టీమిండియా చేతిలో ఓటమిపై పాక్ మాజీల ఆగ్రహం


ఇస్లామాబాద్: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పరాజయం పాలైన పాకిస్థాన్ జట్టు, జట్టు మేనేజ్‌మెంట్‌పై ఆ దేశానికి మాజీ క్రికెటర్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివారం కొలంబోలో జరిగిన టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 61 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీనిపై షాహిద్ ఆఫ్రిది మాట్లాడుతూ… నాకే అధికారం ఉంటే బాబర్, షాబాద్, షాహీన్‌ను జట్టులోకి తీసుకోనని స్పష్టం చేశాడు. వారికి ఇప్పటికే చాలా అవకాశాలు వచ్చినప్పటికీ వరుసగా విఫలమవుతున్నారన్నాడు. పాక్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ స్పందిస్తూ… ‘పెద్ద మ్యాచుల్లోనే క్రికెటర్లు సత్తా చూపాల్సి ఉంటుంది. కానీ దురదృష్టవశాత్తు మా క్రికెటర్లు విఫలమయ్యారు. ఆరుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం సరైన నిర్ణయం కాదు’ అన్నాడు. మరో మాజీ కెప్టెన్ మహ్మద్ యూసుఫ్ స్పందిస్తూ… ‘షాహీన్, బాబర్, షాబాద్‌ను జట్టునుంచి తప్పించే సమయం ఆసన్నమైంది. టీ20 జట్టును కొత్త ఆటగాళ్లతో నింపాలి. బలహీనమైన జట్లమీద విజయాలు సాధిస్తే సరిపోదు’ అన్నాడు. పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అఖ్తర్ ఏబీపీ న్యూస్‌తో మాట్లాడుతూ పాకిస్థాన్ ఓటమిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. “మేము మ్యాచ్‌లో ఎక్కడా పోటీలోనే లేము. ఒకప్పుడు భారత్‌తో మైదానంలో పోరాడేవాళ్లం. కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తే వాళ్లను ఓడించడం అన్నది కలలో కూడా ఊహించలేం” అని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ మోసిన్ నఖ్వీపై విరుచుకుపడ్డాడు. “క్రికెట్ గురించి ఏమీ తెలియని వ్యక్తి పీసీబీ చైర్మన్ అయ్యాడు. అలాంటి అసమర్థులకు ‘జాహిల’ (అజ్ఞాని)లకు బాధ్యతలు అప్పగిస్తే జట్టు ఎలా నడుస్తుంది?” అని తీవ్రంగా విమర్శించాడు. బాబర్ ఆజమ్‌ను ఉద్దేశించి, “మ్యాచ్ గెలిపించలేని ఆటగాడిని సూపర్ స్టార్‌ను చేశారు” అని మండిపడ్డాడు. మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా తమ జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. పాకిస్థాన్ ఆటగాళ్లు మైదానం వెలుపల ప్రకటనల కంటే ఆటపై దృష్టి సారించాలని హితవు పలికాడు.
లక్ష్యాలను ఛేదించడంలో పాక్ జట్టు ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఈ మ్యాచ్ ద్వారా వెల్లడైందని అన్నాడు. పాకిస్థాన్ ఆడిన తీరు తీవ్ర నిరాశపరిచిందని అన్నాడు. పాకిస్థాన్‌ను ఒంటిచేత్తో గెలిపిస్తాననే విధంగా ఉస్మాన్ తారిఖ్ మాట్లాడాడని, తమ బౌలర్లను చూసి భారత్ భయపడుతోందని అన్నాడని గుర్తు చేశాడు. కానీ భారత ఆటగాళ్లు మాటల కంటే మైదానంలో ఆట ద్వారా తామేంటో నిరూపిస్తారని ప్రశంసించాడు. భారత్ తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని ఛేదించడం అంత సులభం కాదని పాకిస్థాన్‌కు తెలుసని అన్నాడు. భారత్ చాలాకాలంగా శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడలేదని, కానీ పాకిస్థాన్ చాలా సార్లు ఆడిందని గుర్తు చేశాడు. కోచ్‌లు వ్యూహాలను సిద్ధం చేసుకోనట్లుగా ఉందని విమర్శించాడు. ఇది పూర్తిగా గేమ్ ప్లాన్ లేకపోవడం వల్ల వచ్చిన ఓటమిగా డానిష్ కనేరియా అభిప్రాయపడ్డాడు. టీమిండి యాలో ధోని, విరాట్ కోహ్లీ మాదిరిగా క్లిష్ట సమయంలో పాకిస్థాన్ జట్టును సీనియర్ ఆటగాడు బాబర్ అజామ్ నడిపించాల్సిందని అన్నాడు. ఉస్మాన్ ఖాన్ 34 బంతుల్లో 44 పరుగులు చేయడం ద్వారా పాక్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశాడని, కానీ అక్షర్ పటేల్ బౌలింగ్‌లో స్టంపౌట్ కావడంతో పాకిస్థాన్ చేతి నుంచి మ్యాచ్ చేజారిందని అన్నాడు. మిగిలిన ఆటగాళ్లు వైఫల్యం చెందారని డానిష్ కనేరియా అన్నాడు. భారత్‌ను ఓడిస్తామంటూ ప్రకటనలు చేసి, ఇలా ఓడిపోతే అభిమా నులు మరింత నిరాశకు గురవుతారని అన్నాడు. కాబట్టి అనవసర ప్రకటనలు చేయవద్దని సూచించాడు. ఇటీవల షహీన్ అఫ్రిది రాణించడం లేదని… టీమిండియా మంచి బ్యాటింగ్ లైనప్‌ను కలిగి ఉందని, పాకిస్థాన్‌కు ఆ సామర్థ్యం లేదని పేర్కొన్నాడు. మొత్తానికి ఈ మ్యాచ్ పాక్ ప్రజలను తీవ్రంగా నిరాశపరిచిందని తెలిపాడు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *