జూన్‌లో విడుదలకు వరుస సినిమాలు
సినిమా: చెప్పుకోదగ్గ స్థాయిలో సినిమాలు విడుదల కాకపోవడం… ఐపీఎల్ ప్రభావం… ఎండల తీవ్రత… ఇలా ఎన్నో కారణాలతో గత కొన్ని నెలలుగా ప్రేక్షకుడు థియేటర్‌వైపు సరిగా చూడనేలేదు. వేసవి సీజన్ చప్పగా సాగుతూ… దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. అయితే కొసమెరుపులా జూన్ నెల విడుదలలు మాత్రం ఊరిస్తున్నాయి. వేసవి సీజన్లో ఇదే చివరి నెల. ఈసారి ఈ నెలలోనే కీలకమైన సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. మే చివరికి ఐపీఎల్ కూడా ముగుస్తుండడంతో సినిమా సందడి షురూ అవుతోంది. వేసవిలో రావాల్సిన చాలా సినిమాలు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో వాయిదా పడ్డాయి. మరికొన్ని ఐపీఎల్‌ని, ఇతరత్రా కారణాల్ని దృష్టిలో ఉంచుకుని వెనక్కి తగ్గాయి. త్వరలోనే ఐపీఎల్ కూడా పూర్తవుతుండడంతో జూన్ ఆరంభం నుంచే సినిమాల జోరు మొదలవుతోంది.
‘పెద్ది’పైన పెద్ద ఆశలు…
పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్ నటిస్తోన్న ‘పెద్ది’ సినిమాపై ప్రేక్షకులు, మెగా ఫ్యాన్స్ చాలా ఆశలతో ఎదురు చూస్తున్నారు. బుచ్చిబాబు సానా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ సరసన జాన్వికపూర్ కథానాయక పాత్రలో నటిస్తున్నారు. విభిన్న పవర్ఫుల్ పాత్రలో రామ్ చరణ్ కనిపించబోతున్నారు. ఇందులో కన్నడ శివరాజ్‌కుమార్, జగపతిబాబు, హిందీ నటుడు దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నిటిస్తున్నారు. చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగాతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ చిత్రంలోని ‘చికిరి చికిరి’, ‘రేరే రారా’ పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా యÖనిట్ రామ్ చరణ్‌తో సహా సినిమా ప్రోమోషన్లలో చాలా బిజీగా ఉన్నారు. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ పాన్ ఇండియా మÖవీ. అన్ని భాషల్లోని ప్రేక్షకులూ ఈ సినిమాపై ఆసక్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లోనే దాదాపు రూ.180 కోట్ల థియేట్రికల్ వ్యాపారాన్ని చేసుకున్నట్టు తెలుస్తోంది. అంచనాలకు తగ్గట్టుగా ఈ సినిమా ప్రేక్షకుల్ని అలరించిందంటే చిత్ర పరిశ్రమ మళ్లీ గాడిన పడినట్టే అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందిన చిత్రమిది. శ్రుతిహాసన్ ప్రత్యేకగీతంలో సందడి చేశారు. ఆ పాటకు సంబంధించిన ప్రోమోని శుక్రవారం విడుదల చేసింది చిత్రబృందం.
11,19,19,26…ఇలా వరుస రిలీజులు…
అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన ‘లెనిన’ జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన నాగార్జున స్వయంగా ట్వీట్ చేసి ఈ సినిమా విడుదలని పక్కా చేశారు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథతో రూపొందుతున్న ఈ చిత్రానికి మురళీకిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అగ్ర కథానాయిక సమంత ప్రధాన పాత్రధారిగా… నందినీరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మా ఇంటి బంగారం’ జూన్ 19న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 19న వడ్డే నవీన్ కథానాయకుడిగా నటిస్తూ, నిర్మించిన ‘ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు’ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇందులో నవీన్ పోలీస్ కానిస్టేబుల్‌గా నటిస్తున్నారు. యాక్షన్ డ్రామా చిత్రంగా తెరకెక్కించారు. ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్ని మొదలుపెట్టింది ఆ చిత్రబృందం. జూన్ 11న సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘సింగ్ గీతం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ సంస్థలపై ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించారు. అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రతాప్ అనే యువకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. 94 ఏళ్ల వయసులో సింగీతం శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని తెరకెక్కించడం విశేషం.
The post ఐపీఎల్ ముగియగానే…సినీ సందడి మొదళాయే! appeared first on Visalaandhra.


