సంక్షేమం…అభివద్ధి


. సమతూకంతో కూటమి పాలన
. పీపీపీతోనే ప్రగతి…పురోగతి
. లక్ష కోట్లతో ఉద్యాన హబ్‌గా రాయలసీమ
. వచ్చే మూడేళ్లూ విద్యుత్ చార్జీలు పెంచబోం
. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం పూర్తి
. స్వర్ణాంధ్ర విజన్`2047తో అగ్రగామిగా ఏపీ
. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : కూటమి అధికారంలోకి వచ్చాక సంక్షేమం- అభివృద్ధి సమతూకంగా సుపరిపాలన ప్రజలకు అందుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్నికల్లో వాగ్దానాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని గాడిలో పెట్టడంతో పాటు, అభివృద్ధి బాట పట్టించా మని వెల్లడించారు. అసెంబ్లీలో శుక్రవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. గత 20 నెలలుగా కూటమి ప్రభుత్వం అంచనాలకు మించి అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిందని వివరించారు. “గత ప్రభుత్వ పాలనలో జరిగిన విధ్వంసంపై కూటమి అధికారంలోకి రాగానే 7 శ్వేత పత్రాలను విడుదల చేశాం. వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రాన్ని ఆదుకున్న కేంద్రానికి ధన్యవాదాలు. నెలకు రూ. 2,750 కోట్ల మేర ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌గా అందిస్తున్నాం. ఏడాదికి ఒక్క పెన్షన్లకే రూ.33 వేల కోట్ల మేర నిధులు వెచ్చిస్తున్నాం. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా అందరికీ ఆర్ధిక సాయం అందించాం. స్త్రీశక్తి పథకం ద్వారా ఇప్పటి వరకూ 43.5 కోట్ల ప్రయాణాలు జరిగాయి. దీపం 2.0 ద్వారా ఏడాదికి 3 సిలిండర్లు ఉచితంగా మహిళలకు అందిస్తున్నాం. అన్నదాత సుఖీభవ ద్వారా రూ.20 వేల రూపాయలు మూడు విడతల్లో రైతులకు అందిస్తున్నాం. అన్న క్యాంటీన్లను అన్ని నియోజకవర్గాల్లోనూ ఏర్పాటు చేస్తున్నాం. సమాజంలో ఆర్ధికంగా వెనుకబడి ఉన్న వారందరినీ ఆదుకునేలా సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం. పీ4 ద్వారా భవిష్యత్‌లో మంచి ఫలితాలు వస్తాయి. సంపద ఉంటేనే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయగలం. సంపద పంచగలం. అందుకే జీరో పావర్టీ ద్వారా పేదరిక నిర్మూలన కార్యక్రమాన్ని రాష్ట్రంలో చేపట్టాం. అట్టడుగు స్థాయిలో ఉన్న వారికి చేయూత అందించేందుకు పీ4 కార్యక్రమం. పేదరిక నిర్మూలనకు సంబంధించి దేశంలోనే ఇది అత్యుత్తమ మోడల” అని సీఎం చంద్రబాబు చెప్పారు. పీపీపీ వల్ల సంపద సృష్టి జరుగుతోంది. రోడ్లు, పోర్టులు, ఎయిర్ పోర్టులు ఈ విధానంలోనే నిర్మితం అవుతున్నాయని తెలిపారు. పీపీపీ విధానంలో ప్రాజెక్టు నిర్మించి నిర్వహిస్తారని... నిర్దిష్ట కాలపరిమితి తర్వాత ప్రభుత్వానికి అప్పగిస్తారు. అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తికి సంబంధించి ఏపీ, మహారాష్ట్ర ఓ మోడల్ అవుతాయని... సోలార్ ప్యానళ్లను ఇళ్లపై ఏర్పాటు చేసుకుని గ్రిడ్ కు అనుసంధానిస్తామన్నారు. మెగా డీఎస్సీ హామీ ఇచ్చి ఏడాది లోగానే టీచర్లకు పోస్టింగులు ఇచ్చామని, కానిస్టేబుళ్ల నియామకాలు పూర్తి చేసి స్టైఫండ్ ను రూ.4,500 నుంచి రూ.12,500కు పెంచినట్లు తెలిపారు. భూమి ఇవ్వకుండా, ప్రోత్సాహకాలు ఇవ్వకుండా పరిశ్రమలు, ఉద్యోగాలు ఎలా వస్తాయని సీఎం ప్రశ్నించారు. విశాఖలో గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్ పరిశ్రమలు వస్తున్నాయి. అనకాపల్లిలో ఆర్సెల్లార్ మిట్టల్ కూడా స్టీల్ ప్లాంట్‌ను, రామాయపట్నం వద్ద బీపీసీఎల్ రూ.70 వేల కోట్లతో రిఫైనరీని ఏర్పాటు చేస్తోందని తెలిపారు. భాగస్వామ్య సదస్సులో రూ.13.5 లక్షల కోట్ల పెట్టుబడులకు గాను 610 ఎంఓయులు చేసుకున్నామని... మొత్తంగా రూ.20 లక్షల కోట్ల పెట్టుబడుల ద్వారా 23 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. 20 లక్షల ఉద్యోగాలను ఐదేళ్లలో ఇస్తామన్న హామీని నిలబెట్టు కుంటామని సీఎం స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం జాతికి అంకితం పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నెలలోగా గోదావరి పుష్కరాలకు ముందే జాతికి అంకితం చేస్తామని సీఎం స్పష్టం చేశారు. వచ్చే మూడేళ్లలో ఉత్తరాంధ్రలోని అన్ని ప్రాజెక్టులనూ పూర్తి చేస్తామన్నారు. పోలవరం- వంశ ధారను లింక్ చేస్తామని తెలిపారు. సముద్రంలో కలిసే గోదావరి జలాల్లో 200 టీఎంసీలు నల్లమల సాగర్ కు తరలిస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు తెలంగాణా అభ్యంతరం చెప్పటం సరికాదన్నారు. తెలుగు జాతిగా రెండు రాష్ట్రాలూ నీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అవసరమైతే ఈ అంశాన్ని సంప్రదింపుల ద్వారా ఓ నిర్ణయానికి రావచ్చునన్నారు. రూ. 1 లక్ష కోట్లతో రాయలసీమను ఉద్యాన హబ్ గా తయారు చేస్తాం. రూ.30 వేల కోట్ల మేర ప్రభుత్వ నిధులు, రూ.70 వేల కోట్లు ప్రైవేటు పెట్టుబడులతో సీమలో హర్టీకల్చర్ అభివృద్ధి చేస్తామని వివరించారు. వచ్చే మూడేళ్లలోనూ విద్యుత్ ఛార్జీల పెంచబోం గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల విద్యుత్ వాడకుండానే సోలార్, విండ్ ప్రాజెక్టుల్లో రూ.9 వేల కోట్లు కట్టాల్సి వచ్చిందని, ఫ్యూయల్ సర్‌చార్జి భారం రూ.12,617 కోట్ల మేర వేశారన్నారు. మొత్తంగా గత ప్రభుత్వం రూ.1,22,422 కోట్ల విద్యుత్ బకాయిలు మిగిల్చిందన్నారు. 78 నుంచి 90 శాతం మేర కరెంటు చార్జీల భారం ప్రజలపై వేశారన్నారు. విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని... అందుకే రూ.4,860 కోట్ల ట్రూ అప్ భారాన్ని ప్రభుత్వమే భరిస్తోందన్నారు. వచ్చే మూడేళ్ల లోనూ విద్యుత్ చార్జీలు పెంచబోమని హామీ ఇస్తున్నామని సీఎం ప్రకటించారు. లాజిస్టిక్స్ రంగంలో భారీ మార్పులు సాధించేలా చర్యలు తీసుకుంటున్నాం. రైల్వే రంగంలో రూ.3 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు చేపట్టేలా ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. రెండేళ్లలో ఇచ్చాపురం నుంచి దిగువ వరకూ నాలుగు లేన్ల ట్రాక్ వచ్చే అవకాశం ఉందని... తద్వారా కార్గో, ప్రయాణికుల మార్గాలు విస్తృతం అవుతాయన్నారు. జాతీయ రహదారులు కూడా పెద్దఎత్తున నిర్మించేలా కేంద్రం ప్రాజెక్టులు ప్రతిపాదించిందని చెబుతూ డబుల్ ఇంజిన్ సర్కారులో త్రిబుల్ ఫలితాలు వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం వివరించారు. స్వర్ణాంధ్ర విజన్2047తో ఏపీ అగ్రగామి
2047 స్వర్ణాంధ్ర విజన్ ద్వారా ఏపీని అగ్రస్థానంలో నిలిపేలా ప్రణాళికలు చేశామని సీఎం చంద్రబాబు తెలిపారు. పది సూత్రాల ద్వారా ఈ విజన్ ను సాధించేందుకు లక్ష్యాలు నిర్దేశించుకున్నామన్నారు. 2.4 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా ఏపీని తీర్చిదిద్దుతాం… 2047కు భారత్ నెంబర్ వన్ ఎకానమీగా ఉంటుంది…అందులో ఏపీ అగ్రస్థానానికి చేరుతుందని సీఎం వెల్లడించారు. ‘అత్యధిక తలసరి ఆదాయం, జీవన ప్రమాణాలు ఉండాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం. హెల్తీ, వెల్తీ హ్యాపీ ఏపీ అనే విధానం మాది. ప్రతి ఐదేళ్లకూ తలసరి ఆదాయం రెట్టింపు అయ్యేలా ప్రణాళికలు చేపడుతున్నాం. మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా ఈ అంశాలపై దృష్టి సారించాలి. పాలసీలు కూడా నిరంతరం సమీక్షించుకుంటూ ముందుకు సాగుదాం. ఈ రెండేళ్లలో సాధించిన విజయాలు మననం చేసుకుంటూ మరింత ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుందాం” అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.

The post సంక్షేమం…అభివద్ధి appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *