పెట్రోల్ ధరల పెంపుపై రేవంత్ ఆగ్రహం.. మోదీ ప్రభుత్వంపై విమర్శల వెల్లువ


సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆయన పేర్కొన్నారు. ఇంధన ధరల పెంపు అనేక రంగాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డి సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో విస్తృత పోస్టు చేశారు. మోదీ ప్రభుత్వ అసమర్థ పాలన, అనాలోచిత విధానాల కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని విమర్శించారు.

చిన్న, మధ్యతరహా పరిశ్రమలు తీవ్రంగా నష్టపోతాయి
ఆత్మనిర్భర్ అనే నినాదం కేవలం ఓట్లు సాధించడానికి ఉపయోగించిన రాజకీయ నినాదమే తప్ప, ఆశించిన ఫలితాలు ఇచ్చిన విధానం కాదని వ్యాఖ్యానించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయని, యువతకు ఉపాధి భద్రత లేకుండా పోయిందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు.
రైతుల ఆదాయాలను రెట్టింపు చేస్తామని ఇచ్చిన హామీ అమలు కాలేదని, అది కేవలం మాటలకే పరిమితమైందన్నారు. గత పదేళ్లుగా రూపాయి విలువ క్రమంగా పడిపోతూ వచ్చిందని, ప్రస్తుతం ఆ పరిస్థితి మరింత తీవ్రమైందని పేర్కొన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇరాన్ – ఇజ్రాయిల్ యుద్ధాన్ని సాకుగా చూపించి పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం సామాన్యుల నడ్డి విరిచే చర్యగా అభివర్ణించారు.

ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశారు
ప్రపంచంలో భారత్‌ను మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలిపామని గొప్పలు చెప్పుకుంటున్న మోదీ ప్రభుత్వం.. ఇప్పుడు ధరల పెంపును ఎలా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు.ఇటీవల నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఎన్నికల ముందు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచమని కేంద్ర ప్రభుత్వం పదేపదే ప్రకటించిందని గుర్తుచేశారు. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన పది రోజులు కూడా గడవకముందే లీటరుకు రూ.3కుపైగా ధరలు పెంచడం ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేయడమేనని మండిపడ్డారు. కేవలం ఓట్ల కోసం,ఎన్నికల విజయాల కోసం మోదీ అబద్ధాలు చెబుతున్నారని ప్రజలు భావిస్తున్నారని, ఇది విశ్వాస ఘాతుకానికి నిదర్శనమని విమర్శించారు.
చివరగా కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *