విశాలాంధ్ర – నార్పల (అనంతపురం జిల్లా): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం గ్రామపంచాయతీల్లో నిర్వహిస్తున్న స్వచ్ఛపథం కార్యక్రమంలో భాగంగా స్థానిక మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం ప్రత్యేక శుభ్రత కార్యక్రమం చేపట్టారు. నార్పల నుంచి కేశేపల్లి వెళ్లే ప్రధాన రహదారిలో, స్మశాన వాటిక ప్రాంతం సమీపంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించారు. రహదారి ఇరువైపులా పెరిగిన కంపచెట్లు, గడ్డి, మట్టి దిబ్బలను తొలగించి రహదారిని పూర్తిగా శుభ్రం చేశారు. అనంతరం కూతలేరు వంకపై ఉన్న చిన్న బ్రిడ్జిపై పేరుకుపోయిన చెత్త, కంపను కూడా తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టారు. దీంతో రహదారి మరింత సుగమంగా మారి ప్రయాణికులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించబడినట్లు అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని ఎంపీడీవో మమతా దేవి ఆధ్వర్యంలో నిర్వహించగా, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసులు పాల్గొన్నారు.


