అన్నాడీఎంకేలో ఆదిపత్య పోరు – Visalaandhra


పళనిసామిషణ్ముగం వేరు వేరు క్యాంప్ రాజకీయాలు

చెన్నై: తమిళనాడు ఎన్నికల ఫలితాల అనంతరం ఏఐడీఎంకేలో వర్గ పోరు మొదలైంది. పళనిస్వామిషణ్ముగం మధ్య ఆదిపత్య పోరు బయటపడింది. ఎన్డీయేకు నేతృత్వం వహిస్తున్న ఏఐఏడీఎంకేలో నాయకత్వ సమస్యలు బయట పడుతున్నాయి. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామికి వ్యతిరేకంగా మరో వర్గం తయారైంది. రెండు రోజుల క్రితం పుదుచ్చేరిలోని ఓ రిసార్ట్‌లో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు 36 మంది శిబిరం నిర్వహించగా, పళనిసామి అక్కడికి వెళ్లి వారితో భేటీ అయిన సంగతి తెలిసిందే. అదే క్యాంపు నుంచి ఆగమేఘాలపై దిల్లీ వెళ్లి, తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా లేఖ ఇచ్చిన సీవీ షణ్ముగమే… ఈ క్యాంపునకు సూత్రధారి అని ఆలస్యంగా తెలిసింది. ఈ 36 మంది శుక్రవారమే చెన్నైకి చేరుకున్నప్పటికీ, రెండ్రోజులుగా విడిగా ఉంటున్నారు. వీరిని ఈపీఎస్ తన ఇంటికి పిలిపించి పలుమార్లు సమావేశమయ్యారు. తర్వాత వీరు చెన్నై ఎమ్మార్సీనగర్‌లోని షణ్ముగం ఇంట్లో మకాం వేశారు.
నాయకత్వం కోసమా…అధికారం కోసం ఆరాటమా!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైనప్పటి నుంచే షణ్ముగం వర్గం టీవీకే నేతలతో టచ్‌లోకి వెళ్లింది. అయితే, అన్నాడీఎంకే…ఎన్డీయేలో భాగమైనందున వారితో కలిసేందుకు టీవీకే అభ్యంతరం చెప్పింది. అందుకే వీరు అన్నాడీఎంకే నుంచి బయటికొచ్చేందుకు సిద్ధపడి, పుదుచ్చేరిలో క్యాంపు పెట్టినట్లు తెలుస్తోంది. ఉపముఖ్యమంత్రి, కొన్ని మంత్రి పదవులపై డిమాండ్ చేసినట్లు సమాచారం. శనివారం సాయాంత్రానికల్లా విజయ్ సరిపడా సంఖ్యాబలాన్ని సాధించడంతో షణ్ముగం వర్గం ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పటికీ విడిగానే ఉన్న ఈ వర్గంలో మాజీ మంత్రులు ఎస్పీ వేలుమణి, సి.విజయభాస్కర్, ఎంఆర్ విజయభాస్కర్, మహిళా ఎమ్మెల్యే లీమా రోస్ తదితరులున్నారు. వీరు పార్టీకి కొత్త నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు తమ డిమాండ్లను ఈపీఎస్ ముందు ఉంచగా, ఆయన ఎలా స్పందించారన్నది బయటకు రాలేదు. మరో పక్క దళపతికి కూడా వీరిని చేర్చు కోవడానికి ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. డీఎంకే, ఏఐడీఎంకే కూటములకు వ్యతిరేకంగానే తాను పోటీ చేస్తున్నానని విజయ్ చెప్ప్పుకొచ్చారు. అందునా తక్కువ సభ్యులున్న కాంగ్రెస్, వీసీకే, ఐయÖఎంఎల్ పార్టీల బలంతో విజయ్ మ్యాజిక్ ఫిగర్‌కు చేరుకున్నారు. దీనితో ఏఐడీఎంకేను తీసుకోరనే వార్తలు వస్తున్నాయి. భవిష్యత్‌లో ఏమి జరుగుతుందో వేచి చూడాలి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *