పోలవరం పూర్తికినిధులివ్వండి


. విభజనాంశాలు, పెండింగ్ ప్రాజెక్టులు అమలు చేయండి
. కేంద్రానికి చంద్రబాబు విజ్ఞప్తి
. కేంద్ర మంత్రులు అమిత్ షా, పాటిల్‌తో సీఎం భేటీ
. ఆల్మట్టి ఎత్తు పెంచితే ఏపీ ప్రయోజనాలకు విఘాతమని వెల్లడి

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వివిధ కేంద్ర ప్రాయోజిత పథకాలతో పాటు గతంలో హామీ ఇచ్చిన మేరకు నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో వేర్వేరుగా సీఎం భేటీ అయ్యారు. విభజన అంశాలతో పాటు వివిధ పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించిన నిధుల్ని మంజూరు చేయాలని ఆయన కేంద్ర హోం మంత్రికి విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత కేంద్ర బడ్జెట్ లో చేసిన కేటాయింపులతో పాటు రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన సహకారం అందించాలని ఆయన కోరారు. అనంతరం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ తో సమావేశమైన ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టులో కీలకమైన అంశాలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. 2027 గోదావరి పుష్కరాల లోపు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును పూర్తి చేసేందుకు అవసరమైన నిధులు మంజూరు చేసి సహకరించాలని కోరారు. తొలిదశలో 41.15 మీటర్ల మేర నీటిని నిల్వ చేసేందుకు అవసరమైన నిర్మాణాలను పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే తాను స్వయంగా 5 మార్లు ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని సమీక్షించినట్టు వెల్లడించారు. 2026 ఏప్రిల్ 2 నాటికి కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణం పూర్తి అయ్యిందని, గ్యాప్ 1, గ్యాప్ 2 లలో కీలకమైన ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ప్రజాభిప్రాయ సేకరణ పెండింగ్‌లో ఉందన్న కారణంతో 2011లో ఇచ్చిన స్టాప్ వర్క్ ఆర్డర్ ఉత్తర్వులను శాశ్వతంగా ఉపసంహరించుకోవాలని కేంద్ర జల శక్తి మంత్రిని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. దీని వల్ల పోలవరం ప్రాజెక్టు పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా వేగంగా చేపట్టేందుకు వీలవుతుందని స్పష్టం చేశారు. సాగునీటి అవసరాల దృష్ట్యా మొదట నిర్ణయించిన దాని కంటే కుడి, ఎడమ కాలువల సామర్ధ్యాన్ని 17,500 క్యూసెక్కులకు పెంచినట్టు సీఎం తెలియచేశారు. ప్రస్తుతం కుడి కాలువ 95 శాతం మేర ఎడమ కాలువ పనులు 78 శాతం మేర పూర్తి అయినట్టు తెలిపారు. కాలువల సామర్ధ్యం పెంచిన మేరకు నిధులను రీఎంబర్సు చేయాలని, ప్రాజెక్టు తదుపరి పనులకు సంబంధించి అవసరమైన నిధులను కూడా మంజూరు చేయాలని కోరారు.
హర్ ఖేత్ కో పానీ పథకం కింద నీటి పంపిణీకి నిధులు
ప్రధాన మంత్రి కృషి సీంచాయి యోజన కింద రాష్ట్రంలోని వివిధ పథకాల పునరుద్ధరణ, ఆధునీకరణకు నిధులు మంజూరు కోరుతూ మరో లేఖను కేంద్ర జలశక్తి మంత్రికి సీఎం అందించారు. హర్ ఖేత్ కో పానీ కార్యక్రమంలో భాగంగా చెరువులు, కుంటల మరమ్మతులు, పునరుద్ధరణ ,ఆధునీకరణ, కాలువల పూడిక తీత, గట్ల బలోపేతం లాంటి పనులు చేపట్టాల్సి ఉందని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 297 నీటి వనరుల పునరుద్ధరణ కోసం రూ.285 కోట్ల నిధుల్ని విడుదల చేయాలని కోరారు. సుప్రీం కోర్టు తుది తీర్పు వచ్చేంత వరకూ ఆలమట్టి ఎత్తు పెంచే అంశంపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయవద్దని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ కు విజ్ఞప్తి చేశారు. ఆనకట్ట ఎత్తును 519.60 మీటర్ల నుండి 524.256 మీటర్‌లకు పెంచితే ఏపీ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఎలాంటి సాంకేతిక, పాలనా పరమైన అనుమతులు మంజూరు చేయవద్దని స్పష్టం చేశారు. ఎగువ కృష్ణా ప్రాజెక్ట్ ఫేజ్-3 కింద భూసేకరణ ఇతర సన్నాహక పనులు చేయకుండా కర్ణాటకను ఆదేశించాలని, సుప్రీం కోర్టు తుది తీర్పు వచ్చేంత వరకూ యథాతథ స్థితిని కొనసాగించాలని వివరించారు. రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల దాహార్తిని తీర్చే పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు అనుమ తులు మంజూరు చేయాలని.. గోదావరి నుంచి సముద్రంలోకి వృథా పోయే 200 టీఎంసీల వరద జలాలను మళ్లించేలా పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపడుతున్నట్టు వెల్లడించారు. వంశ ధారపై నేరడి బ్యారేజ్ నిర్మాణానికి జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం ముందుకు వెళ్తామని పేర్కొన్న చంద్రబాబు, ఏపీ నీటి అవసరాలకు అనుగుణంగా 8 వేల క్యూసెక్కుల సామర్ధ్యంతో కుడి వైపున హెడ్ స్లూయిస్ నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు. దీనికి అవసరమైన భూసేకరణ కోసం ఒడిశాను ఆదేశించాల్సిందిగా కేంద్ర జలశక్తి శాఖకు సీఎం విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి వెంట ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు.

The post పోలవరం పూర్తికినిధులివ్వండి appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *