గురిపెట్టి కొట్టాలి – Visalaandhra


. సమస్యలు ప్రాతిపదికగా ఉద్యమాలు
. రాష్ట్రంలో సర్కారీ గూండాయిజం
. పోరాటాలకు ఆకాశమే హద్దు
. సీపీఐ జాతీయ నాయకులు నారాయణ

విశాలాంధ్ర బ్యూరో`కాకినాడ: కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్‌డీఏ పాలన పట్ల ప్రజల్లో అసంతప్తి పెరిగిందని, కొత్తగూడెంలో సీపీఐ సాధించిన విజయం స్ఫూర్తితో ఏపీలో కూడా గురిపెట్టికొట్టాలని సీపీఐ జాతీయ నాయకులు కె.నారాయణ ఉద్బోధించారు. అది సాధించాలంటే సమస్యల ప్రాతిపదికగా ఉద్యమాలు నిర్వహించాలని, ఆకాశమే హద్దుగా పోరాడాలని పిలుపునిచ్చారు. సీపీఐ కార్యదర్శివర్గ సభ్యులు తాటిపాక మధు అధ్యక్షతన కాకినాడలో జరిగిన సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి సమావేశాల్లో భాగంగా బుధవారం ముగింపులో నారాయణ ప్రసంగించారు. ఉద్యమాలకు ఇది సరైన సమయమని నారాయణ అన్నారు. అంతర్జాతీయంగా, జాతీయంగా ట్రంప్, మోదీ పెత్తందారీ విధానాల వల్ల విసుగెత్తిన ప్రజలను సమీకరించడానికి వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులు ఏకమవుతున్నాయని గుర్తుచేశారు. చమురుతో ట్రంప్ బ్లాక్‌మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారని, భారత్‌పై అతని ఒత్తిడి కారణంగానే అమెరికాతో వాణిజ్య ఒప్పందం అనివార్యమైందని అన్నారు. ట్రంప్‌కు మోదీ చిత్తశుద్ధి గల బానిస అని నారాయణ వ్యాఖ్యానించారు. అమెరికాకు మోదీ లొంగుబాటు కారణంగా భారత ప్రతిష్ట పూర్తిగా దిగజారిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మన దేశం అంతర్జాతీయ స్థాయిలో గట్టిగా నిలబడలేకపోతున్నదని, ఇదంతా బీజేపీ ప్రభుత్వ వైఫల్య ఫలితమేనని అన్నారు. దేశ స్వాతంత్య్ర చరిత్రనే మార్చివేయడానికి ఆరఎసఎస్, బీజేపీ చేస్తున్న ప్రయత్నంలో భాగమే ఉపాధి హామీలో గాంధీ పేరును తొలగించడమని అన్నారు. గత పదేళ్లలో మోదీ సర్కారు 90 శాతమున్న ఉపాధి కార్మికులకు రూ.10 లక్షల కోట్లు ఖర్చుచేయగా… 10 శాతమున్న కార్పొరేట్లకు రూ.20 లక్షల కోట్లు రాయితీలిచ్చిందని విమర్శించారు. సీపీఐ పోరాట పార్టీ అని ప్రజలు విశ్వసిస్తున్నారని, ఈ నేపథ్యంలో మెడికల్ మాఫియా ఎక్కడెక్కడ తిష్టవేసిందో గుర్తించి… ప్రత్యక్ష దాడులు చేయాలని సూచించారు. రాష్ట్రంలో పాలక, ప్రతిపక్షాలు రెండూ మోదీ తొత్తులుగా మారాయని, అంతా ఒకవైపు, కేవలం వామపక్షాలే రెండోవైపు నిలిచాయని, ఏ సమస్యపైనైనా ఉద్యమించే హక్కు మనకుందని అన్నారు. రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా సర్కారీ గూండాయిజం పెరిగిపోయిందని ఆరోపించారు. కార్యాచరణతో కూడిన పోరాటానికి పార్టీ శ్రేణులు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *