. ఇకపై ఉత్తరాంధ్రకే వలసలు
. పెట్టుబడుల్లోనే కాదు… ప్రాజెక్టుల అమల్లోనూ ఏపీదే అగ్రస్థానం
. డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
. విశాఖ రైల్వేజోన్ ప్రకటనపై హర్షం
విశాలాంధ్ర బ్యూరో – విశాఖపట్నం : ఏపీలో మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. రాష్ట్ర భవిష్యత్తును మార్చివేయగల ప్రతిష్టాత్మక గూగుల్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరిగింది. గూగుల్ రాక విశాఖకే కాదు ఏపీకి ఒక గేమ్‌ఛేంజర్. విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా కేంద్రానికి కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్, సీఎం చంద్రబాబు, ఐటీశాఖ మంత్రి లోకేశ్, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ భూమిపూజ చేశారు. గూగుల్ క్లౌడ్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ కోలీ, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఎండీ కరణ్ అదానీ హాజరయ్యారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. భారత్‌కు ఆంధ్రప్రదేశ్ అంతర్జాతీయ డేటా గేట్‌వేగాను, డిజిటల్ భవిష్యత్తుకు సెర్చ్ ఇంజిన్‌గా మొదలైన గూగుల్, ఇప్ప్పుడు భారత్ గ్రోత్ ఇంజిన్‌గా మారబోతోందని చంద్రబాబు అభివర్ణిం చారు. విశాఖ పట్నం… ఐటీపట్నం కాబోతోందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కితాబిచ్చారు. పీఎం మోదీ, సీఎం చంద్రబాబు విజన్‌కు సెల్యూట్ చెప్పారు. వైజాగ్‌లో ‘G’ అంటే గూగుల్ అనే సౌండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందని, డబుల్ ఇంజిన్ బుల్లెట్ రైలు సర్కార్, చంద్రబాబు నాయకత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఆంధ్రప్రదేశ్ ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నాయని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. సెర్చ్ ఇంజిన్‌గా మొదలైన గూగుల్… విశాఖలో ఏర్పాటు చేయబోతున్న డేటా సెంటర్ ద్వారా దేశానికే గ్రోత్ ఇంజిన్ కాబోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. టెక్నాలజీ రంగంలో ఏపీలో కొత్త శకానికి శ్రీకారం చుడుతున్న రోజుగా 2026 , ఏప్రిల్ 28వ తేదీ గుర్తుండిపోతుందని చెప్పారు. గూగుల్ క్లౌడ్ ఏఐ హబ్ ఏర్పాటుకు మంగళవారం విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం తర్లువాడలో సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్, గూగుల్ గ్లోబల్ ఇన్ ఫ్రా, క్లౌడ్ వైస్ ప్రెసిడెండ్ బికాస్ కోలే శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, హైదరాబాద్ లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ లారా విలియమ్స్, బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్, భారతీ ఎంటర్ ప్రైజెస్ వైస్ చైర్మన్ రాకేశ్ మిత్తల్, అదానీ గ్రూప్ చైర్ పర్సన్ జీత్ అదానీ, గూగుల్ ఇండియా ప్రతినిధి ప్రీతి లొబానా పాల్గొన్నారు. అదానీ కనెక్స్, ఎయిర్ టెల్ నెక్స్ ట్రా భాగస్వామ్యంతో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో క్లౌడ్ డేటా సెంటర్ ను గూగుల్ ఏర్పాటు చేస్తోంది. 1 గిగావాట్ హైపర్ స్కేల్ ఏఐ డేటా సెంటర్ ను ఏర్పాటు చేస్తున్నారు. తర్లువాడ, రాంబిల్లి, అడవివరం ప్రాంతాల్లో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు 601 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. శంకుస్థాపనకు ముందు గూగుల్ ఎక్స్ పీరియెన్స్ జోన్‌ను సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ “ఏపీ చరిత్రలో కొత్త టెక్ శకానికి శ్రీకారం చుడుతున్న రోజు ఇది అన్నారు . గూగుల్ రాక విశాఖకే కాదు ఏపీ¾కి ఓ గేమ్ చేంజర్ అని , 30 ఏళ్ల క్రితం సైబరాబాద్ నగరాన్ని ఐటీ సిటీగా నిర్మాణం చేస్తే సంపద సృష్టికి కేంద్రమైందన్నారు. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుతో భారత చరిత్రలో 2026, ఏప్రిల్ 28వ తేదీ శాశ్వతంగా నిలిచిపోతుందన్నారు. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో టెక్నాలజీ రంగంలో ఏపీ తలెత్తుకుని నిలబడుతుందన్నారు. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఇది అని , దేశానికి ఏఐ డేటా గేట్ వేగా ఏపీ నిలుస్తుందన్నారు. సెర్చ్ ఇంజిన్‌గా మొదలైన గూగుల్ సంస్థ , భారత్ గ్రోత్ ఇంజన్‌గా మారుతుందన్నారు. ప్రతి ఒక్కరూ గూగుల్‌లో సెర్చ్ చేస్తే గూగుల్ ఏపీని సెలెక్ట్ చేసుకుందని ముఖ్యమంత్రి చెప్పారు. ఏపీ ప్రభుత్వం అందిస్తున్న స్పీడ్ ఆఫ్ గవర్నెన్సుకు గూగుల్ ఏఐ డేటా సెంటర్ నుంచి కూడా సహకారం తీసుకుంటామని, సీఎంఓలోని నలుగురు కార్యదర్శులతో పాటు నాకు కొత్తగా ఏఐ అసిస్టెంట్ కూడా సుపరిపాలన అందించేందుకు సహకారం అందిస్తుందన్నారు. గూగుల్ రావటంతో విశాఖలోని యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఉత్తరాంధ్ర అంటే గతంలో వలసలు, వెనకబాటుతనం, నిరుద్యోగం గుర్తుకు వచ్చేవని, ఇప్ప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోతుందన్నారు. ఇకపై ఇతర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్రకే వలస వస్తారన్నారు. విశాఖ ఇకపై నైపుణ్యానికి కేంద్రంగా నిలవనుందన్నారు. విశాఖకు గూగుల్ సెంటరును తీసుకురావడంలో లోకేశ్ చొరవను ప్రశంసిస్తున్నానన్నారు. లోకేశ్ తొలిసారి గూగుల్ సెంటర్ సందర్శించినప్ప్పుడు విశాఖకు గూగుల్ వస్తుందని ఎవరూ ఊహించలేదని, కానీ ఆ తర్వాత అది సాకారమైందన్నారు. గూగుల్ సంస్థ ఇండియాలో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని భావించినప్ప్పుడు ప్రధానిని కలిసి, రాష్ట్రానికి గూగుల్ పెట్టుబడులు పెట్టేందుకు సహకరించాలని కోరారని తెలిపారు. గూగుల్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తే పూర్తిగా సహకరిస్తామని ప్రధాని మోదీ చెప్పారని గుర్తు చేశారు. మొత్తానికి లోకేశ్ చొరవ, ప్రధాని సహకారంతో విశాఖలో గూగుల్ ప్రాజెక్ట్ సాకారమైందన్నారు. ప్రతిష్టాత్మక అదానీ గ్రూప్, ఎయిర్ టెల్ వంటి దిగ్గజ సంస్థలు ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తాయని, 2028 సెప్టెంబరు నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేసి ప్రారంభించాలని కోరుతున్నట్లు చెప్పారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ఈ ప్రాంతానికి నీటి సమస్య లేదని, 60 రోజుల్లోనే గోదావరి నీరు విశాఖకు తీసుకువస్తామని సీఎం భరోసా ఇచ్చారు.
విశాఖకు మరిన్ని హంగులు
గ్లోబల్ సిటీగా మారిన విశాఖకు మరిన్ని హంగులు రాబోతున్నాయన్నారు. జూన్ 1వ తేదీ నుంచి సౌత్ కోస్టల్ రైల్వే జోన్ కు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు సీఎం ధన్యవాదాలు తెలిపారు. తూర్పు, పశ్చిమ కారిడార్ ను కలపటం ద్వారా ఈ ప్రాంతాన్ని లాజిస్టిక్స్ పరంగా కూడా అభివృద్ధి చేయవచ్చునన్నారు. జులైలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభింప చేస్తామన్నారు. 2028 నాటికి ఆర్సెలార్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ నుంచి కూడా తొలి షిప్‌మెంట్ ఎగుమతి అవుతుందన్నారు. రెన్యూ పవర్ ద్వారా ఇంగాట్ సోలార్ వేఫర్స్ ఉత్పత్తి కూడా మొదల వుతుంది. అనకాపల్లి జిల్లా మరో రంగారెడ్డి జిల్లాగా తయారై అభివృద్దికి కేంద్రం అవుతుందన్నారు. ఇక బులెట్ ట్రైన్ ప్రాజెక్టుతో రాష్ట్రంలోని వివిధ రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని, వచ్చే నాలుగేళ్లలో ఈ ప్రాజెక్టులు సాకారమయ్యేలా చూడాలని రైల్వే మంత్రిని కోరారు. దేశంలోకి వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వచ్చాయన్నారు. ఒప్పందాలకు, పెట్టుబడులకే కాదు, ప్రాజెక్టుల గ్రౌండింగ్ లో కూడా ఏపీ నెంబర్ 1గా ఉందని సీఎం అన్నారు. పోలవరం ప్రాజెక్టు 2027 నాటికి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని, 90 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి ఇప్పటికే ఒప్పందం చేసుకున్నాం అని ముఖ్యమంత్రి వెల్లడించారు. వైజాగ్‌లో ‘G’ అంటే గూగుల్ అనే సౌండ్ ప్రపంచవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోందని మంత్రి లోకేశ్ అన్నారు. డబుల్ ఇంజిన్ బుల్లెట్ రైలు సర్కార్, చంద్రబాబు నాయకత్వం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ ఈ మÖడు అంశాలు ఆంధ్రప్రదేశ్ ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నాయని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, అనిత, గుమ్మిడి సంధ్యారాణి, ఎంపీ శ్రీ భరత్ , ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, పి. విష్ణు కుమార్ రాజు, వెలగపూడి రామకృష్ణ బాబు, సిహెచ్.వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్ బాబు , ఉత్తరాంధ్ర జిల్లాల ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.


