దిగ్బంధనం తొలగించే వరకు చర్చలుండవ్


స్పష్టం చేసిన ఇరాన్ అధ్యక్షుడు సౌద్

దుబాయ్: అమెరికా-ఇరాన్ మలి విడత చర్చలపై ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. దిగ్బంధనం తొలగించే వరకూ చర్చలు జరపబోమని ఇరాన్ స్పష్టం చేస్తోంది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌కు పాకిస్థాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ ఫోన్ చేశారు. ప్రాంతీయంగా ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై వారిద్దరూ చర్చించారు. ఇరాన్ శాంతినే కోరుకుంటోందని పెజెష్కియాన్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అయితే దిగ్బంధనం సహా నిర్వహణ పరమైన అడ్డంకులన్నింటినీ అమెరికా తొలగిస్తేనే… మళ్లీ శాంతి చర్చలు జరుగుతాయని స్పష్టం చేశారు. మరోవైపు పాక్ అగ్ర నేతలతో శనివారం సమావేశమైన అనంతరం ఒమన్‌కు వెళ్లిన ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ… అక్కడి నుంచి ఆదివారం రాత్రి తిరిగి ఇస్లామాబాద్‌కే వచ్చారు. పాక్ సైన్యాధిపతి ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్‌తో భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై వారు మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. దీంతో అమెరికా-ఇరాన్ మలి విడత చర్చలపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. తమ మధ్యవర్తిత్వంలో వాటి మధ్య పరోక్ష చర్చలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పాక్‌కు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులు తెలిపారు. ఇస్లామాబాద్ నుంచి అరాగ్చీ ఆదివారం రాత్రే మాస్కోకు బయలుదేరి వెళ్లారు. హోర్మూజ్ జలసంధిలో భద్రతతో పాటు యుద్ధం ముగింపు దిశగా జరుగుతున్న ప్రయత్నాల గురించి ఒమన్ పర్యటనలో సుల్తాన్ హైథమ్ బిన్ తారిఖ్ అల్-సయీద్‌తో అరాగ్చీ చర్చించారు.
ఇరాన్ మెరుగైన ప్రతిపాదన పంపింది: ట్రంప్
పాకిస్థాన్‌కు తమ రాయబారులను పంపబోమని ప్రకటించిన 10 నిమిషాల్లోనే ఇరాన్ మంచి ప్రతిపాదనలే పంపిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే సంబంధిత వివరాలు మాత్రం ఆయన వెల్లడించలేదు. యుద్ధం ముగింపునకు అమెరికా, ఇరాన్ ప్రతినిధులు ఫోన్‌లో చర్చలు జరుపుకోవచ్చని ట్రంప్ అన్నారు. ‘వాళ్లు (ఇరాన్ నేతలు) మాట్లాడాలని అనుకుంటే… మా దగ్గరికి రావొచ్చు. లేదంటే ఫోన్ చేయొచ్చు’ అని ఆదివారం ఓ వార్తాసంస్థతో ముఖాముఖిలో ఆయన పేర్కొన్నారు.

The post దిగ్బంధనం తొలగించే వరకు చర్చలుండవ్ appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *