ముంబై జట్టులోకి కేశవ్ మహరాజ్


ముంబై: ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుస ఓటములతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. కాగా, ఆ జట్టు ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకుంది. స్టార్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ గాయం కారణంగా దూరం కావడంతో అతని స్థానంలో దక్షిణాఫ్రికా సీనియర్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఎడమచేతి వాటం బౌలర్ అయిన కేశవ్ మహరాజ్‌కు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో అనుభవం ఉంది. టీ20 ఫార్మాట్‌లో పరుగులను నియంత్రించడంలో అతను దిట్ట. 2021 టీ20 ప్రపంచకప్‌లో కనీసం ఒక్క టీ20 కూడా ఆడకుండానే జట్టులోకి ఎంపికైన మహారాజ్, తన మొదటి బంతికే వికెట్ తీసి సంచలనం సృష్టించాడు. దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు కెప్టెన్‌గా పనిచేసిన అనుభవం కూడా అతనికి ఉంది. తన చివరి 30 టీ20 మ్యాచుల్లో 31 వికెట్లు తీసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే కేశవ్ మహారాజ్ గతంలో ఐపీఎల్ ఆడినప్పటికీ అది చాలా తక్కువ కాలమే. 2024 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో వచ్చిన అతను కేవలం రెండు మ్యాచుల్లో మాత్రమే మైదానంలోకి దిగాడు. ఆ రెండు మ్యాచుల్లో రెండు వికెట్లు తీసి పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కాబట్టి అతనికి ఐపీఎల్‌లో పెద్దగా ట్రాక్ రికార్డ్ లేదనే చెప్పాలి. అయితే సీపీఎల్, బీపీఎల్ వంటి అంతర్జాతీయ లీగ్‌లలో ఆడిన అనుభవం అతనికి ఉంది. ఇప్పుడు కష్టాల్లో ఉన్న ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగుతున్న మహారాజ్, తనకున్న కొద్దిపాటి ఐపీఎల్ అనుభవం, అంతర్జాతీయ పరిజ్ఞానంతో ఏ మేరకు రాణిస్తాడనేది ప్రశ్నార్థకంగా మారింది.

The post ముంబై జట్టులోకి కేశవ్ మహరాజ్ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *