పుస్తకాల పేరుతో వేల రూపాయల వ్యాపారమా?


ప్రైవేట్ పాఠశాలల దోపిడీపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి

: ఏఐఎస్యూ జిల్లా అధ్యక్షుడు కనుమ దామోదర్
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు పుస్తకాల పేరుతో వేల రూపాయలు వ్యాపారం చేస్తున్నాయని ఆ ప్రైవేట్ పాఠశాలల దోపిడీపై విద్యాశాఖ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐఎస్యూ జిల్లా అధ్యక్షుడు కనుమ దామోదర్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వారు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని పలు ప్రైవేట్ పాఠశాలలు పుస్తకాల పేరుతో వేల రూపాయలు వసూలు చేస్తున్నారు ఒకటవ తరగతికి 5,000 నుంచి 10,000 వేల రూపాయల వరకు పుస్తకాలు విక్రయిస్తున్నారని తెలిపారు. నిబంధనల ప్రకారం విద్యాసంస్థల పేరుతో ముద్రించిన పుస్తకాలు అమ్మకూడదని ఉన్నప్పటికీ ఆ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఒక రూములో డంపు చేసుకొని వేల రూపాయలకు పుస్తకాలు అమ్ముతున్నారూ అని మండిపడ్డారు. విద్యాశాఖ నిబంధనల ప్రకారం పాఠశాలల్లో ఎలాంటి వ్యాపార లావాదేవీలు జరపకూడదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, యాజమాన్యాలు లాభార్జనే ధ్యేయంగా విచ్చలవిడిగా వ్యవహరిస్తునారు అని ఆవేదన వ్యక్తం చేశారు. బయట మార్కెట్ ధరల కంటే రెండు, మూడు రెట్లు అధిక ధరలకు పుస్తకాలు, దుస్తులు, షూస్ వంటివి పాఠశాలల్లోనే విక్రయిస్తూ సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రుల రక్తాన్ని పిండుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.యాజమాన్యాలు నిర్దేశించిన చోటే కొనాలని, లేదంటే విద్యార్థులపై మానసిక ఒత్తిడి తెస్తున్నారని, దీనివల్ల తల్లిదండ్రులు వేలాది రూపాయలు అప్పులు చేయాల్సి వస్తోందని తెలిపారు. విద్యాసంస్థలు విజ్ఞాన కేంద్రాలుగా ఉండాలి కానీ, ఇలా దోపిడీ కేంద్రాలుగా మారడం సిగ్గుచేటన్నారు.మండల విద్యాశాఖాధికారి తక్షణమే స్పందించి ధర్మవరం పట్టణంలోని ప్రైవేట్ పాఠశాలలపై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ కమిటీలతో తనిఖీలు చేయించాలని, నిబంధనలు ఉల్లంఘించిన స్కూళ్ల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులు, తల్లిదండ్రులను సమీకరించి విద్యాశాఖ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్యూ నాయకులు,పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *