త్వరలో విశాఖ, విజయవాడ మెట్రోలకు గ్రీన్ సిగ్నల్ : మంత్రి నారాయణ


విశాఖపట్టణం, విజయవాడ నగరాల్లో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన మెట్రో రైలు ప్రాజెక్టులపై మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రెండు మెట్రో ప్రాజెక్టులకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు లభిస్తాయనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇప్పటికే రివైజ్డ్ డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించామని, ప్రస్తుతం కేంద్రం నుంచి సానుకూల నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. విశాఖ పర్యటనలో భాగంగా మంత్రి నారాయణ నగరంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం కైలాసగిరి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. కైలాసగిరి అభివృద్ధికి సంబంధించి సమగ్ర మాస్టర్ ప్లాన్ రూపొందించాలని వీఎంఆర్‌డీఏ అధికారులను ఆదేశించారు. పర్యాటకులను మరింత ఆకర్షించేలా కొత్త ప్రాజెక్టులు చేపట్టాలని సూచించారు.

ప్రత్యేక లైటింగ్ ఎఫెక్టు
ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌తో కలిసి కైలాసగిరిలో ఏర్పాటు చేసిన భారీ త్రిశూల్ ప్రాజెక్టును మంత్రి నారాయణ ప్రారంభించారు.
65 అడుగుల ఎత్తుతో, 18 అడుగుల ఢమరుకంతో నిర్మించిన ఈ త్రిశూలం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
ముఖ్యంగా రాత్రి వేళల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక లైటింగ్‌తో ఈ నిర్మాణం మరింత అందంగా కనిపిస్తోంది.
ఇప్పటికే కైలాసగిరిలో ఏర్పాటు చేసిన గ్లాస్ బ్రిడ్జ్, జిప్ లైన్, అడ్వెంచర్ స్పోర్ట్స్ పర్యాటకులను ఆకట్టుకుంటుండగా, సముద్రం వైపు నిర్మించిన దేశంలోనే పొడవైన క్యాంటీలీవర్ కూడా సందర్శకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తోంది.

సీఎం సూచనలతో త్రిశూలం ప్రాజెక్టు
పర్యాటకులకు కొత్త అనుభూతులు అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకు ఈ త్రిశూలం ప్రాజెక్టును అభివృద్ధి చేసినట్లు అధికారులు తెలిపారు.
పరమశివుడి ఆయుధమైన త్రిశూలాన్ని ఢమరుకంతో కలిపి నిర్మించడం ద్వారా దీనికి ఆధ్యాత్మికతను కూడా జోడించినట్లు పేర్కొన్నారు. సుమారు రూ.2.5 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ప్రాజెక్టును సముద్ర మట్టానికి 365 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు. గతేడాది ఆగస్టు 18న ప్రారంభమైన ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ భారీ త్రిశూలం విశాఖలో మరో ప్రధాన పర్యాటక ఆకర్షణగా మారుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *