. కాలం చెల్లిన వాహనాలే కార్మికుల పట్ల కాలనాగులు
. కాంట్రాక్టర్ ధన దాహానికి సమిధులవుతున్న నిరుపేదలు
. కాసుల కక్కుర్తిలో రవాణా శాఖ అధికారులు
. పట్టించుకోని అల్లూరి జిల్లా అధికార యంత్రాంగం
ఊరు కాని ఊరు, భాష కాని భాష అయినా తప్పని జీవన పోరాటం వారిది. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు. ఎంత దూరమైనా కూలీకి పోయి కుటుంబ పోషణ కోసం శ్రమిస్తున్న నిరంతర కష్టజీవులు. కానీ వారు పని చేసే చోటే వారికి మృత్యుపాశంగా మారితే… ఆదుకోవాల్సిన యాజమాన్యమే… నిర్దాక్షిణ్యంగా వదిలేస్తే వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది.
విశాలాంధ్ర బ్యూరో – పాడేరు : ఊరు కాని ఊరు, భాష కాని భాష అయినా తప్పని జీవన పోరాటం వారిది. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు. ఎంత దూరమైనా కూలీకి పోయి కుటుంబ పోషణ కోసం శ్రమిస్తున్న నిరంతర కష్టజీవులు. కానీ వారు పని చేసే చోటే వారికి మృత్యుపాశంగా మారితే… ఆదుకోవాల్సిన యాజమాన్యమే… నిర్దాక్షిణ్యంగా వదిలేస్తే వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుంది. సరిగ్గా ఇదే పరిస్థితి అల్లూరి సీతారామరాజు జిల్లాలో జాతీయ రహదారి నిర్మాణంలో పని చేస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలది. మరిన్ని వివరాల్లోకి వెళితే… అల్లూరి సీతారామరాజు జిల్లాలో జాతీయ రహదారి 516 నిర్మాణ పనుల్లో ఒక కార్మికుడు యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా మంగళవారం సాయంత్రం మృత్యువాత పడ్డాడు. తీగల ఆగితే డొంక కదిలినట్టు విస్తుగొలుపే నిజాలు బయటపడుతున్నాయి. ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యానికి ఇదే రీతిన అక్కడ కొన్ని రోజులుగా జరుగుతున్న వరుస ప్రమాదాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ప్రమాదాలు అక్కడి కూలీల గుండెల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. లంబసింగి నుంచి జిల్లా కేంద్రం పాడేరు వరకు జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులలో బలవుతున్న కూలీల దుస్థితి కాంట్రాక్టర్ ధన దాహానికి, సంబంధిత అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. జి.మాడుగుల మండలంలో ఈ పనులు చేపట్టిన ప్రముఖ నిర్మాణ సంస్థ కార్మికుల రక్షణను, సామాన్యుల భద్రతను ఏమాత్రం పట్టించుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా పనులు కొనసాగిస్తోంది. రహదారి మొత్తం మీద ఎక్కడయినా గోతులున్న చోట, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న చోట హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేయడం లేదు. దీంతో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. మండలంలోని కోడపల్లిలో గత ఏడాది జీపు బోల్తాపడి స్థానిక గిరిజనుడు మృతి చెందాడు. అదే ప్రాంతంలో కల్వర్టు నిర్మాణం కోసం పెద్ద గొయ్యి తీసి వదిలేయడంతో అందులో జారిపడి మరో వ్యక్తి మృతి చెందాడు. డి.గొందూరు సమీపంలో మరో ద్విచక్ర వాహనదారుడు ప్రమాదవశాత్తు కిందపడి కాలు విరగగొట్టుకున్నాడు. మధురి మామిడి సమీపంలో ఒక టిప్పర్ లారీ బోల్తా పడి డ్రైవర్ చెయ్యి విరిగింది. వంజర పంచాయతీ వద్ద వారం రోజుల క్రితం కాంక్రీట్ లారీ బ్రేకులు ఫెయిలై అనేక మంది కూలీలు గాయపడ్డారు. తాజాగా వంజర పంచాయతీ ములకాయి పుట్టు వద్ద రహదారి నిర్మాణంలో భాగంగా కల్వర్టు నిర్మాణం కోసం వేసిన తూరలును తరలిస్తున్న ట్రాలీకి మంగళవారం సాయంత్రం బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఆ ట్రాలీలో డ్రైవర్ సహా ముగ్గురు ఉన్నారు. బ్రేకులు ఫెయిల్ అయిన విషయం డ్రైవర్ చెప్పడంతో అందులో ఉన్న సహాయకుడు కంగారుపడి కిందకి దూకేశాడు. లారీ వేగంగా వెళ్లడం కింద పడ్డ కూలి వెనుక చక్రం కింద నలిగిపోయాయి మతి చెందాడు. ఇలా వరుస ప్రమాదాలు జరుగుతున్నా అక్కడ పట్టించుకునే నాధుడే కరువయ్యారు. జాతీయ రహదారి నిర్మాణ పనుల కాంట్రాక్టు దక్కించుకున్న ఆ నిర్మాణ సంస్థకి 100 నుంచి 150 మెషిన్లు, భారీ యంత్రాలు సహా పెద్ద ఎత్తున లారీలు ఇతరత్రా వాహనాలు ఉన్నాయి. వాటిలో సగానికి పైగా వాహనాలకు ఫిట్‌నెస్‌గానీ, ఇతర రవాణా శాఖ అనుమతులు ఇచ్చిన పత్రాలుగానీ లేవని తెలుస్తోంది. కాలం చెల్లిన వాహనాలను అక్కడ నిర్మాణ పనుల్లో ఉపయోగిస్తూ ఆ కాంట్రాక్టర్ కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడు. పర్యవేక్షించాల్సిన రవాణా శాఖ అధికారులు కొంతమంది కాసులు కక్కుర్తిలో అటువైపు చూడడమే మానివేశారు. తొలుత తూతూ మంత్రంగా కొన్ని వాహనాలను తనిఖీ చేసి, సరైన పత్రాలు లేవంటూ అపరాధ రుసుము విధించారు. అటు తర్వాత కాంట్రాక్టర్ ఇచ్చిన ముడుపులకు ఆశపడి కాలం చెల్లిన వాహనాలకు అనధికార అనుమతులు జారీ చేస్తున్నారు. దీంతో ఆ నిర్మాణ సంస్థ అనుమతులు, ఫిట్‌నెస్ లేని పదుల సంఖ్యలో వాహనాలను యదేచ్ఛగా తిప్ప్పుతూ వలస కూలీలు, స్థానిక గ్రామాలకు చెందిన గిరిజనుల ప్రాణాలను పణంగా పెడుతోంది. ఇలా జరుగుతున్న వరుస ప్రమాదాలకు బాధ్యులెవరు, రవాణా శాఖ, జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తున్నదనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే జరిగిన ప్రమాదాలకు భయాందోళనలకు గురవుతున్న వలస కూలీలు… భవిష్యత్‌లో ఇంకెంత మంది బలవుతారో అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరుస ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికయినా రవాణా శాఖ అధికారులు కళ్లు తెరుస్తారా… జిల్లా అధికార యంత్రాంగం దీనిపై దష్టి సారిస్తుందా అనేది వేచి చూడాల్సి ఉంది.


