ఇది బీజేపీ అమలు చేస్తున్న పాత వ్యూహమే…ఎక్స్ ఖాతాలో రాహుల్ వ్యాఖ్యలు
రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు.లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడైన ఆయన, పశ్చిమ బెంగాల్, అసోం రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల్లో నిజంగా గెలవలేదని, ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను తారుమారు చేసుకుని విజయం సాధించిందని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యాఖ్యలను సోమవారం తన అధికారిక ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఇక పశ్చిమ బెంగాల్‌లో 100కుపైగా సీట్ల ఫలితాలు మార్పిడి చేశారని మమతా బెనర్జీ చేసిన ఆరోపణలకు తాము పూర్తిగా మద్దతు ఇస్తున్నామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. బెంగాల్, అసోం రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు స్పష్టంగా తారుమారయ్యాయని ఆయన ఆరోపించారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరుస్తోంది
ఇది బీజేపీ అమలు చేస్తున్న పాత వ్యూహమేనని ఆయన విమర్శించారు. గతంలో మధ్యప్రదేశ్, హర్యానా, మహారాష్ట్ర రాష్ట్రాలతో పాటు 2024 లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఇదే తరహా విధానాన్ని గమనించామని పేర్కొన్నారు. ఎన్నికలను దొంగిలించడం, ప్రజాస్వామ్య వ్యవస్థలను బలహీనపరచడం తప్ప వారికి ఇంకేమీ మిగిలి ఉందా? అంటూ రాహుల్ గాంధీ తన పోస్టులో ప్రశ్నించారు. బీజేపీ కేవలం ఎన్నికల ఫలితాలపైనే కాకుండా, ప్రజాస్వామ్యాన్ని కాపాడే సంస్థల విశ్వసనీయతను కూడా దెబ్బతీస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
The post ఈసీ సహకారంతో బీజేపీ గెలుపు.. : రాహుల్ గాంధీ appeared first on Visalaandhra.


