హైదరాబాద్ లోని ఐటీ కారిడార్‌లో వాహనదారులకు రోజూ తలనొప్పిగా మారిన ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేందుకు జీహెచ్ఎంసీ కీలక అడుగులు వేస్తోంది.గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్‌ను సిగ్నల్ ఫ్రీ కారిడార్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో బహుళస్థాయి ఫ్లైఓవర్ల నిర్మాణ పనులను వేగంగా కొనసాగిస్తోంది.ఈ ప్రాజెక్టులో భాగంగా రెండు ఫ్లైఓవర్లు, ఒక అండర్‌పాస్‌ను నిర్మిస్తుండగా, ప్రస్తుతం పిల్లర్ల నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి.ట్రిపుల్ ఐటీ, ఖాజాగూడ, విప్రో జంక్షన్ల వద్ద రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం అందించేందుకు సుమారు రూ. 800 కోట్ల వ్యయంతో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టారు.
ఇందులో భాగంగా ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద ఐఎస్బీ నుంచి డీఎల్ఎఫ్ వరకు నాలుగు లేన్ల ఫ్లైఓవర్, ముంబై హైవే నుంచి డీఎల్ఎఫ్ దిశగా రెండు లేన్ల వన్‌వే ఫ్లైఓవర్, అలాగే ఇందిరా నగర్ నుంచి హెచ్‌సీయూ వరకు అండర్‌పాస్‌ను నిర్మించనున్నారు. ఐటీ కారిడార్‌లో ఉదయం,సాయంత్రం వేళల్లో ఏర్పడే తీవ్ర ట్రాఫిక్ జామ్‌ల కారణంగా ఉద్యోగులు గంటల కొద్దీ రోడ్లపైనే చిక్కుకుపోతున్నారు.
గత వర్షాకాలంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా మారింది. నిర్మాణ పనులు పూర్తయితే వాహనదారులు ఒక్క సిగ్నల్ దగ్గర కూడా ఆగాల్సిన అవసరం లేకుండా తమ గమ్యస్థానాలకు చేరుకోగలుగుతారని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.దీనివల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడమే కాకుండా ఇంధన పొదుపు కూడా సాధ్యమవుతుందని వారు వెల్లడించారు.
2028 మే నాటికి ఈ ప్రాజెక్టును పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇది పూర్తయితే కోకాపేట నియోపొలిస్‌కు రవాణా మరింత సులభతరం కానుండగా, పాత ముంబై హైవేపై ప్రయాణం కూడా సాఫీగా సాగనుంది. దీంతో ఐటీ కారిడార్‌లో ప్రయాణించే వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
The post జీహెచ్ఎంసీ : ఐటీ కారిడార్ ట్రాఫిక్‌కు చెక్: రూ.800 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్ appeared first on Visalaandhra.


