కర్నాటక నాయకత్వంపై తర్జన భర్జన! – Visalaandhra


సిద్ధరామయ్యను రాజ్యసభకు వెళ్లమన్నారని వదంతులు
వాస్తవం లేదన్న కాంగ్రెస్ అధిష్టానం

న్యూదిల్లీ: కర్నాటకలో నాయకత్వ మార్పుపై నాటకీయ మలుపు చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను పదవి నుంచి తప్ప్పుకుని రాజ్యసభ ద్వారా దిల్లీకి వెళ్లాలని పార్టీ అధిష్టానం కోరిందని కాంగ్రెస్ వర్గాలు మంగళవారం తెలిపాయి. అక్కడ ఆయనకు జాతీయస్థాయిలో మరింత పెద్ద పాత్ర ఇవ్వవచ్చని కూడా పేర్కొన్నాయి. దిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం కర్నాటకలో నాయకత్వ మార్పుపై వస్తున్న ఊహాగానాలను సీనియర్ కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా తోసిపుచ్చిన కొద్దిసేపటికే ఈ పరిణామం చోటుచేసుకుంది. ఆ వర్గాల సమాచారం ప్రకారం, సిద్ధరామయ్య రాజ్యసభ ద్వారా జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి, దిల్లీలో సంస్థాగత లేదా పరిపాలనాపరంగా పెద్దపాత్ర చేపట్టవచ్చని కాంగ్రెస్ నాయకత్వం ఆయనకు సూచించింది. మిగతా విషయాలన్నీ, ఆయన సమస్యలన్నీ చూసుకుంటామని అధిష్టానం సిద్ధరామయ్యకు హామీ ఇచ్చినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. దిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, పార్టీ కర్నాటక ఇంఛార్జ్ రణదీప్ సుర్జేవాలా హాజరయ్యారు. అయితే నాయకత్వ మార్పు జరగవచ్చని ఆ వర్గాలు చెబుతున్నప్పటికీ… సిద్ధరామయ్య స్థానంలో మరొకరిని నియమించే విషయంపై ఎలాంటి చర్చ జరగలేదని కాంగ్రెస్ అధికారికంగా ఖండించింది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశం అనంతరం కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ చర్చలు రాజ్యసభ, కర్నాటక శాసనమండలి ఎన్నికలకు మాత్రమే పరిమితమయ్యాయని తెలిపారు. ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ‘నేటి చర్చ కేవలం రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల చుట్టూనే జరిగింది. మీరు ఊహించినదేదీ నిజం కాదు’ అని అన్నారు. ‘మేము ఒక సమావేశం నిర్వహించాము. సీఎం, డీసీఎం, రణదీప్ హాజరయ్యారు. ఈరోజు చర్చ మొత్తం రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లపైనే కేంద్రీకృతమైంది. ఊహాగానాలు ఆపండి’ అని అన్నారు. కాగా సమావేశ ప్రాంగణం నుంచి బయలుదేరేటప్ప్పుడు సిద్ధరామయ్య గానీ, శివకుమార్ గానీ నాయకత్వ సమస్యపై వ్యాఖ్యానించలేదు. మరోవైపు, రాజ్యసభ, కర్నాటక శాసన మండలి ఎన్నికలపై చర్చలు సమావేశం అధికారిక అజెండాలో ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి.
కర్నాటక నుంచి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలలో, కాంగ్రెస్ మూడు గెలుచుకుంటుందని అంచనా వేయగా, బీజేపీ ఒక స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. మల్లికార్జున ఖడ్గేను కర్నాటక నుంచి రాజ్యసభకు తిరిగి నామినేట్ చేసే అవకాశం ఉండగా, పార్టీ డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్ అభ్యర్థిత్వాన్ని, అలాగే ఒక మహిళ లేదా ఓబీసీ అభ్యర్థిని కూడా పరిశీలిస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *