లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు


టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కంపెనీకి నోటీసులు
27న విచారణకు హాజరు కావాలని ఆదేశం

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: ఏసీ లిక్కర్ స్కామ్ దర్యాప్తులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దూకుడు పెంచడంతో అధికార పార్టీలో గుబులు మొదలైంది. ముఖ్యంగా టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని కంపెనీకి చెందిన ఇశ్వానీ, కేశినేని డెవలపర్స్ కలిసి నిర్వహించిన రియల్ ఎస్టేట్ సంస్థ ఫ్రైడ్ ఇన్‌ఫ్రాకు ఈడీ నుంచి నోటీసులు అందాయి. తొలుత ఎంపీ కేశినేని చిన్ని భార్యకు నోటీసులు వచ్చాయని ప్రచారం రాగా… దానిని చిన్ని కొట్టిపారేశారు. ఈనెల 27న విచారణకు హాజరుకావాలని ఈడీ ఆదేశించింది. దీంతో అధికార కూటమిలో కలకలం రేగినట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుం టున్నాయి. ఏపీలో వెలుగులోకి వచ్చిన రూ.3,200 కోట్ల లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న రాజ్ కసిరెడ్డి ఆర్థిక లావాదేవీలు, వ్యాపార భాగస్వామ్యాలు, సంబంధిత సంస్థలపై ఈడీ ప్రత్యేక దృష్టి సారించింది. ముఖ్యంగా ఫ్రైడ్ ఇన్‌ఫ్రాకు ఎలఎల్‌పీ సంస్థతో రాజ్ కసిరెడ్డికి ఉన్న సంబంధాలు, పెట్టుబడుల వ్యవహారాలు, వాటాదారుల వివరాలు, ఆర్థిక లింకులపై అధికారులు లోతుగా ఆరా తీస్తున్నట్లు సమాచారం. లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన అక్రమ డబ్బు ఇతర వ్యాపార రంగాలకు మళ్లించబడిందా అనే కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే కీలక వ్యక్తులను ఈడీ విచారించగా, తాజాగా టీడీపీ ఎంపీ కుటుంబ సభ్యురాలికి నోటీసులు రావడం రాజకీయంగా సంచలనంగా మారింది. గత వైసీపీ పాలనలో భారీ స్థాయిలో లిక్కర్ అక్రమాలు జరిగాయని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్న తరుణంలో, ఇప్ప్పుడు అధికార కూటమికే చెందిన ఎంపీ కంపెనీకి ఏకంగా ఈడీ నోటీసులు పంపడం రాజకీయంగా ఇబ్బందికర పరిణామంగా మారిందన్న చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారానికి మరింత ప్రాధాన్యత రావడానికి మాజీ ఎంపీ కేశినేని నాని చేసిన ఆరోపణలే కారణమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. లిక్కర్ స్కామ్ ఆరోపణలు వెలుగులోకి వచ్చిన వెంటనే తన సోదరుడు కేశినేని చిన్నిపై నాని బహిరంగ విమర్శలు గుప్పించారు. రాజ్ కసిరెడ్డితో ఆయనకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా ఆరోపించిన విషయం విదితమే. అప్పట్లో ఈ వ్యాఖ్యలు టీడీపీ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. ఇద్దరు సోదరుల మధ్య ఎక్స్ వేదికగా మాటల యుద్ధమÖ జరిగింది. తనపై కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని కేశినేని చిన్ని తీవ్రంగా స్పందించారు. కేశినేని నాని అక్కడితో ఆగకుండా రాజ్ కసిరెడ్డికి చెందిన ప్రైడ్ ఇన్‌ఫ్రాక్రాన్ సంస్థలో కేశినేని చిన్ని దంపతులు వాటాదారులని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాసినట్లు అప్పట్లో వెల్లడించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని సంబంధిత కంపెనీలు ఒకే చిరునామాతో రిజిస్టర్ అయ్యాయని పేర్కొన్నారు. ఇప్ప్పుడు ఈడీ విచారణ అదే కోణంలో కొనసాగుతుండటంతో రాజకీయంగా ఈ అంశం మరింత హాట్ టాపిక్‌గా మారింది.
నా భార్యకు నోటీసులు ఇవ్వలేదు: కేశినేని చిన్ని
తన కుటుంబంపై వస్తున్న ఆరోపణలను ఎంపీ కేశినేని చిన్ని పూర్తిగా ఖండించారు. లిక్కర్ స్కామ్‌తో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన భార్యకు నోటీసులు రాలేదని, కేవలం కంపెనీకి మాత్రమే నోటీసులు ఇచ్చారంటూ ఆయన వివరణ ఇచ్చారు. 2021 డిసెంబరులో హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఈ సంస్థను ప్రారంభించామని తెలిపారు. గచ్చిబౌలిలోని ఒక భూమిని అభివృద్ధి చేయడం కోసమే ఈ సంస్థను ఏర్పాటు చేశామని చెప్పారు. ఆ భూమిని మరో ఇన్‌ఫ్రా కంపెనీ నుంచి కొనుగోలు చేశామని, అది పూర్తిగా భాగస్వామ్య ప్రాజెక్టు మాత్రమేనని స్పష్టం చేశారు. ఆ ప్రాజెక్టులో తమ వాటా కేవలం 400 చదరపు గజాలేనని, ఇతర భాగస్వాముల వాటా సుమారు 4 వేల చదరపు గజాలుగా ఉందని తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించి ప్రభుత్వ అనుమతుల కోసం దరఖాస్తు చేసినప్పటికీ, వివిధ కారణాల వల్ల అది ముందుకు సాగలేదని చెప్పారు. తమపై వస్తున్న ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని, వాస్తవాలకు విరుద్ధమని పేర్కొన్నారు.

The post లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *