ఇస్కఫ్ జాతీయ మహాసభలో వక్తలు
(విశాలాంధ్ర ప్రత్యేక ప్రతినిధి)
ప్రజల ఐక్యతతోనే సామ్రాజ్యవాదాన్ని, మతతత్త్వాన్ని ఓడించగలమని ప్రపంచ శాంతి సంఘం అధ్యక్షుడు పల్లబ్ సేన్ గుప్తా అన్నారు. శాంతి, స్నేహం, సాంస్కృతిక ఐక్యతకు అంకితమైన 85 ఏళ్ల చరిత్ర గల భారత సాంస్కృతిక స్నేహ సహకార సంఘం (ఇస్కఫ్) 24 వ జాతీయ మహాసభలు గురువారం చెన్నై నగరంలో ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. దేశంలోని అనేక రాష్ట్రాల నుంచి ప్రతినిధులు, శాంతి ఉద్యమ నాయకులు, సాంస్కృతిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ముతమిజ్ పేరవై హాలులో జరిగిన ఈ జాతీయ మహాసభల్లో పల్లబ్ సేన్ గుప్తా స్వాగతోపన్యాసం చేశారు. ఇస్కఫ్ జాతీయ మహాసభల్లోనే క్యూబా నాయకుడు కాస్ట్రో శత జయంతి ఉత్సవాలు ప్రారంభించడం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని అన్నారు. కాస్ట్రోను మూడుసార్లు కలిసే అవకాశం దక్కిందని గుర్తు చేసుకున్నారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన హిందూ దిన పత్రిక సంపాదకుడు ఎన్.రామ్ మాట్లాడుతూ పలస్తీనా, క్యూబా, వెనుజుల పరిణామాలు చూస్తుంటే సామ్రాజ్యవాదం జెన్ జనరేషన్ అంటున్న గ్యాంగ్స్టర్స్ ఇంపీరియలిజంగా మారిందని అన్నారు. ఇస్కఫ్ మహాసభలో యువత ప్రాతినిధ్యం బాగా ఉండటంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. పలస్తీనా అథారిటీ రాయబారి అబ్దుల్లా అబుషావేశ్ మాట్లాడుతూ తమ దేశంలో ఇజ్రాయిల్ జరుపుతున్న మారణకాండను ప్రస్తావించి ఆవేదన చెందారు. ప్రపంచంలో సామ్రాజ్యవాద మీడియా పలస్తీనా ప్రజల ఆవేదనను తొక్కిపెట్టి దుష్ప్రచారం చేస్తోందని, ఇస్కఫ్ లాంటి సంస్థల వేదికల పైనే తమ గొంతు వినిపించే అవకాశం కలుగుతుందని ఆయన తెలిపారు. నేపాల్ శాంతి సంఘీభావ సంఘం ప్రతినిధి సతీష్ అధికారి మాట్లాడుతూ తమ స్నేహ సంబంధాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. ఈ మహాసభలకు ఇస్కఫ్ అధ్యక్షులు భానుదేబ్ దత్త అధ్యక్షత వహించగా, రిసెప్షన్ కమిటీ అధ్యక్షుడు సౌమ్య రాజరత్నం స్వాగత ప్రసంగం చేశారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్ మాట్లాడుతూ యుద్ధ వ్యతిరేక ప్రచారంలోను, క్షీణ సంస్కృతికి వ్యతిరేకంగా పోరాటంలోను ఇస్కఫ్ పాత్రను ప్రశంసించారు. గజాపై జరుగుతున్న మారణకాండ ఫోటోలు, ఇస్కఫ్ చరిత్రపై ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను ప్రపంచ శాంతి సంఘం అధ్యక్షుడు పల్లబ్ సేన్ గుప్తా ప్రారంభించారు. అంతర్జాతీయ పరిస్థితులు, శాంతి పరిరక్షణ, మత సామరస్యం, ఆర్థిక అసమానతలు, ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న యుద్ధ పరిస్థితులపై వక్తలు ప్రసంగించారు. ప్రపంచ దేశాల మధ్య స్నేహ సంబంధాలు బలోపేతం చేయాల్సిన అవసరాన్ని మహాసభలు పునరుద్ఘాటించాయి. ఇస్కఫ్ తమిళనాడు గరగ నృత్యం, ఒడిశా రంగమాటి నృత్యం, ఆంధ్ర ప్రదేశ్కు చెందిన కూచిపూడి కళాకారిణి మహాదాస్యం ప్రియాంక సాయి లహరి తరంగం నృత్యం ప్రతినిధులను అలరించాయి. చెన్నైలో ఇస్కఫ్ ఉచితంగా నిర్వహిస్తున్న ట్యూషన్ తరగతుల్లో చదువుకుంటున్న పదవ తరగతి విద్యార్థిని అదిరా పాడిన జానపద గీతం, ఆంధ్ర ప్రదేశ్ జానపద కళాకారుల సంఘం అధ్యక్షులు ఎల్.కృష్ణబాబు పాటలు ప్రశంసలు అందుకున్నాయి. చివరిగా ఇస్కఫ్ తమిళనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.రాధాకృష్ణన్ కృతజ్ఞతలు తెలిపారు.


