మరో రూ.29,021 కోట్లకు ఆమోదం
27 ప్రాజెక్టులు`22,407 ఉద్యోగాలు
ఇప్పటివరకు రూ.9,03,726 కోట్ల పెట్టుబడులు రాక
15వ ఎసఐపీబీ సమావేశంలో చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. వివిధ రంగాల పరిశ్రమలకు సంబంధించి మరో రూ.29,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు 15వ ఎసఐపీపీ సమావేశం ఆమోదం తెలియచేసింది. వీటి ద్వారా 22,407 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానమే పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ ప్రాతిపదిక కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఆమోదించిన ప్రాజెక్టులు త్వరితగతిన కార్యరూపం దాల్చాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఇప్పటివరకు ఒప్పందాలు కుదుర్చుకున్న సంస్థల యాజమాన్యాలతో అధికారులు నిరంతరం సంప్రదింపులు జరిపి… ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తి చేసేలా చూడాలన్నారు. క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన 15వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, టీజీ భరత్, పి.నారాయణ, కె.అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్ధన్ రెడ్డి, దుర్గేష్, వాసంశెట్టి సుభాష్, సీఎస్ కె.విజయానంద్, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఐటీ, విద్యుత్, పర్యాటకం, ఫుడ్ ప్రాసెసింగ్, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల రంగాలకు చెందిన 27 ప్రాజెక్టుల ప్రతిపాదనలకు ఎసఐపీబీ ఆమోదం తెలిపింది. ప్రతిష్టాత్మక సంస్థలైన గూగుల్, ఆర్సెలార్ మిత్తల్, బీపీసీఎల్ వంటి మెగా ప్రాజెక్టులు వరుసగా ఏర్పాటు కావాల్సి ఉందని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని సీఎం స్పష్టం చేశారు. భూ కేటాయింపులు జరిపినప్పటికీ నిర్ణీత కాల వ్యవధిలో పనులు ప్రారంభించని సంస్థలతో సంప్రదింపులు జరపాలని, నిర్మాణానికి ముందుకు రాకుంటే భూములు వెనక్కి తీసుకునేందుకు వెనకాడవద్దని చెప్పారు. దీనిపై మంత్రుల కమిటీ దృష్టి పెట్టి…అవసరమైతే అనుమతులు రద్దు చేయాలన్నారు. ప్రతి ఒప్పందమూ వేగంగా సాకారం కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని వివరించారు. రాష్ట్రంలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టేలా ఎన్నారైలను ఆహ్వానించాలని అధికారులను సీఎం నిర్దేశించారు. రాష్ట్రంలో సెమీ కండక్టర్ ప్రాజెక్టులు మరిన్ని వచ్చేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సొంత భూముల్లో ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకునేవారికి అదనపు ప్రోత్సాహకాలు అందించే విషయాన్ని పరిశీలించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
విశాఖలో ‘భారత్ మండపం’
విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్లుగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చెప్పారు. ‘సూర్యలంక, పోలవరం, పులికాట్, గండికోట, శ్రీశైలం, మదనపల్లి, హర్స్‌లీ హిల్స్ వంటి క్లస్టర్లు ఏర్పాటు చేసి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించండి. ఆయా క్లస్టర్లలో షాపింగ్ మాల్స్, హోటల్స్ వంటివి వస్తే పర్యాటకుల్ని మరింతగా ఆకట్టుకోవడానికి అవకాశముంది. విశాఖలో భారత్ మండపం వస్తోంది. అది ఐకానిక్‌గా నిలిచేలా చూడాలి. దేశంలోనే అత్యుత్తమ కన్వెన్షన్ సెంటర్‌గా అది నిలవాలి. ప్రతి జిల్లాలో శిల్పారామాలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. కాకినాడ, ఏలూరు లాంటి ప్రాంతాలు సహా రాష్ట్రంలో అన్ని ముఖ్య పట్టణాల్లో మరిన్ని హోటళ్లు, కన్పెన్షన్ సెంటర్లు రావాలి. కనీసం 50 వేల రూములు లక్ష్యం కావాలి’ అని సీఎం మార్గనిర్దేశనం చేశారు. రాష్ట్రంలో జాతీయస్థాయి మెగా ఈవెంట్లు జరగాల్సి ఉందన్నారు. స్పోర్ట్స్ సిటీ, క్రియేటివ్ సిటీ ఎకో సిస్టం లాంటివి రాష్ట్రంలో నెలకొనాలన్నారు. హెల్త్ టూరిజం కూడా గణనీయంగా పెరిగేలా చూడాలన్నారు. తిరుపతిలో కలినరీ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుపై ఏపీలోని ఆహార రంగాన్ని ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని, హాస్పిటాలిటీలో డీమ్డ్ యూనివర్సిటీ వంటి వాటిని ప్రమోట్ చేయాలని సీఎం చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్‌లోనూ విప్లవాత్మక మార్పులు అందిపుచ్చుకోవాలన్నారు. ఆక్వా కల్చర్‌లో వాల్యూ అడిషన్ జరిగినప్ప్పుడే… అమెరికాకు ఎగుమతులు మళ్లీ పెరిగే అవకాశం ఉంటుందన్నారు. దీంతో డెయిరీ, పౌల్ట్రీ, లైవ్ స్టాక్, మీట్ ఎగుమతులూ పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. తిరుపతిని మ్యారేజ్ డెస్టినేషన్‌గా తీర్చిదిద్దాలని సీఎం సూచించారు.
ఉద్యోగాల వివరాలతో నైపుణ్యం పోర్టల్
ఇకపై ప్రతి నెలా ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష చేస్తానని అధికారులతో ముఖ్యమంత్రి అన్నారు. ఎసఐపీబీ ఆమోదం తెలిపిన ప్రాజెక్టులతో పాటు సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఒప్పందం జరిగిన ప్రాజెక్టుల నిర్మాణంపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. కార్యకలాపాలు ప్రారంభించే తేదీని స్పష్టంగా పేర్కొనాలన్నారు. ఇప్పటివరకు యువతకు లభించిన ఉద్యోగాల వివరాలు నైపుణ్యం పోర్టల్‌తో అనుసంధానించాలని సూచించారు. ఇంకా ఎన్ని ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయో తెలిసేలా రియల్ టైమ్‌లో అప్డేట్ చేయాలన్నారు. త్వరలో వేర్ హౌసింగ్ పాలసీ తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. విశాఖ, విజయవాడ తిరుపతి నగరాల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు పెద్దఎత్తున ఏర్పాటు చేసేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. ఇప్పటివరకు 15సార్లు ఎసఐపీబీ సమావేశాలు జరగ్గా… మొత్తం రూ.9,03,726 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. తద్వారా 8,58,082 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.


