గుల్ల కాంతారావు
ఒక పని తలపెట్టినప్పుడు దాని పర్యవసానాలను ముందుగానే అంచనా వేయాలి. మంచిచెడులను ఆలోచించాలి. విచక్షణ, సంయమం అనేవి వ్యక్తులకైనా, ప్రభుత్వాలకైనా తప్పనిసరి. ఇవి లోపించినప్పుడు, ఆ నిర్ణయాల దుష్పరిణామాలు సమాజంపై ప్రభావం చూపిస్తాయి. ప్రస్తుతం సహజ వనరుల వినియోగం పేరుతో తీసుకుంటున్న విధాన నిర్ణయాలు ఇదే ప్రమాదాన్ని సూచిస్తున్నాయి. కార్పొరేట్లకు అనుకూలంగా మారుతున్న విధానాల కారణంగా బీచ్ శాండ్ మినరల్స్ తవ్వకాల విషయంలో కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు భవిష్యత్తులో పెను ముప్పుగా మారే అవకాశముందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. “అభివృద్ధి” పేరుతో సహజ సంపదను కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నం జరుగుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఖనిజాల కోసం పోటీ : కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కలిసి ఖనిజ సంపద వినియోగంపై వేగంగా ముందుకువెళ్తున్నాయి. సముద్ర గర్భం, తీరప్రాంతాల్లో ఖనిజ తవ్వకాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. 2021లో రూపొందించిన డీప్ ఓషన్ మిషన్ కింద కేంద్రం రూ.4,000 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. జాతీయ భద్రతా మండలి సచివాలయం (ఎనఎస్‌సీఎస్), సర్వే ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారం 11,098 కిలోమీటర్ల మేర భారత సముద్ర తీరాన్ని ఖనిజ తవ్వకాల కోసం గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలను “రేర్ ఎర్త్ కారిడార”గా ప్రకటించి, భారీ స్థాయిలో మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన కార్యకలాపాలకు సిద్ధం చేస్తున్నారు. మోడీ ప్రభుత్వ వికసిత్ భారత్, చంద్రబాబు ప్రభుత్వ విజన్ 2047 ఈ రెండింటి వెనుక ప్రజల సహజ వనరులు, ఖనిజ సంపదను కార్పొరేట్లకు కట్టబెట్టే ఉద్దేశమే దాగుంది తప్ప ప్రజల ప్రయోజనాలు ఉన్నట్టు కనబడ్డంలేదు. అంబానీ, ఆదానీ వంటి వాళ్లకు తీరప్రాంతాల్లోని అరుదైన ఖనిజం వారి చేతుల్లో పెట్టే పనిలో వుంది సర్కార్ . ఖన్పుి తవ్వకాలకు ముందుకొచ్చే కార్పొరేట్లకు 2026-27 బడ్జెట్‌లో రూ.7,280 కోట్లు కేటాయించి, కార్పొరేట్ సంస్థలకు పెట్టుబడి ప్రోత్సాహకాలు, రాయితీలు ఇవ్వడానికి కేంద్రం సిద్ధమైంది. అరుదైన ఖనిజాలను దేశీయ అవసరాలకంటే ఎగుమతుల ద్వారా లాభాలు పొందడంపైనే దృష్టి పెట్టినట్లు కనిపిస్తోంది.
అమెరికా-చైనా పోటీ ప్రభావం : ప్రపంచవ్యాప్తంగా రేర్ ఎర్త్ ఖనిజాలపై పోటీ పెరుగుతోంది. ప్రపంచ ఖనిజ ఉత్పత్తిలో 70%, శుద్ధిలో 90% చైనా ఆధిపత్యం ఉంది. వాణిజ్యపరంగా తమ దేశ ప్రయోజనాల విషయంలో చైనా కఠినంగా వ్యవహరించడం అమెరికా తట్టులేకోలేకపోతుంది. భారత్‌లా చైనా తలదించుకొని పరువు పోగొట్టుకోవడం లేదు. చైనా ఎగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధించినప్ప్పుడు, తానేమాత్రం తగ్గకుండా ప్రతిగా అమెరికా వస్తువులపై చైనా కూడా సుంకాలు విధించింది. ఖన్పుి ఎగుమతులు, వాటి శుద్ధి సాంకేతికతపై తాత్కాలిక నియంత్రణ విధించడంతో అమెరికా గిలగిలలాడింది. ఖనిజ దిగుమతిపై చైనాపై ఆధారపడకుండా ప్రత్యామ్నాయాలు వెతకడం అమెరికా ప్రారంభించింది. సొంత ఉత్పత్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తూనే, ఆస్ట్రేలియా, కెనడా, బ్రెజిల్, భారత్ నుంచి ఎగుమతి చేసుకోవడం సురక్షితమని అమెరికా భావిస్తోంది. తన టెక్నాలజీ, రక్షణ రంగానికి అవసరమైన ఖనిజ దిగుమతి చైనా నుంచి ఆగిపోతే, అత్యవసర పరిస్థితుల్లో తీవ్రమైన ఇబ్బందులుపడతామని గుర్తించి ఖనిజ నిల్వలను సిద్ధం చేసుకోవడానికి తాపత్రయపడుతోంది. అందుకే చైనా పై ఆధారపడకుండా, ప్రపంచంలోనే మూడో స్థానంలోని ఖనిజ నిల్వలున్న భారత్‌పై అమెరికా దష్టి పెట్టింది.
అమెరికా మాట కాదనని విశ్వగురువు మోడీ, మోడీకి అంగుదారునిగా తయారైన కూటమి ప్రభుత్వం ఖనిజ రంగంలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొస్తున్నాయి. అందుకనే రేర్ ఎర్త్ కారిడార్ పల్లవిని డబుల్ ఇంజన్ సర్కార్ ఎత్తుకున్నాయి. రాష్ట్ర పరిధిలోని హక్కులను బలహీనం చేసి, ఆధిపత్యం పెంచుకునే కేంద్ర దుశ్చర్యలపై కూటమి ప్రభుత్వం మాట్లాడ్డం లేదు. శాంతిభద్రతలు, సహజ వనరులు, ఖనిజాలు, మారిటైమ్, పట్టణ విధానం, భూ చట్టాలు, వ్యవసాయం వంటివి రాష్ట్ర పరిధిలో వున్నప్పటికీ, నేరుగా కేంద్రం జోక్యంచేసుకొని విదేశీ, స్వదేశీ కార్పొరేట్ల దోపిడికి అనుకూలమైన చట్టాలను కేంద్రం చేస్తోంది. రాష్ట్ర సహజ వనరులు, సంపదపై కార్పొరేట్ల గుత్తాధిపత్యం, దేశ, రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం. అయినా కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు వదిలిపెట్టి మోడీ భజన చేస్తోంది. చమురు నిల్వల కోసం యుద్ధాలు, ప్రభుత్వ మార్పులు వంటి చర్యలకు పాల్పడిన అమెరికా, ఇప్పుడు ఖనిజ వనరులపై ఆధిపత్యం సాధించడానికి ప్రయత్నిస్తోంది. సముద్ర గర్భంలో ఖన్పుి తవ్వకాల ప్రమాదాలను గుర్తించిన జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, న్యూజిలాండ్, కోస్టారికా వంటి అనేక దేశాలు డీప్ సీ మైనింగ్‌ను వ్యతిరేకిస్తున్నాయి. తమ చట్టసభల్లో డీప్`సీ మైనింగ్‌కు వ్యతిరేకంగా తీర్మానాలు చేశాయి.
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతం- ఖనిజ సంపద కేంద్రం : దేశ సముద్ర తీరంలో 48.2 కోట్ల టన్నుల ఖనిజ నిల్వలు ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. అందులో ఆంధ్రప్రదేశ్‌లోనే 1,053 కిలోమీటర్ల మేర తీరంలో 241 మిలియన్ టన్నుల బీచ్ శాండ్ నిల్వలు ఉన్నాయి. దేశంలోని బీచ్‌శాండ్ నిల్వలో రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్ వుంది. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీరప్రాంతంలో మోనజైట్ నిల్వలు 35% ఉన్నట్లు అంచనా. ఇల్మనైట్, జిర్కాన్, గార్నెట్, రూటైల్ వంటి ఖనిజాల నుంచి థోరియం, యురేనియం, టైటానియం లభిస్తాయి. ఇవి విమానయాన, రక్షణ, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్, స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రికల్ వాహనాలు, విండ్ టర్బైన్లలో వినియోగించడంతో ప్రపంచంలో ఈ ఖనిజాలకు డిమాండ్ పెరిగింది. విశాఖపట్నం భీమునిపట్నం, శ్రీకాకుళం, గార మండలాల్లో 2,500 ఎకరాల్లో మైనింగ్ ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్రంలో సుమారు 40 వేల ఎకరాల్లో ఖనిజ నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రపంచంలో ఎలక్ట్రిక్ మొబిలిటీ, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రానిక్స్, రక్షణ రంగ వృద్ధికి ప్రాధాన్యత పెరుగుతుందన్న నేపథ్యంలో 2030 నాటికి రేర్ ఎర్త్ పర్మినెంట్ మాగ్నెట్‌ల వినియోగం రెట్టింపు అవుతుందని అంచనా.
బీచ్ శాండ్ మైనింగ్ ప్రాసెసింగ్ పనులను అదానీ గ్రూప్‌కు చెందిన సంస్థలు చేపడుతున్నట్లు సమాచారం. కోర్టులు ప్రైవేట్ సంస్థలకు ఇలాంటి ఖనిజాల అప్పగింతపై ఆంక్షలు విధించినప్పటికీ, వాటిని పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. బీచ్‌శాండ్‌ను ప్రాసెసింగ్ చేసే క్రమంలో వచ్చే శబ్ధాలు, ప్రకంపనలు, సముద్రంలో విడిచిపెట్టే ఇంధనాలు, రసాయనాలతో మత్స్య సంపద భారీగా దెబ్బతినడంతో పాటు జీవ, మానవ మనుగడకు ప్రమాదం ఏర్పడుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక దిబ్బలు కోతకు గురైతే సమీప నివాసిత ప్రాంతాల్లోకి ఉప్ప్పునీరు ప్రవేశించి తాగునీటి సమస్య వచ్చే అవకాశం ఉంది. నిర్మాణాలు దెబ్బతింటాయి. సముద్ర తీరంలో ఔషధ, రసాయన పరిశ్రమలు విడిచిపెడుతున్న వ్యర్ధాలతో చేపలు ఉత్పత్తి తగ్గడంతో మత్స్యకారుల జీవనోపాధి తగ్గింది. ఇసుక తవ్వకాలతో కొద్దిపాటి ఉపాధి కూడా మత్స్యకారులకు లేకుండాపోతుంది. మోనజైట్ ఖన్పుిం నుంచి వెలువడే థోరియంతో చర్మ క్యాన్సర్, ఊపిరితిత్తులు వ్యాధులకు గురయ్యేవారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇన్ని అనర్ధాలు, నష్టాలు, దుష్ప్రభావాలున్నా, కార్పొరేట్ల ప్రయోజనాల కోసం ఇవన్నీ సాధారణ ప్రజలు అనుభవించాలన్నట్లు ప్రభుత్వాల తీరుంది. బీచ్ శాండ్ మైనింగ్ ముప్పును ఇప్పుడే అరికట్టకపోతే, భవిష్యత్ తరాలకు తిరిగి రాని నష్టం వాటిల్లడం ఖాయం. ఇది కేవలం పర్యావరణ సమస్య కాదు మనుగడకు సంబంధించిన ప్రశ్న.
సీనియర్ జర్నలిస్టు, సెల్ : 94900 99487


