విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలను చాటేలా మిత్ర దేశాల సహకారంతో తూర్పు నావికా దళం అధ్వర్యాన విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫఆర్) మిలన్-2026 వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ విన్యాసాలకు 71 దేశాల నుంచి 4 వేల మందికి పైగా నావికా దళ అధికారులు , విదేశీ ప్రతినిధులు తరలివచ్చారు. పదేళ్లకోసారి విశాఖ కేంద్రంగా ఈ ఐఎఫఆర్ వేడుకలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు తూర్పు నావికాదళ కేంద్రానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఐఎనఎస్ సుమేధ యుద్ధనౌక పై సుమారు మూడు గంటలు ప్రయాణిస్తూ సముద్రంలో లంగరు వేసిన 71 యుద్ధ నౌకలను వీక్షించారు. 52 భారతీయ నౌకలు, 19 విదేశీ యుద్ధనౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఆరు వరుసల్లో నిలిపిన నౌక దళ సిబ్బంది నుంచి ముర్ము గౌరవ వందనం స్వీకరించారు. ప్రతి నౌకలో సైనికులు తమ దేశ సాంప్రదాయంలో రాష్ట్రపతికి వందనం సమర్పించారు. హెలికాప్టర్లు ఆకాశంలో అద్భుత విన్యాసాలు చేసి రాష్ట్రపతికి సెల్యూట్ చేశాయి. సుమారు 400 మంది విదేశీ ప్రతినిధులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ఎయిర్ క్రాఫ్ట్ లు , హెలికాప్టర్లు , జలాంతర్గముల విశిష్టతను నేవీ అధికారులు రాష్ట్రపతికి వివరించారు. మిగ్ 29కే యుద్ధ విమానాల మోత సముద్రగర్భంలో అలజడి పుట్టించింది. సముద్ర గర్భంలో మార్కోస్ కమాండోలు శత్రువులను ఎలా ఎదుర్కొంటారో ప్రత్యక్షంగా ప్రదర్శించారు. సముద్ర గర్భంలో జలాంతర్గముల విన్యాసాలు రాష్ట్రపతిని ఆకట్టుకున్నాయి. భారతదేశ పరిజ్ఞానంతో ప్రపంచానికి చాటి చెప్పేలా ఐఎనఎస్ విక్రాంత్, ఐఎనఎస్ విక్రమాదిత్య విమాన వాహన నౌకలు ఒకేసారి కవాతు నిర్వహించడం భారత రక్షణ రంగ చరిత్రలోనే ఒక అద్భుత ఘట్టంగా చెప్పవచ్చు.
ఈ ఐఎఫఆర్ వేడుకలకు వివిధ దేశాలకు చెందిన 19 విదేశీ యుద్ధనౌకలు, ఇండియన్ నేవీకి చెందిన 45 వార్‌షిప్‌లు, మరో ఏడు కోస్ట్‌గార్డ్, మర్చంట్ నేవీ, పరిశోధక నౌకలు వెరసి 71 వరకు పాల్గొన్నాయి. సిందూర్ ఆపరేషన్‌లో కీలకంగా వ్యవహరించిన విమాన వాహక యుద్ధనౌక ఐఎనఎస్ విక్రాంత్ ఈ ఐఎఫఆర్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో పాటు భారత యుద్ధనౌకలు ఐఎనఎస్ చెన్నై, విశాఖపట్నం, ముంబై, మైసూర్, ఐఎనఎస్ రాణా, రణవీర్, తరఖాన, తమల్, నీలగిరి, హిమగిరి, ఉదయగిరి తదితర నౌకలు ఐఎఫఆర్ లో పాల్గొన్నాయి. ఇంకా జలాంతర్గాములు ఐఎనఎస్ సింధుకీర్తి, సింధుకేసరి. సిందూఘోష్, కోస్ట్‌గార్డ్ షిప్స్, అత్యాధునిక పీ8ఐ నిఘా విమానం, మిగ్ 29`కే జెట్ ఫైటర్లు, డార్నియర్ ఎయిర్ క్రాఫ్ట్, సీకింగ్, చేతక్ హెలికాప్టర్లు నీలి సంద్రంలో శక్తి సామర్థ్యాలను అద్భుతంగా ప్రదర్శించాయి. ఐఎనఎస్ విక్రాంత్‌పై మిగ్ విమానాల ల్యాండింగ్, టేకాఫ్‌లు, యుద్ధ విమానాల విన్యాసాలు అలరించాయి. 50 కి పైగా ఎయిర్ క్రాఫ్ట్‌లు గగనతనంలో విన్యాసాలు ప్రదర్శించాయి. అమెరికా, రష్యా, ఆస్ట్రేలియా, యూకే, జపాన్, వియత్నం, శ్రీలంక, ఫిలిప్పీన్స్ వంటి దేశాల యుద్ధనౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి.
ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తో పాటు నౌకా దళ ప్రధాన అధికారి దినేష్ కె.త్రిపాఠి, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ , సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దంపతులు, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, అనేకమంది రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, విశాఖ నగర పోలీస్ కమిషనర్ , రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శులు, నావికాదళ అధికారులు, జిల్లా అధికారులు ఈ వేడుకలను తిలకించారు.
The post సమరోత్సాహంతోనావికాదళ విన్యాసాలు appeared first on Visalaandhra.


