టీడీపీ, వైసీపీ సవాళ్లు… ప్రతి సవాళ్లు
. మండలిలో అదే వేడి… అదే మాటల దాడి
. వైసీపీ వాకౌట్… చర్చకు సిద్ధమన్న మంత్రి లోకేశ్
. మొత్తం రూ.8,500 కోట్ల ఫీజు బకాయిలు : వైసీపీ
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: శాసన మండలిలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య రెండో రోజూ అదే మాటల యుద్ధం కొనసాగింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. శుక్రవారం శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషెన్‌రాజు అధ్యక్షతన ప్రశ్నోత్తరాలలో మళ్లీ వివాదం కొనసాగింది. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల అంశంపై వైసీపీ సభ్యులు కష్ణ రాఘవ జయేంద్ర, భరత్, రమేశ్ యాదవ్ తదితరులు అడిగిన ప్రశ్నకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నుంచి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో సభ్యులు అనేక సార్లు ప్రభుత్వంపై విమర్శల అస్త్రం సంధించగా… దానికి ధీటుగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా వీరబాలాంజనేయ స్వామి, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ బదులీయగా, వైసీపీ సభ్యులు సంతప్తి చెందలేదు. ఎమ్మెల్సీ భరత్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో రూ.8,500 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలున్నాయని, ఇప్పటికి కేవలం రూ.700 కోట్లు మాత్రమే కూటమి ప్రభుత్వ చెల్లించిందని వివరించారు. ఇంకా రూ.7,800 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో తమ నేత జగన్ ఎప్పటికప్ప్పుడు బకాయిలు చెల్లించుకుంటూ వచ్చారని గుర్తు చేశారు. దీనికి మంత్రులు స్పందిస్తూ… గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే బకాయిలున్నాయనీ, వాటిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సక్రమంగా ఇస్తున్నారని చెప్పారు. దానికి వైసీపీ సభ్యులు అడుగడుగునా అడ్డుతగిలారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రూ.4064.59 కోట్ల బకాయిలు ఉన్నాయని, అన్ని ఆధారాలు సభ ముందు ఉంచుతామని లోకేశ్ చెప్పగా… దానికి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
చర్చకు సిద్ధం : మంత్రి లోకేశ్
వైసీపీ హయాంలో రూ.4064.59 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయని, వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని, ఆరోపణలు చేసి వెళ్లిపోవడం సరికాదని, వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్‌గా మారిందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. 20202021 ఏడాది క్వార్టర్లీ-4 పెండింగ్ రూ.683.1 కోట్లు, 2023-24 క్వార్టర్లీ-2, క్వార్టర్లీ-3, క్వార్టర్లీ4 బకాయిలు రూ.1753.98 కోట్లు, 2023-24 ఏడాది గమనిస్తే… ఎంటీఎఫ్‌కు సంబంధించి రూ.895 కోట్లు బకాయిలు పెట్టారని వివరించారు. వైసీపీ ప్రభుత్వం మారే సమయంలో రూ.645 కోట్ల బకాయిలు చెల్లించలేదని, విద్యాశాఖ మంత్రిగా మాట్లాడేందుకు నాకు హక్కు ఉందని, దీనిని నేను టేబుల్ చేస్తానని, మీరు సిద్ధమేనా అని ప్రశ్నించారు. వైసీపీ సభ్యులు అబద్ధాలు చెప్పి బయటకు వెళుతున్నారని, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 70 వేల మంది విద్యార్థులు పెరిగారని, అదీ ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి అని ఆయన వివరించారు. ‘వాకౌట్ చేయడం వైసీపీకి ఫ్యాషన్. ఈ తలుపు నుంచి వెళతారు. హాయిగా టీ తాగి ఆ తలుపు నుంచి వస్తారు. చిత్తశుద్ధి ఉంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. వైసీపీ హయాంలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలకు దూరం అయ్యారు. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని మంత్రి లోకేశ్ తెలిపారు. వైసీపీ ఐదేళ్ల కాలంలో కనీసం పుస్తకాలు బ్యాగ్‌లు ఇవ్వలేదని, మధ్యాహ్న భోజనం రద్దు చేసి వెళ్లిపోయారన్నారు. ఇప్ప్పుడు మమ్మల్ని ప్రశ్నించే నైతిక హక్కు లేదని, మేం ఇంటర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పునరుద్ధరించామని, పుస్తకాలు ఇస్తున్నామని, 10, ఇంటర్ విద్యార్థులకు 100 రోజుల ప్రణాళిక అమలు చేస్తున్నామని చెప్పారు.
దమ్ముంటే బకాయిలు నిరూపించాలి : బొత్స సవాల్
తమ ప్రభుత్వ హయాంలో తానే విద్యాశాఖ మంత్రిగా ఉన్నానని, దమ్ముంటే బకాయిలు ఉన్నట్లు నిరూపించాలని వైసీపీ సభ్యుడు బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా మంత్రి లోకేశ్‌కు సవాల్ విసిరారు. తాము మీ తరహాగా సత్యదూరమైన మాటలు మాట్లాడబోమని, విద్యా వ్యవస్థను ఈ ప్రభుత్వ భ్రష్టు పట్టించిందని చెప్పారు. ఈ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ మనుగడ సాగిస్తుందనేదీ ప్రజలకు విశ్వాసం లేదన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ రెండు వాయిదాలే పెండింగ్‌లో ఉన్నాయన్నారు. నేను రికార్డుల్లో లెక్కల ప్రకారమే మాట్లాడతున్నానని… మీకు వీలైతే అధికారులను పిలిపించండి… ఇక్కడే వాస్తవాలు తేలుతాయన్నారు. ఈ ప్రభుత్వ వచ్చాక ఎన్ని ప్రైవేట్ జూనియర్ కళాశాలలు వచ్చాయో లెక్కలు తీయాలని, కొత్తగా ఒక్క ప్రభుత్వ జూనియర్ కళాశాలను కూడా తీసుకు రాలేదంటూ ఘాటుగా విమర్శించారు. మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ అసలు మేం బకాయిలు పెట్టలేదని, ఏ క్వార్టర్‌కు… ఆ క్వార్టర్ చెల్లింపులు చేశామంటూ వైసీపీ సభ్యులు అవాస్తవం చెబుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,859 కోట్లు చెల్లించిందని వివరించారు. ఈ విద్యా సంవత్సరంలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు బకాయిలు పూర్తిగా చెల్లించామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కొన్ని తప్ప్పుడు విధానాల ద్వారా చెల్లింపులు చేసిందని, అన్నింటినీ అధిగమించి ముందుకు వెళతామని చెప్పారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో నాడు`నేడు కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల రూపులేఖలను మార్చామని, గత ప్రభుత్వ హయాంలో మధ్యలో ఆగిపోయిన పనులు పూర్తి చేయాలన్నారు. దీనిపై బొత్స స్పందిస్తూ… వైసీపీ హయాంలో రూ.4 వేల కోట్లకు పైగా బకాయిలు లేవని, రెండు వాయిదాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఇంటర్ విద్యను పట్టించుకోవడం లేదని, ఇందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నామని ఆయన అన్నారు.


