పొదుపు చేద్దాం – Visalaandhra


. ప్రజల్లో అవగాహన పెంచుదాం
. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’
. ఏసీలు 26 డిగ్రీలకే పరిమితం
. మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు
. నిర్లక్ష్యం తగదంటూ అధికారులపై సీఎం ఆగ్రహం

విశాలాంధ్ర – సచివాలయం: రాష్ట్రం ఆర్థికంగా ఎదగాలంటే పరిపాలనలో క్రమశిక్షణ, ప్రజా ప్రతినిధుల్లో పొదుపు మంత్రం నిరంతరం ప్రతిబింబించాలని… దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పాలకులు సామాన్యుడిలా ఆలోచించినప్పుడే నిజమైన మార్పు సాధ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గురువారం జరిగిన కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో ప్రస్తుత పరిస్థితులపై సీఎం చర్చించారు. అంతర్జాతీయ చమురు సంక్షోభం భారత ఆర్థిక వ్యవస్థపై చూపుతున్న ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును స్ఫూర్తిగా తీసుకున్న సీఎం… ‘నా దేశం – నా బాధ్యత’ అనే నినాదాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇది కేవలం మాటలకే పరిమితం కాకూడదని, ఆచరణలో ప్రభుత్వమే ఆదర్శంగా నిలవాలని ఆయన స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే మంత్రులు, ఎమ్మెల్యేలు విలాసాలకు స్వస్తి పలికి… సామాన్యుల తరహాలో ప్రజా రవాణాను వాడాలని, ప్రజల్లో చైతన్యం నింపాలని సూచించారు. ప్రభుత్వ శాఖల్లో ప్రతి పైసాను ఆదా చేయడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు కఠిన నిబంధనలను ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీలను కచ్చితంగా 24 నుండి 26 డిగ్రీల మధ్యనే నడపాలని…దీనివల్ల విద్యుత్ వినియోగం గణనీయంగా తగ్గి, ఖజానాపై భారం తగ్గుతుందని వివరించారు. వారానికి ఒకరోజు ‘నో వెహికల్ డే’ పాటించడం ద్వారా ఇంధన పొదుపు చేయాలని, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ఒక ఉద్యమంలా ప్రోత్సహించాలని మంత్రివర్గం తీర్మానించింది. మంత్రుల విదేశీ పర్యటనలపై తాత్కాలిక నిషేధం విధిస్తూ…పరిపాలనలో డిజిటల్ విప్లవాన్ని తీసుకురావాలని సీఎం ఆదేశించారు. అత్యధిక సమావేశాలను వర్చువల్ పద్ధతిలోనే నిర్వహించాలని, సాధ్యమైన చోట ఉద్యోగులకు ‘వర్క్ ఫ్రమ్ హోమ’ కల్పించేలా విధివిధానాలు రూపొందించాలని అధికారులను కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడుకునే క్రమంలో ప్రజలు సైతం భాగస్వాములు కావాలని, అనవసర విలాసాలు తగ్గించుకోవడంతో పాటు బంగారం కొనుగోళ్లపై నియంత్రణ పాటించాలని ఆయన చేసిన విజ్ఞప్తి ఆసక్తి రేకెత్తించింది. అయితే, అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ భేటీకి అధికారుల గైర్హాజరీపై ముఖ్యమంత్రి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇంధన పొదుపుపై చర్చించేందుకు గత రాత్రే అజెండా ఖరారు చేసినప్పటికీ సంబంధిత కార్యదర్శులు సకాలంలో హాజరుకాకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. “పరిపాలనలో క్రమశిక్షణ లేకపోతే వ్యవస్థ కుప్పకూలుతుంది.. ప్రభుత్వ ప్రాధాన్యతలను విస్మరిస్తే సహించేది లేదు” అని హెచ్చరించిన సీఎం… నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారుల నుంచి వివరణ తీసుకుని సీరియస్ యాక్షన్ తీసుకోవాలని సీఎస్ విజయానంద్‌ను ఆదేశించారు. సమావేశం మధ్యలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ జోక్యం చేసుకుంటూ, ఈ పొదుపు చర్యలు ప్రజలపై భారంలా అనిపించకుండా ఉండాలంటే, ముందుగా వారిని చైతన్యపరచాలని సూచించారు. పవన్ సూచనను గౌరవించిన సీఎం… రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, దీని పర్యవేక్షణకు ప్రత్యేక ‘కేబినెట్ సబ్ కమిటీ’ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *