స్టేట్ బ్యాంక్ వద్ద టూ వీలర్ల రాజ్యం… ప్రజలకు నరకయాతన!


విశాలాంధ్ర – నార్పల :- మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ ప్రాంతం పూర్తిగా టూ వీలర్ వాహనాల అడ్డాగా మారిపోయింది. బ్యాంక్‌కు వచ్చే కొందరు వాహనదారులు నిబంధనలు ఏమాత్రం పట్టించుకోకుండా రోడ్డుపైనే బైక్‌లు అడ్డదిడ్డంగా పార్క్ చేయడంతో ప్రధాన రహదారి రోజురోజుకూ ట్రాఫిక్ కష్టాలకు కేంద్రంగా మారుతోంది. ప్రజలు, ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.
ఇటీవల బస్సు వెళ్లే సమయంలో రోడ్డుకు అడ్డంగా నిలిపిన టూ వీలర్ కారణంగా బస్సు పూర్తిగా ఆగిపోయింది. చివరకు డ్రైవర్ స్వయంగా బైక్‌ను పక్కకు జరిపి బస్సును తీసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. ఈ ఘటన అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది.
ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ పర్యటన సమయంలో ట్రాఫిక్ సమస్య బయటపడటంతో డీఎస్పీ పర్యవేక్షణలో అడ్డంగా ఉన్న వాహనాలను తొలగించి, బ్యాంక్ ఎదుట గొలుసులు కూడా ఏర్పాటు చేయించారు. కానీ అవి రెండు రోజులు కూడా నిలవలేదు. అధికారులు వెళ్లిన వెంటనే మళ్లీ అదే నిర్లక్ష్యం, అదే అక్రమ పార్కింగ్ కొనసాగుతోంది.
ప్రతిరోజూ భారీ రద్దీ ఉండే ఈ ప్రాంతంలో పోలీసులు, సంబంధిత అధికారులు శాశ్వత చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై ఇష్టానుసారం వాహనాలు నిలిపే వారిపై కఠిన చర్యలు తీసుకుని భారీ జరిమానాలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ వంటి వాహనాలు వెళ్లాల్సి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. నాయకులు, అధికారులు వచ్చినప్పుడు మాత్రమే హడావుడి చేసి, తర్వాత పూర్తిగా పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా అధికారులు మేల్కొని స్టేట్ బ్యాంక్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

The post స్టేట్ బ్యాంక్ వద్ద టూ వీలర్ల రాజ్యం… ప్రజలకు నరకయాతన! appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *