేర్కొన్నారు. ఇజ్రాయిల్ కూడా వారిపై కాల్పులకు దూరంగా ఉంటుందని వెల్లడించారు. అయితే, నెతన్యాహు ప్రకటన ఇందుకు భిన్నంగా ఉంది. ఇజ్రాయిల్ నగరాలు, పౌరులపై దాడులు కొనసాగితే హిజ్బుల్లాను లక్ష్యంగా చేసుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ విషయాన్ని ట్రంప్‌నకు కూడా తెలియజేసినట్లు పేర్కొన్నారు.

The post నెతన్యాహుపై ట్రంప్ మండిపాటు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *