Last Updated:
చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో దివ్యాంగుల కోసం మెగా సేవా కార్యక్రమం, ఒబెరాయ్ హోటల్స్ గ్రూప్ సహకారంతో 1.5 కోట్లు ఖర్చు, 115 ఉపకరణాల పంపిణీ, ఉచిత శస్త్రచికిత్సలు
మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతున్న నేటి కాలంలో, ఎదుటివారి కష్టాన్ని చూసి చలించి, వారికి అండగా నిలబడటమే అసలైన సేవ అని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలోని దివ్యాంగుల జీవితాల్లో చీకట్లు తొలగించి, వారి భవిష్యత్తులో ఆశల వెలుగులు నింపడమే లక్ష్యంగా చిత్తూరు కలెక్టరేట్ వేదికగా ఒక అద్భుతమైన సేవా కార్యక్రమం గురువారం నాడు ఘనంగా జరిగింది. ఒబెరాయ్ హోటల్స్ గ్రూప్ వారి ఉదారమైన ఆర్థిక సహకారంతో, పలమనేరు హెల్పింగ్ హ్యాండ్స్ చారిటబుల్ సొసైటీ మరియు జాయినింగ్ ది డాట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరినీ కదిలించింది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు స్వయంగా ఉపకరణాలను అందజేస్తూ వారిలో భరోసా నింపారు.
ఈ సేవా యజ్ఞం కేవలం ఉపకరణాల పంపిణీకే పరిమితం కాలేదు. అంగవైకల్యంతో బాధపడుతున్న తొమ్మిది మంది బాధితులకు (ఎనిమిది మంది చిన్నారులు, ఒకరు పెద్దవారు) బెంగళూరులోని ప్రసిద్ధ శ్రీ సిద్ధార్థ వైద్య విజ్ఞాన సంస్థ (SSIMS) ఆసుపత్రిలో అత్యంత ఖరీదైన శస్త్రచికిత్సలను ఉచితంగా చేయించారు. శస్త్రచికిత్స అనంతరం గత ఆరు నెలలుగా వారికి నిరంతరం ఫిజియోథెరపీ సేవలను అందిస్తూ, వారు సొంతంగా నడిచేలా తీర్చిదిద్దడం విశేషం. ఈ మెగా ప్రాజెక్టు కోసం దాదాపు రూ. 1.5 కోట్ల భారీ మొత్తాన్ని వెచ్చించారు. కేవలం ఆర్థిక సాయమే కాకుండా, విధి నిర్వహణలో నిరంతరం బిజీగా ఉండే ప్రభుత్వ అధికారులు సైతం సేవా దృక్పథంతో ముందుకు వచ్చి, బాధితుల వెన్నంటి నిలబడటాన్ని కలెక్టర్ గారు ప్రత్యేకంగా అభినందించారు.
కార్యక్రమంలో భాగంగా మొత్తం 115 ఉపకరణాలను పంపిణీ చేయాల్సి ఉండగా, ఇప్పటికే 84 మంది లబ్ధిదారులు ఈ సహాయాన్ని అందుకున్నారు. ముఖ్యంగా ‘ముస్తాఫీమ్’ అనే బాలుడికి త్వరలోనే ప్రోస్తెటిక్ ఉపకరణం అందనుండటం ఆ కుటుంబంలో పెద్ద ఊరటనిచ్చింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎదుటివారి బాధను తన బాధగా భావించి సేవ చేసే వారే సమాజానికి దిక్సూచలని కొనియాడారు. జిల్లాలో ఎవరికైనా ప్రోస్తెటిక్ (కృత్రిమ) ఉపకరణాలు అవసరమైతే 7799506500 నంబర్‌ను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు, అధికారులకు ఆయన మెమొంటోలను అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో డి.ఆర్.డి.ఏ. పి.డి. శ్రీదేవి, సంక్షేమ శాఖ అధికారి వినోద్ కుమార్, పలమనేర్ హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపకులు గణేషన్, రవికుమార్ తదితరులు పాల్గొని దివ్యాంగుల పట్ల తమకున్న అంకితభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమం కేవలం ఒక వైద్య శిబిరంలా కాకుండా, దివ్యాంగుల జీవితాల్లో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికిన ఘట్టంగా నిలిచిపోయింది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Chittoor,Chittoor,Andhra Pradesh



